రాష్ట్రీయం

ఏ మతాన్నీ ద్వేషించనిదే వైదిక ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూన్ 19: పూర్వ కాలంలో విశ్వమంతటా వేదం, వేద సంస్కృతి, వేద ఘోష తాండవించేవని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. శ్రీ వేదభారతి రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామచంద్రాపురంలోని బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం హాల్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘వేదం, వేదిక్ లిటరేచర్’ అనే అంశంపై పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా శాస్ర్తీ మాట్లాడుతూ ఏ మతాన్ని ద్వేషించనిది వైదిక ధర్మం మాత్రమేనన్నారు. వేద విజ్ఞానంపై అమెరికాలో పరిశోధనలు జరుగుతున్నాయంటే దాని గొప్పదనం ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వేల సంవత్సరాల కిందటే దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాల్లో గొప్ప హైందవ దేవాలయాలు, వేద సంస్కృతి విలసిల్లిన దాఖలాలు ఉన్నాయని మెక్సికో అధికారిక చరిత్ర చెబుతున్నదని పేర్కొన్నారు. అమెరికాను కొలంబస్ కనుగొన్నాడన్నది అబద్ధమని, కొలంబస్ పుట్టుకకు వెయ్యి సంవత్సరాల కిందటే కంబోడియా, వియత్నాంలనుంచి మన వేద నాగరికత, అమెరికా ఖండమంతటికీ విస్తరించిందనడానికి పురావస్తు తవ్వకాల సాక్ష్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వేదాలను ప్రపంచమంతా గుర్తించినా దేశంలో మాత్రం మేధావి వర్గాల్లో వాటిపట్ల గౌరవం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కుహనా మేధావుల్లో వేద సంస్కృతిని, దానికి పట్టుగొమ్మ అయిన సనాతన ధర్మాన్ని ద్వేషించే వారే అధికంగా ఉన్నారని, వేద ధర్మాన్ని విశ్వసించేవారిని ఛాందసవాదులుగా ముద్ర వేస్తున్నారని అన్నారు. వైదికాన్ని పునరుద్ధరించాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోందని, అందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈస్టిండియా కంపెనీ భారత దేశాన్ని పాలించినప్పుడు మన కరెన్సీపై లక్ష్మీదేవి, సీతారాముల చిత్రాలను ముద్రించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువగా ముస్లింలు ఉన్న ఇండోనేషియా కరెన్సీపై లక్ష్మిదేవి, గణేశుని ఫొటోలను ముద్రించడం గమనార్హమన్నారు. ఫిలిప్పీన్స్ పార్లమెంట్‌లో దశాబ్దం కిందటే మనువు విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ‘ప్రపంచ మానవాళికి ప్రప్రథమ, సర్వశ్రేష్టమైన శాసనకర్త మనువు’ అని ఆ విగ్రహం కింద రాసి ఉండటం విశేషమని అన్నారు.
భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎల్‌వి గంగాధర శాస్ర్తీ మాట్లాడుతూ భగవద్గీతను వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. భగవద్గీత ధర్మోపదేశం, కార్యోపదేశం బోధించాలని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి మోజులోపడి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోవద్దని సూచించారు. ‘వేద భారతి’ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్‌విఎస్‌ఎస్ అవధానులు మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రంలో, ముఖ్యంగా పంచాంగాల గణితంలో ఏర్పడిన గందరగోళాన్ని రూపుమాపడానికి తమవంతు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వెంకటేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడు రమణ, కార్యదర్శి కృష్ణ, బిహెచ్‌ఇఎల్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎల్ వాసుదేవరావు పాల్గొన్నారు.

చిత్రం... ‘వేదం, వేదిక్ లిటరేచర్’ అంశంపై
మాట్లాడుతున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