రాష్ట్రీయం

పసికందు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పట్టపగలే దారుణం జరిగింది. ఐసియులో చికిత్స పొందుతున్న ఆరు రోజుల పసికందు క్షణాల్లో మాయమైపోయింది. ఇరవై నిమిషాల క్రితం పాలిచ్చిన శిశువుకు మరోసారి పాలివ్వటానికి వెళ్లిన తల్లికి రోదనే మిగిలింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాలో, అందునా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఈ ఘాతుకం చూస్తే ప్రభుత్వాసుపత్రులలో అందునా పిల్లల వార్డుల్లో శిశువుల రక్షణ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. కనీసం ఆసుపత్రిలో సిసి కెమెరాలు కూడా పనిచేయక పోవటం దారుణం. పాత ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట కాలువ గట్టుపై గల అతిచిన్న మెడికల్ షాపులో ఉన్న సిసి కెమెరా సహాయంతో పసికందు అదృశ్యమైన సమయంలో ప్రధాన ద్వారం నుంచి జరిగిన రాకపోకలను గుర్తించడానికి పోలీసులు నానా హైరానా పడుతున్నారు. విజయవాడ కొత్తపేటకు చెందిన పెయింటర్ ఐతా సుబ్రమణ్యం భార్య కల్యాణి సరిగ్గా ఆరురోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. రెండోరోజే క్షేమంగా ఇంటికి చేరింది. అయితే పసికందు కామెర్లతో బాధపడుతుండటాన్ని గమనించి తిరిగి చికిత్స నిమిత్తం బుధవారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. పిల్లవాణ్ణి ఐసియూలో ఇక్యుబేటర్‌లో ఉంచారు. ఐసియు ఇంక్యుబేటర్ విభాగంలో కేవలం 30 మంది పసికందులను మాత్రమే ఉంచాల్సి ఉంటే 44 మందిని ఉంచారు. తల్లులను మాత్రం కేవలం బిడ్డలకు పాలు ఇవ్వడానికి అనుమతిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కల్యాణి తన బిడ్డకు పాలిచ్చి బయటకు వెళ్లింది. 11.20 ప్రాంతంలో మరోసారి పాలు ఇచ్చే నిమిత్తం లోపలికి వెళ్లి చూసేసరికి బాబు కనిపించలేదు. దాంతో నా బాబు.. నా బాబు అంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంతలో నర్సులు, అక్కడున్న సిబ్బంది అక్కడికి చేరి సమాచారం తెలుసుకుని నలువైపులా గాలించినా ఆచూకీ తెలియరాలేదు. సిపిఐ నేతలు, ఆ పార్టీ అనుబంధ నేతలు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.జగన్మోహనరావు, సబ్ కలెక్టర్ డాక్టర్ సృజన, ఇతర అధికారులు వెళ్లి అదృశ్యమైన పసికందు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందుగా సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, పిల్లల విభాగం వైద్యుడు ప్రొ.రాజు, విజయవాడ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్‌లతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ రాత్రి ఆసుపత్రికి చేరుకుని తమ విచారణ ప్రారంభించింది.
విజయవాడ బస్టాండులో అనుమానితుల గుర్తింపు
పసికందు కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో గవర్నర్‌పేట పోలీసులు సెక్షన్ 363 ఐపిసి కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సిఐ పవన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో సిసి కెమెరాలు పని చేయకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారినప్పటికీ, విజయవాడ నెహ్రూ బస్టేషన్‌లోని సిసి కెమెరాల పుటేజీల ద్వారా అనుమానితురాలిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు వృద్ధురాళ్లు రోజుల వయసున్న పసికందును బస్టాండులోని ప్లాట్‌ఫారం వద్ద మరో నడి వయస్సు కలిగిన మహిళకు అందించడం, ఆ మహిళ పసికందును జాగ్రత్తగా పట్టుకుని జిప్ బ్యాగులో పెట్టుకుని గుంటూరు వైపు వెళ్ళే బస్సు ఎక్కినట్లు పుటేజీలో రికార్డయిన దృశ్యాలను గుర్తించారు. పోలీసులు వాటి ఆధారంగా ఆరా తీస్తున్నారు. బిడ్డను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన వృద్ధురాళ్లు నేరుగా బస్టాండుకు వెళ్లి అక్కడ మరో మహిళకు బిడ్డను అందించడం, ఆ మహిళ హడావిడిగా బస్సు ఎక్కి వెళ్లిపోవడం బట్టి చూస్తే.. పసికందును కిడ్నాప్ చేసిన నిందితులుగా అనుమానిస్తున్నారు. దీంతో దృశ్యాలు రికార్డయిన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆ సమయంలో గుంటూరు వైపు వెళ్లే బస్సులను గుర్తించి, ఈ మధ్యలో ప్రయాణికులు దిగిన చోటు, తదితర ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు వేగవంతం చేశాయి.
అడుగడుగునా నిర్లక్ష్యం
ఆసుపత్రి నిర్వహణలో అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నిర్లక్ష్యం ఇవాళ ఓ దంపతులకు కన్నబిడ్డను లేకుండా చేసింది. ఇదే ఆసుపత్రిని కొన్ని మాసాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులు ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఒకరోజు ఉదయం నిర్ణీత సమయానికి ఆసుపత్రిని తనిఖీ చేయగా 12 మంది వైద్యులు హాజరుకాకపోవటం చూసి మెమోలు జారీ చేశారు. అయినా మంత్రి ఆదేశాలు ఏవీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మాతా శిశు విభాగం 150 పడకలపై 300 మంది రోగులు సేద తీరుతుండటం చూస్తేనే ఇక్కడి పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.

చిత్రాలు.. బిడ్డను ఎత్తుకుపోతూ విజయవాడ బస్టాండ్ వద్ద సిసి కెమెరాకు చిక్కిన మహిళ
బిడ్డ అదృశ్యంతో బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు