రాష్ట్రీయం

పులస చేపల సందడి మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూలై 7: ‘పుస్తెలు అమ్మి అయినా పులస కూర తినాలన్నది’ గోదావరి జిల్లాల్లో వాడుకలో ఉన్న నానుడి.... గోదావరిలో వరదల సమయంలో మాత్రమే దొరికే పులసలకున్న ప్రాధాన్యం అలాంటిది. రుచిలో రారాజుగా పేర్కొనే ఈ చేప ధరలోనూ చుక్కల్లో సమ్రాట్టే. గోదావరి నదికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గత కొద్ది రోజులుగా ఎర్ర నీరు వచ్చి చేరడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పులసల సందడి మొదలైంది. సముద్రంలో విలసగా ఉండే చేపలు వరదల సమయంలో ఎదురీదుతూ గోదావరిలోకి ప్రవేశిస్తాయి. ఎర్రనీటిలోకి వచ్చాక పులసగా మారే ఈ చేపలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. విలసగా ఉన్న సమయంలో అంతంతమాత్రం రుచితో ఉండే ఈ చేప ఎర్రనీటిలోకి చేరాక పులసగా మారడంతో ఎంతో రుచిని సంతరించుకుంటుంది. ఏడాదిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మాత్రమే గోదావరి వరద నీటిలో లభించే ఈ చేపలకోసం మాంసాహార ప్రియులు ఏడాది పొడవునా ఎదురు చూస్తారంటే అతిశయోక్తికాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని సముద్రాలలో ఉండే ఈ చేపలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి చేరి అక్కడి నుండి గుడ్లు పెట్టేందుకు గోదావరి ప్రవాహానికి ఎదురీదుతూ తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకు వస్తాయి.
రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడతోపాటు తెలంగాణాలోని హైదరాబాద్ తదితర ప్రాంతవాసులు గోదావరి వరదల సమయంలో ఈ పులస కోసం వెంపర్లాడుతుంటారు. ఇదిలావుంటే మత్స్యకారులు కూడా ఈ రెండు నెలల పులసల వేటకోసం ముందు నుండే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. రావులపాలెం నుండి ధవళేశ్వరం వరకు పడవలపై వేట సాగిస్తూ ఉంటారు. పులసల కోసం ప్రత్యేక వలలు తయారు చేసుకుంటారు. సాధారణ చేపల ధర కిలో రూ.100 నుండి రూ.200 వరకు ఉంటే పులస ధర ఏకంగా రూ.2000 నుండి రూ.3000 వరకు పలుకుతుంది. వలలో ఒక చేప పడితే చాలు తమ పంట పండినట్టేనని మత్స్యకారులు భావిస్తుంటారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక, పశ్చిమ గోదావరి జిల్లా విజ్జేశ్వరం, రావులపాలెం మండలం ఊబలంక తదితర ప్రాంత మత్స్యకారులు వీటిని విక్రయిస్తుంటారు.
పులసల సీజనులో రాజమండ్రి, భీమవరం, రావులపాలెం, తణుకు తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో పులసతో చేసిన ప్రత్యేక వంటకాలు లభిస్తుంటాయి. రెస్టారెంట్ల ముందు ‘పులస కూర రెడీ’ అంటూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసే బోర్డులు ఆ కూరకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ రెండు నెలల్లో గోదావరి జిల్లాల ప్రజలు ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి ఏదో ఒకరోజు పులస కూర వండి పంపించాలని, కనీసం చేపయినా పంపాలని భావిస్తుంటారు.
పులస కూర వండటం ఒక కళ
పులస కూర వండటాన్ని కూడా ఒక కళగా చెబుతుంటారు. సాధారణంగా వండే చేపల కూరలా కాకుండా దీనిని ప్రత్యేకంగా వండాల్సి ఉంటుంది. కట్టెల పొయ్యిపై మట్టి కుండలో చేప ముక్కలు వేసి, బెండకాయ, కొత్తిమీర, చింతపండు రసం, ఆవ నూనెతో ప్రత్యేకంగా పులస కూర వండటం గోదావరి జిల్లా వాసులకే తెలుసు. వండిన తరువాత సన్నని సెగపై నాలుగు నుండి అయిదు గంటలు ఉంచిన తరువాత ఈ కూరను తింటే రుచి బాగుంటుందని స్థానికులు చెబుతారు.

చిత్రం.. గోదావరి నదిలో లభ్యమైన పులసలు