రాష్ట్రీయం

ఎమ్సెట్-3పై తర్జన భర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: మెడికల్ ఎమ్సెట్-2 పరీక్ష మరోమారు తిరిగి నిర్వహించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. శనివారం నుంచి మూడు రోజులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, వివిధ విభాగాల అధిపతులతో తర్జనబర్జన కొనసాగుతోంది. మెడికల్ ఎమ్సెట్ నిర్వహిస్తామని ప్రకటించింది మొదలు ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రవేశ పరీక్షను వేరుగా నిర్వహించకుండానే బయటపడగా, తెలంగాణ మాత్రం ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని చెప్పి ఇరకాటంలో పడింది. అదేదో కాస్తా ముగిసిందనుకునేలోగా లీక్ రుజువుకావడంతో అనివార్యంగా ప్రభుత్వం మెడికల్ ఎమ్సెట్‌ను రద్దు చేసింది. మెడికల్ ఎంట్రన్స్ స్కామ్‌లో రోజుకో విషయం బయటపడటం కూడా ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకే బ్లాక్ లిస్టు అయిన ప్రింటర్‌ను టెండర్ జాబితాలో చేర్చారనే ఆరోపణలు రాగా, ఎమ్మెల్సీ, విద్యా వేత్త రాజేశ్వరరెడ్డి బంధువుతో ఒక బ్రోకర్ సంభాషించారనే
ఆరోపణలు మిన్నంటాయి. మరోపక్క తల్లిదండ్రులతో జెఎన్‌టియు ఎమ్సెట్ కమిటీతో సంబంధం ఉన్న ప్రొఫెసర్ ఒకరు, కమిటీ కార్యాలయ సిబ్బంది టెలిఫోన్ సంభాషణల అంశం కూడా వివాదాస్పదమవుతోంది. ఎమ్సెట్-3ని ఈనెల 28న నిర్వహించేందుకు వీలుగా జెఎన్‌టియు ముసాయిదా షెడ్యూలు రూపొందించినా దానిని ఆమోదించేందుకు ప్రభుత్వం ముందూ వెనుకా ఆలోచిస్తోందని సమాచారం. అనేక ఆరోపణల మధ్య కొంతమంది విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎమ్సెట్ రద్దును వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం లేదా బుధవారం విచారణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తికాకుండానే ముందుగా షెడ్యూలును విడుదల చేస్తే మరో మారు గందరగోళం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో అధికారులు, ఎమ్సెట్ కమిటీ ఆచితూచి అడుగులు వేస్తోంది. తొందరపడితే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనను సీనియర్ అధికారి ఒకరు వ్యక్తం చేశారు. ఇంత వరకూ జరిగిన దర్యాప్తులో 69 మందికి పేపర్ అందినట్టు స్పష్టమైన ఆధారాలు లభించినా, కేవలం 8మంది బ్రోకర్లు, వారి సహచరులను అరెస్టు చేశారు. అనుమానిత విద్యార్ధులు, వారి తల్లిదండ్రులపై నిఘా పెట్టారు. పరీక్ష వ్యవహారం పూర్తయిన తర్వాతే విద్యార్థుల అరెస్టును చూపించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నుండి అనుమతి రాగానే తదుపరి చర్యలు చేపడతామని ఆ అధికారి చెప్పారు.