ఆంధ్రప్రదేశ్‌

రాత్రిళ్లూ అన్న క్యాంటీన్లలో భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 15: ఇకపై రాత్రిపూట కూడా అన్న క్యాంటిన్లలో ఐదు రూపాయలకే భోజన వసతి కల్పిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. వెలగపూడి క్యాంటిన్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సచివాలయం సమీపంలోని అన్న క్యాంటిన్లో భోజనం చేసి నాణ్యత ప్రమాణాలను మంత్రి సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో ఎన్ని క్యాంటిన్లు అవసరమవుతాయనే వివరాలు సేకరించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. కాగా కృష్ణా పుష్కరాల కోసం వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం గొల్లపూడి మార్కెట్ యార్డులో ప్రత్యేక క్యాంటిన్ ఏర్పాటుచేసి రోజుకు మూడు లక్షల మందికి భోజన వసతి కల్పిస్తామని తెలిపారు.
మంగళగిరి ఎంవిఐ సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,జూలై 15: ఒకే నెంబర్‌తో 27వాహనాల రిజిస్ట్రేషన్ చేసిన ఆరోపణలపై గుంటూరు జిల్లా మంగళగిరి మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావును సస్పెండ్ చేయాలని రాష్టర్రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంకు ఆదేశాలు జారీచేసినట్లు ఆ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఒంగోలులో తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌తో తనకు ఎలాంటి బంధుత్వం లేదని ఆయన కొట్టిపారేశారు. 27వాహనాలను చూడకుండానే పర్మిట్లు మంజూరు చేశారన్నారు. దీనిపై గుంటూరు డిప్యూటీ కమిషనర్ విచారణ చేశారన్నారు. ఆ నివేదికలో శివనాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైందని మంత్రి స్పష్టం చేశారు. అందులోభాగంగానే సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఎవరినీ వదలిపెట్టే ప్రశక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కృష్ణపుష్కరాలకోసం 300 కొత్తబస్సులు నడుపుతామని మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. వీటికి తోడు మరో 400 బస్సులు అదనంగా సిద్ధంగా ఉంచుతామన్నారు.
పొద్దుతిరుగుడు నూనెతో మహానందీశ్వరుని దీపారాధన
* భూమి వార్తకు స్పందన
మహానంది, జూలై 15: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో కొలువైన మహానందీశ్వరుడి నిత్యదీపారాధనకు ప్రస్తుతం పొద్దుతిరుగుడునూనె వాడాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో డాక్టర్ శంకర వరప్రసాద్ తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక హారతులకు ఆవునెయ్యి వాడాలని నిర్ణయించామన్నారు. మహానందిలో పరమేశ్వరుడి నిత్యదీపారాధనకు కల్తీనూనె వాడుతున్నారంటూ ‘మహానందిలో మహాపరాధం’ అన్న శీర్షికన ఈనెల 6వ తేదీ ఆంధ్రభూమి దినపత్రికలో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ వార్తకు స్పందన లభించింది. దేవస్థానంలో వాడే నూనె విషయమై శుక్రవారం అర్చకులు, వేదపండితులతో సమావేశమైనట్లు ఈవో వరప్రసాద్ తెలిపారు. ఆలయంలో ఎప్పటి నుంచి ఎలాంటి నూనెలు వాడుతున్నారని అర్చకులను అడిగి తెలుసుకున్నామన్నారు. ఆవునెయ్యి శ్రేష్ఠమని వేదపండితులు స్పష్టం చేశారు. పూర్వం నుంచి ఆలయంలో పాటిస్తున్న ఆగమశాస్తవ్రిధానాల గురించి తెలుసుకున్న అనంతరం పొద్దుతిరుగుడు నూనె వాడాలని అంతా కలిసి నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై మహానందిలో నిత్యదీపారాధనకు పొద్దుతిరుగుడు నూనె వాడాలని, ఉదయం, సాయంత్రం ప్రత్యేక హారతులకు ఆవునెయ్యి వాడాలని నిర్ణయించినట్లు ఇఓ తెలిపారు.
పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం
బళ్ళారి, జూలై 15: తుంగభద్ర జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు జలాశయం చేరుకుంటోంది. శుక్రవారం ఒక్కరోజే 3 టిఎంసిల నీరు వచ్చి చేరింది. జలాశయంలో 35.377 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే ఆగస్టు చివరి నాటికల్లా జలాశయం నిండుతుందని అధికారులు భావిస్తున్నారు.
