రాష్ట్రీయం

ఇన్‌ఫార్మర్ నెపంతో పాస్టర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూలై 30: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామంలో పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నెపంతో చర్చి పాస్టర్ ఊయికా మారయ్య (36)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి దారుణంగా హతమార్చారు. లచ్చిగూడెం గ్రామంలోని చర్చిలో మారయ్య ఫాస్టర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో మారయ్య ఇంటికి సాయుధ మావోయిస్టులు, మిలీషియా సభ్యులు వచ్చారు. ఇంట్లో నిద్రిస్తున్న మారయ్యను బయటకు రమ్మని పిలిచారు. బయటకు వచ్చిన మారయ్య చేతులను వెనక్కి కట్టేసిన మావోయిస్టులు తమతోపాటు లచ్చిగూడెం రహదారి వద్దకు తీసుకువెళ్లారు. మారయ్య భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు ఏమీ చేయవద్దని ప్రాధేయపడినా మావోయిస్టులు పట్టించుకోలేదు. మారయ్యను కర్రలతో కొట్టి, మెడను కత్తితో కోసి హతమార్చారు.
మృతదేహం వద్ద సిపిఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కార్యదర్శి ఆజాద్ పేరున ఒక లేఖ విడిచి వెళ్లారు. ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీయాలనుకునేవారిని, అవినీతి, అక్రమాలకు పాల్పడేవారికి చేయూతనిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని, వారికి శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లకు కారకులు ఎవరైనా తాము తీసుకునే చర్యకు పూర్తిగా ప్రజలు మద్దతీయాలని మావోయిస్టులు కోరారు. పేగ పంచాయతీలోని అల్లిగూడెం, వినాయకపురం గ్రామాలకు చెందిన పలువురు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.
వారి పేర్లను సైతం లేఖలో పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోకుంటే మారయ్యకు పట్టిన గతే వారికీ పడుతుందని హెచ్చరించారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు శనివారం గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని చింతూరు తీసుకువచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మృతదేహాన్ని పరిశీలించారు.
మావోయిస్టుల చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. వారి దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. మారయ్య పోలీసు ఇన్‌ఫార్మర్ కాదన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మావోయిస్టుల సమాచారాన్ని తెలుసుకుంటున్నామని, తమకు ఇన్‌ఫార్మర్లు అవసరం లేదన్నారు. మావోయిస్టుల్లోనే తమకు సమాచారం ఇచ్చేవారు ఉన్నారని ఎస్పీ తెలిపారు.

చిత్రాలు.. లచ్చిగూడెం గ్రామంలో మావోయిస్టుల చేతిలో హతమైన మారయ్య.
మావోలు వదిలివెళ్లిన లేఖ