రాష్ట్రీయం

స్వచ్ఛ భారత్ అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 14: దేశంలో పారిశుద్ధ్య ప్రాధాన్యతను గుర్తించి స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందనీయులని జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ అన్నారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో సోమవారం నిర్వహించిన ‘స్వచ్ఛ గాంధేయం’ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఆమె అభినందనలతో ముంచెత్తారు. చిన్ననాటి నుండే పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తే సమాజం మానసిక ఉల్లాసభరితమవుతుందని, ఈవిషయాన్ని గుర్తించిన ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారానే యావత్ దేశం స్వచ్ఛంగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో గాంధీజీ శ్రద్ధ చూపేవారన్నారు.
సిఎంల కలయికపై
ప్రజలకు వివరణ ఇవ్వాలి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 14: ఓటుకు నోటు కేసులో సిఎం చంద్రబాబును భగవంతుడు కూడా రక్షించలేడని, 7 ఊచలూ లెక్కపెట్టాల్సిందేనని తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించి కూడా బ్రహ్మాండమైన స్నేహితుల్లా కలిసి కోడికూరతో విందుభోజనం చేయటంపై తెలుగు ప్రజల్లో అనుమానాలున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వైసిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చండీయాగానికి సిఎం చంద్రబాబును రావాల్సిందిగా ఆహ్వానించేందుకు స్వయంగా హెలికాప్టర్‌లో వచ్చిన తెలంగాణ సిఎం కెసిఆర్ పరస్పర స్నేహితులుగా ఉండటం మంచిదేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రమాబు ఒక నేరంలో దొరికిపోతే చట్టం ఆవైపు చూడకుండా ఉండటం దారుణమన్నారు. రాజ్యాంగం బలహీనపడిందా? అమలుచేసే వ్యక్తుల్లో లోపం ఉందా అంటూ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు కోడిమాంసం తినగానే మాయమైందా? చేపల పులుసులో మునిగిపోయిందాఅంటూ ఎద్దేవా చేశారు. సిఎం చంద్రబాబును నమ్మి కేసులో ఇరుక్కున రేవంత్‌రెడ్డి పాపాలు కడిగేసుకునేందుకే కెసిఆర్ యాగం నిర్వహిస్తున్నాడని ఒకవైపు విమర్శలు చేస్తుండగా, సిఎం చంద్రబాబు అదే యాగానికి వెళ్లేందుకు సిద్ధపడటంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.
రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి, డిసెంబర్ 14 : చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలోని నాగపట్ల ఆడవిలో బొమ్మాజికొండ వద్ద 64 ఎర్రచందనం దుంగలను సోమవారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగపట్ట అడవిలో అటవీశాఖ అధికారులు, బేస్‌క్యాంప్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా బొమ్మాజికొండ వద్ద కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు వంటలు చేసుకుంటుండటాన్ని సిబ్బంది గమనించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పారిపోయారు. అయితే అధికారులు వంట సామగ్రి, ఆహార పదార్థాలతోపాటు అక్కడున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని బాకరాపేట అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. వీటి విలువ కోటి రూపాయలు పైగా ఉంటుందని అంచనా.
తిరుమలలో వాననీటి నిల్వకు మరో రెండు జలాశయాలు
తిరుమల, డిసెంబర్ 14: తిరుమల్లో కురిసే వర్షపునీటిని సక్రమంగా వినియోగించుకునేందుకు వీలుగా మరో రెండు చిన్న జలాశయాలను నిర్మించడానికి యోచిస్తున్నట్లు టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు చెప్పారు. ఇటీవల సప్తగిరుల్లో కురిసిన వర్షాలకు తిరుమల్లోని జలాశయాలన్నీ నీళ్లతో కళకళలాడుతూ సర్వప్రాణకోటి దాహార్తిని తీర్చేందుకు కటాక్షిస్తున్న జలమాత గంగాదేవికి కృతజ్ఞతను ప్రకటించే గంగపూజ సోమవారం తిరుమల్లోని పాపవినాశనం, గోగర్భ జలాశయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు విలేఖరులతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కృపాకటాక్షాలతో ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురిశాయన్నారు. తిరుమల్లోని ప్రధాన జలాశయాలైన ఆకాశగంగ, పాపవినాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు. కృతజ్ఞతతో ఈ గంగపూజను నిర్వహించడం ఆనవాయితీ అన్నారు.
ఇళ్ల దరఖాస్తులతో జనం క్యూలు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, డిసెంబర్ 14: కేంద్రప్రభుత్వం అందరికీ ఇళ్లు నినాదంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో పెద్ద కదలికనే తీసుకొస్తోంది. సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరుచేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. దీనితో పాటు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న గృహనిర్మాణ పథకాలకు కూడా కేంద్రప్రభుత్వం నిధులు మంజూరుచేయాలని నిర్ణయించటంతో, అటు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న గృహనిర్మాణ పథకాలకు, ఇటు కేంద్రప్రభుత్వం నేరుగా ఆర్ధిక సహాయాన్ని అందించే పథకాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న గృహనిర్మాణ పథకాలు పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాల ప్రజలు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ దరఖాస్తులతో తిరుగుతున్నారు. కేంద్రప్రభుత్వం అందరికీ ఇళ్లు నినాదంతో ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మాత్రం ఇపుడు అర్బన్ ప్రాంతాల్లోని ప్రజల్లో పెద్ద కదలికను తీసుకురావటంతో జనం దరఖాస్తులు పట్టుకుని సబ్‌కలెక్టర్ కార్యాలయం, తహశీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
కాల్‌మనీ నిందితులకు రిమాండ్
విజయవాడ (క్రైం), డిసెంబర్ 14: రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపిన కాల్‌మనీపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు రాష్ట్ర పోలీసు చీఫ్‌తో నగర పోలీసు కమిషనర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సిట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇదిలావుండగా కాల్‌మనీ సెక్స్ రాకెట్ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన ప్రధాన నిందితుడు, ఫైనాన్స్ వ్యాపారి యలమంచిలి రామమూర్తి అలియాస్ రాము, మరో వ్యక్తి దూడల రాజేష్‌లను రిమాండుకు తరలించారు. లక్షల్లో అప్పులు ఇచ్చిన అసలు కంటే ఎక్కువ రెట్లు వడ్డీలు గుంజి ఇక బాకీలు చెల్లించలేని అభాగ్య మహిళలను ట్రాప్‌చేసి సెక్స్ కార్యకలాపాలు సాగించిన ముఠాకు చెందిన ఏడుగురు నిందితులపై నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ కొరడా ఝుళిపించారు. ఈ ముఠాకు చెందిన యలమంచిలి రాము, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి సోదరుడు చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం, దూడల రాజేష్, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్, భవానీశంకర్‌లపై చీటింగ్, అత్యాచారంతో పాటు పలు కేసులు నమోదు చేయగా ఇప్పటికే రాము, రాజేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సోమవారం మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఎస్కార్ట్ నడుమ నిందితులను గన్నవరం జైలుకు తరలించారు. ఇక ఎఫ్‌ఐఆర్‌లో వీరిద్దరు మినహా మిగిలిన ఐదుగురిలో సత్యానందం, చెన్నుపాటి శ్రీను పరారీలో ఉన్నట్లు చెబుతుండగా భవానీశంకర్ అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