నేడు కృష్ణా డెల్టాకు గోదావరి నీరు
పోలవరం, జూలై 15: పట్టిసం ఎత్తిపోతల పథకంలో ఏడు మోటార్ల ద్వారా 2,450 క్యూసెక్కుల గోదావరి నీటిని ప్రాజెక్టు కుడి కాలువలోకి వదులుతున్నట్లు ఎత్తిపోతల సిఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం ఉదయం వరకూ అయిదు మోటార్లు ఆన్ అయి ఉండగా, అనంతరం మరో రెండు మోటార్లు ఆన్‌చేశారు. గురువారం ఉదయం పెదవేగి మండలం జానంపేట వద్దనున్న అక్విడెక్టును దాటిన గోదావరి నీరు అదే రోజు రాత్రి 8గంటలకు కృష్ణా జిల్లాలో ప్రవేశించినట్లు కుడి కాలువ ఎస్‌ఇ శ్రీనివాస యాదవ్ తెలిపారు. శనివారం కృష్ణా డెల్టాలోకి చేరుతుందన్నారు. ఈ నెల 6న సిఎం చంద్రబాబు మోటార్లు ఆన్ చేయగా, రెండు మోటార్ల ద్వారా గోదావరి నీటిని కుడి కాలువలోకి తరలించారు. ఆ మోటార్లు అంచలంచెలుగా పెంచుకుంటూ ప్రస్తుతం ఏడు మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని తరలిస్తున్నారు. కుడి కాలువ నిర్మాణం పూర్తికానందున ఎత్తిపోతల నుండి కుడి కాలువకు చేరిన నీరు గోపాలపురం, గొల్లగూడెం గ్రామాల వద్ద నియంత్రిస్తూ ముందుకు తరలించారు. ఈ నెల 25నుండి 24 మోటార్లు ఆన్‌చేసి రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలించే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఫైల్ నెం
కూరగాయల తోటలకు భారీ నష్టం
డి గన్నవరం, జూలై 15: గోదావరి నదికి వచ్చిన వరద తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక గ్రామాల రైతులను నట్టేట ముంచింది. వసిష్ఠ, వైనతేయ నదీపాయల నడుమనున్న పి గన్నవరం మండలంలోని 12 లంక గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మినుము, మునగ, అరటి, కంద, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బెండ, బీర, ఆనప తదితర కూరగాయలు సాగుచేస్తుంటారు. ఈ తోటలన్నీ ప్రస్తుత వరదకు మునిగిపోయాయి. శుక్రవారానికి కొద్దిగా నీటిమట్టం తగ్గడంతో కుళ్లిపోయిన తోటలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం పచ్చిమిర్చి రేటు బాగుండటంతో నాలుగు డబ్బులు మిగులుతాయని ఆశించామని,కానీ గోదావరి తల్లి తమను నాశనం చేసిందని రైతన్నలు వాపోతున్నారు. లంక గ్రామాలైన పుచ్చల్లంక, కోడేరులంక, వైవి పాలెం, బెల్లంపూడి, ఊడిమూడి, జి పెదపూడి, వై కొత్తపల్లి, లంకల గన్నవరం, కె ఏనుగుపల్లి, కె ముంజవరం లంకభూముల్లోని పంటలు పూర్తిగా నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కొట్టుకుపోయిన కొబ్బరి రాశులు
ఇక ధరలేక రాశులుగా పోసిన కొబ్బరి కాయలు సైతం వరదకు కొట్టుకుపోయాయి. సరైన ధరలేక, కొనుగోళ్లు లేక లంక గ్రామాల్లోని రైతులు పలువురు కొబ్బరి కాయలను తమ భూముల్లోనే రాశులుగాపోసి, నిల్వచేశారు. అవన్నీ ప్రస్తుత వరద నీటిలో కొట్టుకుపోయాయి. పశుగ్రాసం పూర్తిగా గోదావరి పాలవడంతో పశువులన్నీ రోడ్లెక్కాయి. చేతికి వచ్చిన పంటలన్నీ గోదావరి పాలు కావడంతో రైతన్నలు ఆవేదన వర్ణనాతీతంగావుంది.