ఆంధ్రప్రదేశ్‌

టార్గెట్ బయోటెక్ ప్రపంచ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: బయోటెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను త్వరలో లీడర్‌లా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బయో టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచానికి గమ్యస్థానం చేసే ప్రయత్నాలకు సోమవారం బీజం పడింది. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్, గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్క్‌తో కలిసి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన త్వరలో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. 2015 నాటికి రాష్ట్రంలో వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగేలా రోడ్ మ్యాప్‌ను ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సంస్థ రూపొందించనుంది. ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సంస్థ 46 దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు చేస్తున్న అనుభవం వుంది. ఈ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బయోటెక్నాలజీ అభివృద్ధికి దోహదపడేలా వినియోగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం కలిసిన సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 25న ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సిఈవో ముఖ్యమంత్రితో బేటీ కానున్నారు. ఆ సందర్భంలో ఎంవోయూలు చేసుకునే అవకాశాలు వున్నాయి. ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్‌తో పాటు గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్క్ కూడా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి. ఇప్పటికే రూ.1,600 కోట్లతో గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్క్ అనంతపురం జిల్లా కొడోకొండ, విశాఖ జిల్లా నక్కపల్లిలో బయోటెక్ క్లస్టర్‌లను నెలకొల్పనున్నాయి. స్టాన్‌ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను ఈ క్లస్టర్‌లలో భాగస్వాములను చేస్తున్నాయి. 60వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లిలో సుమారు 1200 ఎకరాల్లో చేపట్టనున్న బయోటెక్ క్లస్టర్‌లో తొలిసారిగా ఆర్గానిక్ డిశాలినేషన్ అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.

స్మార్ట్ విలేజ్‌లకు బాటవేద్దాం
టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 4: ‘మనం ఎల్‌ఈడి బల్బులు ఇచ్చాం.. దేశం మొత్తం అమలు చేస్తున్నారు. మనం ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ ఇస్తున్నాం.. దేశవ్యాప్తంగా చేపట్టారు. మనం చేపట్టిన ఈ-ప్రగతిని అందరూ అందిపుచ్చుకుంటున్నారు. మనం చేపట్టిన నదుల అనుసంధానం దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా నిలిచింది. నీరు-ప్రగతి, నీరు-చెట్టు అందరూ అనుసరిస్తున్నారు. ప్రారంభం మనదైతే అనుసరిస్తోంది అందరూ.. ఇదొక చరిత్ర. దీంట్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మరికొద్ది నెలల్లో నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలను బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలను మాత్రమే ఓడిఎఫ్‌గా ప్రకటించారంటూ మొత్తం 13 జిల్లాలను ఓడిఎఫ్‌గా ప్రకటించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నమోదు కావాలని ఆకాంక్షించారు. సర్పంచ్‌ల దగ్గర్నుంచి ఎమ్మెల్యేల వరకు, దిగువస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు పోటీతత్వం పెంపొందాలన్నారు. ‘రాష్ట్రంలో అందరికీ వంటగ్యాస్ ఇస్తున్నాం. విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నీటి భద్రత కల్పించాం. వీటితోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తే అన్ని గ్రామాలు స్మార్ట్‌గా రూపొందుతాయి’ అని ఆయనన్నారు. సిసి రోడ్ల నిర్మాణంలో గత వారం 50 రన్నింగ్ కి.మీ.ల పురోగతి సాధించామని అధికారులు వివరించగా, ప్రతివారం 240 కి.మీ.ల రోడ్లు నిర్మిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు.

తుంగభద్రకు పెరుగుతున్న వరద
బళ్ళారి, జూలై 4: తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజు 3 టిఎంసిల నీరు వచ్చి చేరింది. ఆదివారం జలాశయంలో 7.342 టిఎంసిల నీరు ఉండగా సోమవారానికి అది కాస్త 10.502 టిఎంసిలకు చేరుకుంది. తుంగ జలాశయం నిడడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలిన నీరు క్రమంగా చేరుకుంటోంది. దీనికి తోడు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరు జలాశయానికి చేరుకుంటోంది. సోమవారం 31,617 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1590.28 అడుగులకు చేరుకుంది. 10.502 టిఎంసిల నీరు నిల్వ ఉంది.
