ఆంధ్రప్రదేశ్‌

కృష్ణమ్మ.. జనసంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: కృష్ణాతీరం జన సంద్రమైంది. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పుష్కర స్నానాలు చేసిన భక్తజనాన్ని పునీతం చేసింది. మూడో రోజైన ఆదివారం రాష్ట్రంలోని కృష్ణా తీరం అంతా భక్తకోటితో కిటకిటలాడింది. ప్రధానంగా విజయవాడ నగరానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం ఒక్కరోజే కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సుమారు 30 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. విజయవాడలో సుమారు 13 లక్షలు, రూరల్ ప్రాంతాల్లో ఆరు లక్షలు, గుంటూరు అర్బన్ ప్రాంతంలో మూడు లక్షలు, రూరల్‌లో 11 లక్షలు, కర్నూలులో లక్ష మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్టు అధికారులు చెపుతున్నారు. కనకదుర్గ అమ్మవారిని సుమారు రెండు లక్షల మంది దర్శించుకున్నారు. ఆదివారం భక్తుల తాకిడి పెరుగుతుందని ముందుగానే అధికారులు అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఘాట్‌ల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. సిసి కెమెరాల ద్వారా ఘాట్‌లలోని పరిస్థితిని పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. అలాగే పిండ ప్రదానాలకు తగిన వౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నిన్న, మొన్న భక్తులు, పురోహితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్‌లపై ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు భక్తులకు విశేష సేవలందించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. డిజిపి సాంబశివరావు విజయవాడ, గుంటూరు, పవిత్ర సంగమం వద్ద ఘాట్‌లను పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. కాగా, స్థానిక దుర్గా ఘాట్‌లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో కొంతమంది ముస్లింలు పుష్కర స్నానాలు ఆచరించడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రముఖుల పుణ్యస్నానాలు
ఆదివారం పలువురు ప్రముఖులు పుణ్య స్నానాలు చేశారు. దుర్గా ఘాట్‌లో కంచికామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్నానాలు చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపి సిఎం రమేష్ తదితరులు పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు. సంగమేశ్వరంలో డిప్యూటి సిఎం కెఇ కృష్ణమూర్తి పిండ ప్రదానం చేశారు.
గుండెపోటుతో ఇద్దరు మృతి
ఇదిలా ఉండగా పుష్కర స్నానాలు చేస్తూ గుండెపోటుతో ఇద్దరు మరణించారు. గొల్లపూడి ఘాట్ వద్ద పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడానికి వచ్చిన విజయవాడ రైల్వే కోచ్ డిపోలో సీనియర్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న కామేశ్వరరావు (48) గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించారు. అలాగే కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో పుష్కర విధులు నిర్వర్తిస్తున్న విఆర్‌ఎ మేడికొండ ప్రసాద్ (60) గుండె పోటుతో మరణించాడు.
గుంటూరు జిల్లాలో
కృష్ణాపుష్కరాల మూడోరోజు గుంటూరు జిల్లాలో సుమారు 13 లక్షల మంది భక్తులు స్నానమాచరించారు. ఒక్క అమరావతి ఘాట్‌లోనే లక్షన్నర మంది పైగా పుష్కర యాత్రికులు వచ్చినట్లు అంచనా. భక్తుల రద్దీ అధికం కావడంతో భక్తులు సేదతీరేందుకు ఏర్పాటుచేసిన షామియానా ఒక్కుదుటన నేలకొరిగింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ధ్యానబుద్ధ పుష్కరఘాట్ వద్ద ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పర్యాటక ప్రాంతమైన విజయపురిసౌత్, ఆధ్యాత్మిక కేంద్రమైన సత్రశాల, అమరావతి తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం, బోరుపాలెం, ఉండవల్లి, తాడేపల్లి, వైకుంఠపురంలో పాతిక నుంచి 50వేల మంది వరకు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. దాచేపల్లి మండలం పొందుగల, విజయపురిసౌత్‌లో తెలంగాణ ఘాట్లలో పుష్కర యాత్రికుల సంఖ్య పెరిగింది.
కర్నూలు జిల్లాలో
కర్నూలు జిల్లాలోని ప్రధాన ఘాట్‌లు శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సప్తనది సంగమేశ్వరం వద్ద లలితా ఘాట్‌లో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానమాచరించారు. సుమారు 87 వేల మంది శ్రీశైలంలో, 33 వేల మంది భక్తులు సంగమేశ్వరంలో పుణ్యస్నానం చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సంగమేశ్వరంలోని లలితా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించి తన సోదరులతో కలిసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు.

చిత్రం... విజయవాడలోని పద్మావతీ పుష్కర ఘాట్‌లో ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చిన భక్తజనం