ఆంధ్రప్రదేశ్‌

కవి ఆవంత్స కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 12: ‘ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు... ఒక నెత్తుటి బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు..’ అని నినదించిన వజ్రాయుధ కవి, ప్రముఖ విమర్శకుడు డాక్టర్ ఆవంత్స సోమసుందర్ కన్నుమూశారు. 20 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమసుందర్ శుక్రవారం ఉదయం 11.45 గంటలకు కాకినాడ సమీపంలోని సర్పవరంలో తన కుమారుని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఆయన
రచించిన పలు రచనలు, గ్రంథాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈయన భార్య కొంతకాలం క్రితమే కన్నుమూశారు. నలుగురు కుమారులు, కుమార్తె సంతానం కాగా ఇరువురు కుమారులు చనిపోయారు. శశికాంత్ శాతకర్ణి, విజయ శేషేంద్ర శాతకర్ణి, కుమార్తె కళ్యాణకుమారి ఉన్నారు. 1924 నవంబరు 18న తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో ఆవంత్స సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు సోమసుందర్ జన్మించారు. 1929లో తన పినతల్లి దత్తత తీసుకోవడంతో పిఠాపురం వచ్చారు. చిన్ననాటి నుండి సాహిత్యంపై మక్కువతో కవితలు రాసేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యి జైలుకెళ్లారు. 1945నుండి 1954 వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. జైలులో ఉన్న సమయంలో అభ్యుదయ కవిత్వం వైపు అడుగులేశారు. 1949లో ఈయన తొలి రచన వజ్రాయుధం బయటకువచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగా రచించిన వజ్రాయుధం అప్పట్లో సంచలనం సృష్టించింది. సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్న కారణంతో 1950లో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం వజ్రాయుధాన్ని నిషేధించింది. అప్పటి నుండి ఆయన కలం ఆగలేదు. 110కి పైగ్రా గంథాలు, కథానికలను రచించారు. వీటిలో గోదావరి జలప్రళయం, కాగళి, వెనె్నల్లో కోనసీమ, మా ఊరు మారింది, జీవన లిపి, అర్రుపర్ణి తదితరాలు ప్రాచుర్యాన్ని పొందాయి. ఈయన కొన్ని నాటికలనూ రచించారు. కలలు- కన్నీళ్ళు పేరిట ఆత్మకథ రాసుకున్నారు. అనారోగ్యానికి గురైనా వీరి రచనలు ఆగలేదు. సహాయకుల సహాయంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ షష్టిపూర్తి సందర్భంలో శరత్‌చంద్రిక శీర్షికతో పుస్తకాన్ని రచించి బహుమతిగా అందించారు. ఇదే ఆయన చివరి రచన. 2001లో తోటి సాహితీవేత్తలను ప్రోత్సహించాలనే సంకల్పంతో సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ స్థాపించారు. గత పదిహేనేళ్లుగా తన జన్మదినమైన నవంబరు 18న సాహితీవేత్తలను అవార్డులతో సత్కరిస్తున్నారు. 2002లో ఉమ్మడి ఆంధ్ర నుంచి ఆత్మీయ గౌరవ పురస్కారాన్ని ఆవంత్స అందుకున్నారు. ఎన్టీఆర్ స్మారక జాతీయ అవార్డు, విశాలాంధ్ర విశిష్ట పురస్కారాన్ని పొందారు. ‘నేను రాస్తున్న క్షణాలే.. నేను బతికున్న క్షణాలు అనిపిస్తుంది’ అని ఆయనో సందర్భంలో అన్న మాటలను సహచర సాహితీవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. డాక్టర్ ఆవంత్స మృతికి తూర్పు గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు.