రాష్ట్రీయం

మండలిలో వాడీ వేడి చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శీతాకాల సమావేశం రెండోరోజైన శుక్రవారం పలు అంశాలపై అసక్తికరమైన చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలను కుదిపేసిన అంగన్‌వాడి వర్కర్ల సమస్యలు, కాల్‌మనీ వ్యవహారంపై మండలిలోనూ చర్చ జరగాలని విపక్షాలకు చెందిన సభ్యులు పట్టుబట్టారు. అంతేగాక, స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం సభ ప్రారంభం కాగానే కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరగాలంటూ వైఎస్సాఆర్సీ సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అలాగే అంగన్‌వాడి వర్కర్ల సమస్యలపై చర్చకు అనుమతించాలంటూ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి, చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా వాయిదా తీర్మానం చేయాలని వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇందుకు చైర్మన్ అనుమతితో మంత్రి అచ్చెనాయుడు సమాధానమిస్తూ అంగన్‌వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంగన్‌వాడి వర్కర్లకు ఇవ్వాల్సిన జీతాల్లో కేంద్రం 90శాతం, పదిశాతం రాష్ట్రం చెల్లించాల్సి ఉందని వివరించారు. కేంద్ర చెల్లించకపోవటంతో తమపై రూ. 1200 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు. అనంతరం మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఘనంగా ఉత్సవాలు నిర్వహించటమే గాక, ఎస్సీ,ఎస్టీలకు సరైన రుణ సహాయం అందేలా, అధికారాలు జిల్లా కలెక్టర్లకే అప్పగించాలని సభ్యుడు సుధాకర్‌బాబు కోరారు. ఉద్వేగంగా మాట్లాడుతున్న సమయంలో చైర్మన్ మైక్ కట్టేయటంతో తీవ్ర అసహనానికి గురైన సుధాకర్‌బాబు తాను దళితుడనని, అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించటంతో మైక్‌ను అనుమతించారు.

కాపులను బిసిల్లో చేర్చడంపై
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, డిసెంబర్ 18: కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బిసిల్లో చేర్చే విషయమై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. తమ కులాలను బిసిల్లో చేర్చాలంటూ, ఈ మేరకు ఆంధ్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ డాక్టర్ కెవికె రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్‌కుమార్ విచారించారు. అనంతరం రాష్ట్రప్రభుత్వానికి ఈ విషయమై నోటీసులు జారీ చేసారు. అనంతరం ఈ కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

అంబేద్కర్ విగ్రహానికి వైకాపా క్షీరాభిషేకం

హైదరాబాద్, డిసెంబర్ 18: వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం ట్యాంక్‌బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్‌మనీ అంశంపై చర్చను దాటవేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం జగన్మోహన్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు లోటస్‌పాండ్ నుంచి ప్రదర్శనగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.