రాష్ట్రీయం

తప్పకుండా వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: తెలంగాణలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి తప్పకుండా రావాలని ఆంధ్ర సిఎం చంద్రబాబును తెలంగాణ సిఎం కెసిఆర్ ఆహ్వానించారు. యాగానికి హాజరవుతానని చంద్రబాబు కెసిఆర్‌కు చెప్పారు. బాబుకు ఆహ్వానపత్రం అందించేందుకు సోమవారం స్వయంగా కెసిఆర్ విజయవాడ వచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై సిఎం బాబు అధికారిక నివాసానికి మధ్యాహ్నం 1.30కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన కెసిఆర్ నేరుగా చంద్రబాబు నివాసంవద్ద దిగారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు పుష్పగుచ్ఛాలు అందజేసి కెసిఆర్‌కు స్వాగతం పలికారు. అక్కడినుంచి వాహనంలో సిఎం కెసిఆర్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు ఎదురెళ్లి గౌరవ మర్యాదలతో కెసిఆర్‌ను ఆహ్వానించారు. దుశ్శాలువాలతో సత్కరించి సాదర స్వాగతం పలికారు. కెసిఆర్ తనవెంట తెచ్చిన మిఠాయిలు, పండ్లు ఇవ్వటమేకాకుండా సిఎం చంద్రబాబుకు శాలువా కప్పి సత్కరించారు. చండీయాగానికి తప్పకుండా రావాలంటూ ఆహ్వానపత్రిక అందించారు. అనంతరం ఇద్దరు సిఎంలు విందారగించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ కోసం ప్రత్యేకంగా ఆంధ్రకు సంబంధించిన ప్రత్యేక వంటకాలు, మిఠాయిలు తయారు చేయించారు. కాకినాడ కాజ, ఉలవచారు, గోంగూర, ముద్దపప్పు, నాటుకోడి పులుసు, పీతల పులుసు తదితర 15 రకాల వంటకాలు ఆయనకు వడ్డించారు. సుమారు గంటన్నరపాటు ఇద్దరు సిఎంలు కలిసి గడిపారు. విందు అనంతరం 15 నిమిషాలపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారని రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పని చేయాలని ఇద్దరు సిఎంలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చండీయాగానికి సంబంధించిన ఏర్పాట్లపై మాత్రమే వారు మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు. రాజకీయ సంబంధిత అంశాలపై ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి రావెల వెల్లడించారు. కెసిఆర్‌వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు.

చిత్రం... ఆహ్వాన పత్రం అందుకున్న సందర్భంలో ముచ్చట్లతో చిరునవ్వులు చిందిస్తున్న చంద్రబాబు, కెసిఆర్