నిలకడగా గోదావరి వరద
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జూలై 4: గోదావరి వరద ఉద్ధృతి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతంలో తగ్గుముఖం పట్టింది. సోమవారం రాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుండి 2,71,745 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ప్రవాహ నీటి మట్టం 8.8 అడుగులు నమోదయ్యి, నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజ్‌కు ఉన్న 175 గేట్లను 0.8 మీటర్ల మేర ఎత్తివేసి వచ్చిన జలాలను వచ్చినట్లుగా దిగువకు విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో వరద తగ్గుముఖం పట్టడంతో బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టాలకు విడుదలచేసే నీటిని కూడా పెంచారు. సోమవారం ఉదయం నుంచి ఈస్ట్రన్ డెల్టాకు 2600 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2100 క్యూసెక్కులు, వెస్ట్రన్ డెల్టాకు 1500 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం నుండి ఈస్ట్రన్ డెల్టాకు 3000 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2100, వెస్ట్రన్ డెల్టాకు 3000 మొత్తం 8,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజ్ నుండి ఉదయం 3,45,840 క్యూసెక్కులు డిశ్చార్జి ఉంటే..అది కాస్తా సాయంత్రానికి 2,71,745 క్యూసెక్కులకు తగ్గించారు. కాళేశ్వరం వద్ద 5.23 మీటర్లు, పేరూరు వద్ద 6.93, దుమ్ముగూడెం వద్ద 7.39, కూనవరం వద్ద 8.54, కుంట వద్ద 4.8, కొయిదా వద్ద 4.8, పోలవరం వద్ద 8.82 మీటర్లు, ధవళేశ్వరం వద్ద 8.8 అడుగులు నిలకడగా ఉంటే భద్రాచలం వద్ద 23.8 అడుగులు నమోదై తగ్గుముఖం పట్టింది.
బందోబస్తు మధ్య తమిళ ఎమ్మెల్యే ధర్నా
కుప్పం, జూలై 4: ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో గత నాలుగు రోజులుగా చెక్‌డ్యాం విషయమై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో సోమవారం తమిళనాడు రాష్ట్రం తిరపత్తూరు డిఎంకె ఎమ్మెల్యే నల్లస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించేందుకు సుమారు 300 మంది కార్యకర్తలతో సిమ్మంపేట వద్దకు వచ్చారు. ఇంతలో అక్కడే ఉన్న తమిళ పోలీసులు వారిని అడ్డుకొని ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోకి వెళ్లడానికి అనుమతులు లేవని తెలిపారు. మీరు ఏమైనా నిరసనలు తెలపాలనుకుంటే ఇక్కడే తెలపాలని చెప్పడంతో సిమ్మంపేట గ్రామంలోనే బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు గంటసేపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో ఉన్న తమిళ గ్రామమైన పుల్లూరు గ్రామ రైతులు మాత్రం చెక్‌డ్యాం వద్ద ధర్నా చేసేందుకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో పలమనేరు డిఎస్పీ శంకర్ ఆధ్వర్యంలో కుప్పం సిఐ రాజశేఖర్, నలుగురు ఎస్సైలతో పాటు భారీ బందోబస్తు కనకనాశమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. మరోవైపు సిమ్మంపేట గ్రామం నుంచి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు వరకు ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన తమిళ పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను ఆపేశారు. దీంతో చేసేదిలేక సిమ్మంపేట వరకే వచ్చిన డిఎంకె పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్వహించి వెనుతిరిగి వెళ్లిపోయారు.
