రాష్ట్రీయం

కాల్ మాఫియాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 15: కడప జిల్లాలో కాల్‌మనీ మాఫియాపై పోలీసులు కనె్నర్రజేశారు. రాష్ట్ర డిజిపి జెవి రాముడు ఆదేశాలతో మంగళవారం జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులు కాల్‌మనీ వ్యాపారులపై మూకుమ్మడిగా దాడులు చేసి, పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారివద్ద నుంచి భారీమొత్తంలో నగదుతోపాటు బాధితుల వద్ద రాయించుకున్న ప్రామిసరీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు, జమ్మలమడుగు, రాజంపేట ప్రాంతాల్లో సుమారు వందమందికిపైగా కాల్‌మనీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఒకేసారి దాడులకు దిగడంతో విషయం తెలుసుకున్న మరికొందరు ఏంచేయాలో తెలియక ఉన్నఫళంగా ఇళ్లు, ఊళ్లు వదిలి పరారయ్యారు. కాల్‌మనీ వ్యాపారులకు సంబంధించి తాము చట్టపరంగా విచారిస్తున్నామని, ఎంతమందిని అదుపులో తీసుకున్నది, ఎంతమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు సెలవిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా వందమందికి పైబడి వడ్డీవ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి ప్రామిసరీ నోట్లు, పోస్టు డేటెడ్ చెక్కులు, పెద్దమొత్తంలో నగదు, ఏటిఎం కార్డులు, వివిధ బ్యాంకుల పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, చిట్టాలెక్కలు రాసే పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారు జామునుంచి పక్కావ్యూహంతో జిల్లాలోని కడప , రాజంపేట, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల పోలీసు అధికారులు, స్పెషల్‌పార్టీలు దాడుల పరంపరను కొనసాగిస్తున్నారు.

పోలీసులను ఆశ్రయించిన మహిళలు
రావులపాలె, డిసెంబర్ 15: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ తరహా వ్యవహారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కూడా వెలుగుచూసింది. ఒక వడ్డీ వ్యాపారి తాను తీసుకున్న రుణాలకు సంబంధించి అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమను వేధిస్తున్నాడని ముగ్గురు మహిళలు మంగళవారం రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తులసి రత్నం 2013లో అదే గ్రామానికి చెందిన గుడాల గంగా దుర్గేశ్వరరావు అనే వడ్డీ వ్యాపారి వద్ద పదివేల రూపాయలు అప్పు తీసుకుంది. నూటికి మూడు రూపాయల వడ్డీ చెల్లించే ఒప్పందంపై అప్పు తీసుకోగా, అప్పటి నుండి వారానికి వెయ్యి రూపాయలు వంతున వసూలు చేసేవాడని పేర్కొన్నారు. కొన్ని నెలలకు ఇంకా రూ.67 వేలు బాకీ ఉందని, చెల్లించాలని వత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె బతిమిలాడగా మరో లక్ష రూపాయలు తక్కువ వడ్డీపై అప్పుగా ఇస్తానని చెప్పి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నాడు.

వామనావతారంలో రామయ్య దర్శనం
భద్రాచలం, డిసెంబర్ 15: అధ్యయనోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి మంగళవారం భక్తులకు వామనావతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామికి వేదపండితులు నాళాయర దివ్యప్రబంధం, ద్రవిడ ప్రబంధం పారాయణం చేశారు. వేదవిన్నపాలు చేశారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి మిథిలాస్టేడియానికి చేరుకుని భక్తులకు దర్శనం ఇచ్చారు. తిరుమాడవీధుల్లో తిరువీధి సేవ చేశారు. గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకున్న స్వామి తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
సాంకేతిక లోపంతో ఆగిన పినాకిని
గూడూరు, డిసెంబర్ 15: చెన్నైనుండి విజయవాడకు వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ కు మంగళవారం రైలు ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో గూడూరు స్టేషన్‌లో ఆగిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షించి దానికి మరొక ఇంజన్‌ను అమర్చి పంపించారు. చెన్నై నుండి విజయవాడకు వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో స్టేషన్ గూడూరు ఔటర్ వద్దకు వచ్చేసరికి ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో దానిని డ్రైవర్ నిలిపి వేసి ఈ విషయాన్ని స్టేషన్‌కు సమాచారం అందించాడు. గూడూరులో స్టాండ్‌బై ఉన్న సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌ను దానికి అమర్చి అర్ధగంట ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు గూడూరు నుండి పినాకినీ పంపారు.
విశాఖ స్టీల్‌ప్లాంటులో ప్రమాదం
గాజువాక, డిసెంబర్ 15: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్‌ఎంఎస్) విభాగంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఒక ఉద్యోగి గాయపడగా సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు నేల పాలైంది. దీని కారణంగా సంస్థకు సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లింది. ఎస్‌ఎంఎస్-1లోని టిపిబే సెక్షన్‌లో ప్రోసెస్ పూర్తయిన అనంతరం 150 టన్నుల ద్రవపు ఉక్కుతో ఉన్న లాడిల్‌ను ఇవోటి క్రేన్ సహాయంతో పైకి లేపుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లాడిల్ ఒక పక్కకు ఒరిగి పోయి అందులో ఉన్న ద్రవపు ఉక్కు కింద పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడకు చేరుకున్న ఉక్కు సిఐఎస్‌ఎఫ్ ఫైర్ వింగ్ సిబ్బంది మంటలను ఆదుపు చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఎవ్వరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఉక్కు నిర్వాసితకాలనీ వడ్లపూడికి చెందిన క్రేన్ ఆపరేటర్ ఆర్ శ్రీనివాసరావు ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. గాయపడిన శ్రీనివాసరావును సహచర కార్మికులు వెంటనే చికిత్స నిమిత్తం విశాఖ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
వైకుంఠ ద్వారదర్శనానికి ప్రత్యేక టికెట్లు
తిరుపతి, డిసెంబర్ 15: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా అన్ని రకాల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి ఇ ఒ సాంబశివరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్లో రూ.300 టికెట్లు 10,800 కేటాయించామని వీటిని బుధవారం ఉదయం 11గంటల నుంచి భక్తులు బుక్‌చేసుకోవచ్చని తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో మంగళవారం తిరుమల జె ఇ ఒ శ్రీనివాసరాజుతో కలిసి అధికారులతో ఇ ఒ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వాదశి నాడు మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 9గంటల వరకు ఒక్కోస్లాట్‌లో 1200 మంది చొప్పున మొత్తం 10,800 మందికి ఆన్‌లైన్లో దర్శన టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈకోటా ఇంటర్నెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఈ-దర్శన్ కౌంటర్లు, కరెంట్ బుకింగ్, పోస్ట్ఫాసుల్లో అందుబాటులో ఉండవని వివరించారు. కంపార్ట్‌మెంట్లలోని భక్తులందరికీ వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని ఆలయ డిప్యూటి ఇఒ చిన్నంగారి రమణ ఇఒ ఆదేశించారు.
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 15: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం మధ్యాహ్నం స్థానిక సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా శాసనసభ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలు, బిల్లులపై చర్చిస్తారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రధాన సూచనలు, సలహాలు ఆధారంగా కొత్తగా జారీ చేయాల్సిన జీవోలపై కూడా చర్చిస్తారని తెలిసింది.