రాష్ట్రీయం

తొలగిన అడ్డంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. భూములు అప్పగింతకు ఏటిగడ్డ కిష్టాపూర్ సహా ఎర్రవెల్లి, లక్ష్మాపూర్ గ్రామాల రైతులు ముందుకొచ్చారు. గజ్వేల్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులతో సమావేశమయ్యారు. లక్షలమంది రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భూముల అప్పగింతకు అంగీకరించినట్టు రైతులు తెలిపారు. 123 జీవో ప్రకారం ఎకరాకు ఆరు లక్షలు పరిహారం చెల్లించనున్నట్టు మంత్రి తెలిపారు. ఏటిగడ్డకిష్టాపూర్ పేరుతో గ్రామాన్ని నిర్మించి దత్తత తీసుకోనున్నట్టు చెప్పారు. గ్రామానికి చెందిన విద్యార్థులకు చదువువిషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అన్ని సౌకర్యాలతో గ్రామాన్ని నిర్మించాలని రైతులు కోరారు. ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులను సిఎం అన్ని విధాలుగా ఆదుకుంటారని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దీంతో రెండు నెలలుగా సాగిస్తున్న దీక్షలను గ్రామస్తులు విరమించారు. 50 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రధానంగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండు నెలల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు చివరకు ఆందోళన విరమించి ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అనేక దఫాలుగా జరిపిన చర్చలు ఫలించాయి. స్వయంగా సిఎం కెసిఆర్ సొంత జిల్లా కావడంతో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల ఆందోళనపై అన్ని రాజకీయ పక్షాలు దృష్టిసారించాయి. చివరకు గ్రామస్తులు ఎకరాకు ఆరులక్షల పరిహారానికి అంగీకరించారు. మరోచిట ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. గ్రామాన్ని మంత్రి దత్తత తీసుకుంటారు. నిర్వాసితులు పరిహారం ప్యాకేజీకి అంగీకారం తెలిపిన తరువాత నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ చేరుకుని రైతులతో మాట్లాడారు. తమ గ్రామం ముంపునకు గురవుతున్నా, లక్షల మంది రైతులకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో అంగీకరించినట్టు రైతులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 11 గ్రామాలు ముంపు పాలవుతుండగా, ప్రధానంగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ రైతుల నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పారు. మిగిలిన గ్రామాల ప్రజలు ముందునుంచే పరిహారానికి ఒప్పుకోగా, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు మాత్రం వివిధ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
ఏటిగడ్డకిష్టాపూర్ కేంద్రంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఆందోళనకు దిగినా, సిఎం మాత్రం మొదటి నుంచీ వౌనంగా ఉన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం లేదా, జీవో 123 ప్రకారం ఎలా అంటే అలా పరిహారం చెల్లించేందుకు సిద్ధమని సిఎం ప్రకటించారు. జీవో 123ని కొట్టి వేయాలని ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వారికి చుక్కెదురైంది. జీవో 123లో చట్టబద్ధమేనని కోర్టు ప్రకటించి పిటిషన్‌ను కొట్టివేసింది.
అధికారపక్షం వ్యూహాత్మకంగానే మల్లన్న సాగర్ బాధితుల ఆందోళనపై వౌనంగా ఉంటూ వచ్చింది. ప్రధానంగా మూడు నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తుంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే మూడువేల గ్రామాల ప్రజలకు మేలు కలుగుతుంది. అధికార పక్షం ఇదే అంశంపై ప్రచారం నిర్వహించింది. మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల మేలు కలుగుతుండటంతో ఆ జిల్లాల్లో ప్రాజెక్టుకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించారు. విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని అధికార పక్షం బలంగా ప్రచారం చేసింది. సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆర్‌డిఓకు వినతిపత్రం ఇచ్చారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు జిల్లాల రైతులకు ఏవిధంగా మేలు కలుగుతుందో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. అధికారపక్షం దాడితో విపక్షాలు సైతం డైలమాలో పడిపోయాయి. మూడు నాలుగు గ్రామాల మద్దతు చూసుకుంటే నాలుగు జిల్లాల్లో రైతులు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉందని భావించి జోరు తగ్గించారు. ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పట్టుదలతో ఉండడంతో ముంపు రైతులు సైతం మంచి ప్యాకేజీకి అంగీకరించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించి ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి.

చిత్రం... గజ్వేల్‌లో రైతులతో చర్చలు విజయవంతం కావడంతో ఆనందంగా బయలుదేరుతున్న మంత్రి హరీశ్