తప్పతాగి హెచ్‌ఎం వీరంగం
చౌడేపల్లె, జూలై 4: బడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అయ్యోరు ఏకంగా మద్యం సేవించి వీరంగం సృష్టించారు. గ్రామస్థులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం చారాల ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. చౌడేపల్లె మండలంలోని పంచాయతీ కేంద్రం చారాల ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జయప్రకాష్ నిత్యం మద్యం సేవించి పాఠశాలకు హాజరవుతున్నట్లు పలుమార్లు గ్రామస్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం యథావిధిగా విధులకు హాజరైన హెచ్‌ఎం మద్యం సేవించారు. చారాల గ్రామానికి చెందిన హరిప్రసాద్ తన ఇద్దరు పిల్లలను బడికి తీసుకువచ్చారు. ఇంతలోనే హెచ్‌ఎం పాఠశాలలో నీకేం పని అంటూ అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో హరిప్రసాద్ గ్రామస్థులకు చెప్పడంతో ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. మిగతా ఉపాధ్యాయులిద్దరు తల్లిదండ్రులతో సర్దిచెబుతుండగానే మద్యం మత్తులో ఉన్న హెచ్‌ఎం గట్టిగా వారితో వాదనకు దిగారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికెళ్తుండగా ఉపాధ్యాయులిద్దరు బతిమలాడారు. మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
మల్లన్న సాగర్‌పై నేడు జెఎసి సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 4: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం వేములగట్టులో మంగళవారం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజాక్) అధ్యర్యంలో ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు-ప్రతిపాదన-చర్చ’ అనే అంశంపై ఈ సదస్సునస ఏర్పాటు చేసింది. దీనిలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు న్యాయ నిపుణులు, సాగునీటి రంగ నిపుణులు, ముంపు గ్రామాల ప్రజలు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారని టిజెఎసి సమన్వయకర్త పిట్టల రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త జిల్లాలపై భేటీ వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 4: కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లతో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించనున్న సమావేశం వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీన రాష్టవ్య్రాప్తంగా ప్రారంభం కానున్న హరిత హారం కార్యక్రమంలో కలెక్టర్లు బిజీగా ఉండటం వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు అధికార వర్గాల సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు తుది నివేదికలు సమర్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ముగ్గురు డిఎస్పీల సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 4: పోలీస్ శాఖలో ముగ్గురు డిఎస్పీలను సస్పెండ్ చేస్తూ డిజిపి జెవి రాముడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విశాఖలో సర్కిల్ ఇనస్పెక్టర్లుగా పనిచేసిన సందర్భంలో సివిల్ కేసుకు సంబంధించి, అవకతవలకు పాల్పడినట్టు రుజువుకావడంతో డిజిపి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2010లో సివిల్ తగాదాకు సంబంధించి ప్రస్తుతం డిఎస్పీలుగా పనిచేస్తున్న ఎం కృష్ణమూర్తి నాయుడు (విఆర్‌లో ఉన్నారు), ఎస్‌వివి ప్రసాదరావు(ఎసిబి డిఎస్పీ), వైవి నాయుడు (సిఐడి డిఎస్పీ) అవకతవకలకు పాల్పడినట్టు రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు గుమాస్తా ఎన్‌విఎస్ దుర్గా ప్రసాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా క్రైం ఎడిసి టి రవి కుమార్ మూర్తిని సిపి యోగానంద్ ఆదేశించారు. పై ముగ్గురిలో కృష్ణమూర్తి నాయుడు తూర్పు ఎసిపిగా పనిచేశారు. మరో ఇద్దరు సర్కిల్ ఇనస్పెక్టర్లుగా పనిచేస్తున్న కాలంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని సివిల్ కేసులో అవకతవలకు పాల్పడటం వాస్తవమేనని నిర్ధారించారు.

కాపు యువతకు
సివిల్స్ పరీక్షలకు శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 4: విద్యోన్నతి పథకంలో భాగంగా ప్రతి ఏటా 500 మంది కాపు యువతీ, యువకులకు యుపిఎస్సీ పరీక్షలకు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం అర్హత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ, హైదరాబాద్‌లో పేరెన్నికగన్న యుపిఎస్సీ పరీక్షల కోచింగ్ సెంటర్లలో 9 నెలలు శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్, ఢిల్లీలో 9 కోచింగ్ సెంటర్లను గుర్తించి అభ్యర్థుల అభిరుచి మేరకు ఆయా కేంద్రాల్లో కోచింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు.