ఆంధ్రప్రదేశ్‌

ఉగ్ర గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/ఏలూరు, జూలై 12: ఉప నదులు..వాగులు.. వంకలు.. ఏరులు.. సెలయేర్లను పెనవేసుకుంటూ గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మంగళవారం సాయంత్రానికి 13.75 అడుగుల మట్టాన్ని దాటుకుని మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అంటే 17.75 అడుగుల మట్టం దిశగా ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి నాలుగు ఆర్మ్‌ల్లోని మొత్తం 175 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తివేసి వచ్చిన వరద జలాలను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీవద్ద సెకనుకు 14 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద గోదావరి ఉగ్రరూపం లంక గ్రామాలను భయపెడుతోంది. అఖండ గోదావరి ఎగువ, దిగువ ప్రాంతాల్లో సుమారు వంద గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతంలోని కూనవరం, చింతూరు, విఆర్‌పురం, దేవీపట్నం తదితర మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కొత్తపేట మండలం వాడపాలెం శివారు నారాయణలంక వద్ద తొగరపాయపై ఉన్న కాజ్‌వేపై నుంచి వరద ప్రవహిస్తోంది. వరద పెరుగుతుండటంతో లంక గ్రామాల నుంచి కొబ్బరికాయలతోపాటు కూరగాయలను, పశువులను రైతులు సమీపంలోని ఏటిగట్టుకు తరలించుకుంటున్నారు. వరద ప్రభావిత మండలాల తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే పర్యాటక లాంచీలను నిలుపుచేశారు. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవడంతో మరో 24 గంటల్లో ధవళేశ్వరం వద్ద అతి ప్రమాద స్థాయికి వరద ప్రవాహం చేరుకోనుంది.
కాగా విలీన మండలం విఆర్ పురం మండలం కన్నాయిగూడెం, శ్రీరామగిరి, ఇప్పూరు, వడ్డిగూడెం గ్రామాల వద్ద రహదారులపైకి వరదనీరు చేరుకోవటంతో, ఆ గ్రామాలతోపాటు చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం, చొక్కనపల్లి, కల్తునూరు, పోచవరం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి ఉపనది అయిన శబరి కూడా వరదతో పరవళ్లు తొక్కుతోంది. శబరికి అనుసంధానమైన సోకిలేరు, చంద్రవంక, కుయిగూరు, చీకటి వాగులు పొంగి పొర్లుతూ చింతూరు మండలంలోని పలు రహదార్లను ముంచెత్తుతున్నాయి. సాధారణంగా శబరి నుండి వరద నీరు గోదావరిలో చేరుతోంది. అయితే శబరిని మించిన స్థాయిలో గోదావరికి వరద రావడంతో శబరి నీరు ఎగపోటుకు గురై లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.
భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే ప్రధాన రహదారిపై పోలిబాట, గున్నాల కాలనీ, నందిగామ గ్రామాల రహదారులపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటపాక మండలంలో విద్యుత్తు స్తంభాలు నీట మునగడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో వాణిజ్య పంటలైన అరటి, కంద, కూరగాయలు, పూల తోటలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే పైనుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం పోలవరం లోని కడెమ్మ స్లూయిజ్, కొత్తూరు కాజ్‌వే నీట మునగడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కొవ్వూరులోని ప్రఖ్యాత గోష్పాద క్షేత్రంలోకి వరద నీరు ప్రవేశించింది. విలీన మండలం వేలేరుపాడు నుంచి దిగువ గ్రామాలైన కొయిదా వరకు 35 గ్రామాలకు, ఇటు రుద్రంకోటకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి.

చిత్రం... రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
తూ.గో. జిల్లా కొత్తపేట మండలంలో నీట మునిగిన
నారాయణలంక కాజ్‌వేపై నుంచి అరటి గెలలు
సురక్షిత ప్రాంతానికి తరలించుకుంటున్న రైతులు