రాష్ట్రీయం

సంతోషంగా ఉన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో (ఎట్ హోం) అత్యంత ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం సరిగ్గా 5.30 గంటలకు జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఎట్‌హోం గంటపాటు కొనసాగింది. 6.30 గంటలకు మళ్లీ జాతీయ గీతంతో పూర్తయింది.
నిర్ణీత సమయం 5.30 గంటలకన్నా దాదాపు 15 నిమిషాల ముందే చంద్రబాబు, కెసిఆర్ రాజ్‌భవన్ చేరుకున్నారు. సాధారణంగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే ఇద్దరు సిఎంలతో కలిసి గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత జాతీయ గీతాలాపనలో పాల్గొన్న గవర్నర్, ఇద్దరు సిఎంలతో కలిసి రాజ్‌భవన్ ముందుభాగం తోటలో ఏర్పాటు చేసిన భారీ షామియానాలోకి వచ్చారు. వేదిక నుండి కిందకు దిగుతూనే అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి (ఇద్దరు సిఎంలు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని) ‘మీరు సంతోషంగా ఉన్నారా?’ (ఆర్ యు సాటిస్‌ఫైడ్?) అంటూ పలకరించారు. గవర్నర్ ఒకవైపు కెసిఆర్ మరోవైపు చంద్రబాబు ఉండటం చూసిన మీడియా ప్రతినిధుల్లో ఒకరు ఈరోజు ‘్ఫల్‌మూన్‌డే’లా ఉందన్నారు. దానికి స్పందించిన గవర్నర్ ‘ఔను ఫుల్ మూన్‌డేలా’ ఉందన్నారు. నిరుడు పంద్రాగస్టు నాటి ఎట్‌హోంలో చంద్రబాబు పాల్గొన లేదు. ఈ పర్యాయం బాబు, కెసిఆర్ పాల్గొనడం పట్ల గవర్నర్ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించింది. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మళ్లీ ఇద్దరు సిఎంల భేటీ ఏర్పాటు చేస్తారా అంటూ మరో విలేఖరి అడిగిన ప్రశ్నకు గవర్నర్ సమాధానం చెబుతూ, ‘చూద్దాం’ అంటూ ముందుకు సాగారు.
అదే సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు నవ్వుతూ ముందుకు కదలగా, కెసిఆర్ మాట్లాడుతూ ‘ఇది ఎట్ హోం కదా? ఈ కార్యక్రమానికే ప్రస్తుతం పరిమితం అవుదాం’ ఇతర అంశాలు ఇప్పుడొద్దు’ అంటూ ముందుకు వెళ్లిపోయారు. రాజ్‌భవన్ ఎదుట ఉన్న తోటలో విశాలంగా ఏర్పాటు వేసిన భారీ షామియానాలో వివిఐపిలు, విఐపిలతో దాదాపు గంట సేపు గవర్నర్ కలియ తిరిగారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, బాబు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎపి శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాజీ ఐఎఎఎస్ అధికారులు, మాజీ ఐపిఎస్ అధికారులు, సివిల్ సర్వీసెస్ ప్రస్తుత అధికారులు, మాజీ అధికారులు తదితరులకు గవర్నర్ దంపతులు అభివాదం చేశారు. కార్యక్రమం ప్రారంభమైన 25 నిమిషాల తర్వాత చంద్రబాబు వెళ్లిపోయారు.
బాబు వెళ్లిన తర్వాత ఎపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి కెసిఆర్ పక్కనున్న కుర్చీలో కూచుని దాదాపు 20 నిమిషాల పాటు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. కెసిఆర్ కూడా నవ్వుతూ, తలఊపుతూ చౌదరి చెప్పిన అంశాలన్నీ వింటూ మధ్యమధ్యలో తన అభిప్రాయాన్ని చెప్పడం కనిపించింది.
బాబును పట్టించుకోని జగన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ వద్దకు, కెసిఆర్ వద్దకు వెళ్లి అభివాదం చేసి, కరచాలనం చేశారు. అయితే గవర్నర్ పక్కనే కూచున్న చంద్రబాబువైపు చూడకుండా ముందుకు వెళ్లినప్పటికీ, ఆ తరువాత ఆయనతో కరచాలనం చేశారు. గవర్నర్ అందరినీ పలకరిస్తూ జగన్ వద్దకు వెళ్లిన సమయంలో కొన్ని సెకన్లపాటు జగన్‌తో ఏదో గుసగుసలాడారు. జగన్ కూడా గవర్నర్ చెప్పిన అంశాలను జాగ్రత్తగా వింటూ తలూపారు. దాంతో జగన్‌కు గవర్నర్ ఏం చెప్పారు..అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది.
ఇద్దరితో వెళ్లి.. ఒకరితో వచ్చి..
సాయంత్రం 5.30 గంటలకు ఇద్దరు సిఎంలతో పాటు రాజ్‌భవన్ ప్రధాన హాల్ నుండి వెలుపలకు వచ్చి, గంట తర్వాత కేవలం కెసిఆర్ ఒక్కరితోనే లోపలకు వెళ్లారు. హాల్‌లోకి వెళుతున్న ఇద్దరిని ఉద్దేశించి మీడియా ప్రతినిధులు ‘ఇద్దరితో వెళ్లి ఒక్కరితో వస్తున్నారే? అంటూ’ గవర్నర్‌ను ప్రశ్నించారు. పక్కనే ఉన్న కెసిఆర్ కల్పించుకుని ‘చంద్రబాబు 7.30 గంటలకు హారతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వెళ్లిపోయారు’ అంటూ సమాధానం చెప్పారు.

చిత్రాలు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన
ఎట్‌హోం కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులను సాదరంగా ఆహ్వానిస్తున్న గవర్నర్ నరసింహన్

ఎట్‌హోంలో పాల్గొన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, తెలంగాణ, ఏపి మండలి చైర్మన్లు స్వామిగౌడ్,
చక్రపాణి, టి.సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి సుజనాచౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