పనిచేసే చోటే నివాసం తప్పనిసరి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 14: ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తూ మంత్రులను పరుగులు తీయిస్తూ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఉద్యోగం చేసేచోట నివాసముండటం లేదంటూ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివారు పనిచేసేచోటే నివాసముండేలా కలెక్టర్లు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడలో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి విధులు నిర్వర్తించేవారిని అభినందించాల్సిందేనని, అయితే పనిచేయని వారిపై తగిన చర్యలు తీసుకునేలా కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పనిచేసేచోటే నివాసముంటే సమర్థవంతంగా ఉద్యోగ విధులు నిర్వహించే వీలుంటుందన్నారు. భూవివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ‘మీ భూమి మీ ఇంటికి’ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. రెవెన్యూ శాఖలో అపరిష్కృతంగా వున్న అనేక సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

పారదర్శకంగా పోస్టుల భర్తీ
ఏపిపిఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 14: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ పారదర్శకంగా చేపడతామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఎపిపిఎస్సీ) ఛైర్మన్ డాక్టర్ పి ఉదయ భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల సమచారం సేకకరిస్తున్నామని, ప్రభుత్వం నుండి ఈ సమాచారం వచ్చిన తరువాత నియమకాలు చేపడతామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయభాస్కర్‌కు అభినందన సభ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల సిలబస్‌లో కూడా మార్పులుంటాయని, పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. యుపిఎస్‌సి తరహాలో ఒక కేలండర్ రూపొందించి, దానికి అనుగుణంగా పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.