రాష్ట్రీయం

ఐటి, పారిశ్రామిక విధానాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతోందని ఐటి విధానం, పారిశ్రామిక విధానం బాగుందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావుతో కలిసి మనోహర్ పారికర్ శనివారం టి-హబ్‌ను సందర్శించారు. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులను చూస్తుంటే ప్రభుత్వ పాలసీలు విజయవంతం అయినట్టేనని అన్నారు. ఐటి మంత్రి కెటిఆర్‌వి సృజనాత్మకమైన ఆలోచనలని, దీనికి తగ్గట్టుగా టిహబ్‌ను రూపొందించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఐటి, పారిశ్రామిక విధానాలు ఆదర్శవంతమైనవని అన్నారు. టిహబ్‌లో సౌకర్యాలను ఆయన పరిశీలించారు. టిహబ్ స్టార్ట్ అప్ కంపెనీలతో ముచ్చటించారు. డిఫెన్స్ రంగంలో పని చేస్తున్న స్టార్ట్ అప్ కంపెనీలతో ముచ్చటించి, వారికి సలహాలు ఇచ్చారు. అనంతరం టిహబ్‌లోని స్టార్ట్ అప్ నిపుణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి-హబ్ కార్యక్రమం అద్భుతమైనదని అన్నారు. మంత్రి కెటిఆర్ ఆలోచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం ఆయన నాయకత్వ ప్రతిభకు అద్దం పట్టే విధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్లడం, ప్రభుత్వం ప్రకటించిన విధానాలు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉన్నాయని అన్నారు. ఆకర్షణీయమైన మాటలు చెప్పడం సులభమే కానీ వాటిని ఆచరించడం కష్టమని, తెలంగాణ ప్రభుత్వం ఆచరించి చూపిస్తోందని అన్నారు. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులను చూస్తే ప్రభుత్వ విధానాలు విజయవంతం అయినట్టు చెప్పవచ్చునని అన్నారు. టిహబ్‌లో ఉత్సాహం, సృజనాత్మకత కలిగిన యువకులు ఉన్నారని, ఇలాంటి ఆలోచనలకు ఊతం ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. ప్రతి ఒక్కరు కలలు కనేందుకు బాగానే నిద్ర పోతారని కానీ ఆ కలలను నిజం చేసేందుకు ఉదయం లేచి ఆచరణ ప్రారంభించే వారు తక్కవగా ఉంటారని అన్నారు. కలలను నిజం చేసే వ్యక్తులు మంత్రి కెటిఆర్ బృందంలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నది తన నమ్మకమని, అలాంటి టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక రాజకీయ నాయకులు మారాలని, నూతన ప్రపంచ పోకడలను అర్థం చేసుకుంటూ ముందుకు పోయినప్పుడే ప్రజల నుంచి అభినందనలు వస్తాయని పారికర్ అన్నారు. రాబోయే రోజుల్లో సానిటేషన్ క్లీన్ టెక్, ఎనర్జీ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు.
కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదర్శవంతమైన నేత అని, ఆయన నాయకత్వంలో రక్షణ శాఖలో సంస్కరణలు చోటు చేసుకున్నాయని కెటిఆర్ అన్నారు. గోవా ముఖ్యమంత్రిగా ఆయన గోవా ప్రజలకు చేసిన సేవ, అమలు చేసిన పలు కార్యక్రమాలు అదర్శనీయంగా ఉన్నాయని అన్నారు. సాంకేతిక అంశాలతో పాటు ఇతర అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు టి-హబ్‌కు మరోసారి రావాలని మనోహర్ పారికర్‌ను కెటిఆర్ కోరారు. కార్యక్రమంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టి-హబ్ సిఇవో జె కృష్ణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం హైదరాబాద్‌లోని టి-హబ్‌లో కేంద్ర రక్షణ మంత్రి
మనోహర్ పారికర్, తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్