రాష్ట్రీయం

మీది తెనాలి.. మాది తెనాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 16: ‘మీది తెనాలి.. మాది తెనాలి’.. ఈ వాక్యం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంద్ర సినిమాలో పూజలు చేస్తామంటూ భక్తులను నమ్మకంగా మోసం చేసి బంగారంతో ఉడాయించే పాత్రలో హాస్యం పండించారు. గొప్పగా పండిన ఈ సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. సరిగ్గా ఇదే పంథాలో కృష్ణా పుష్కరాల స్నాన ఘాట్‌లో పూజారి అవతారమెత్తిన ఓ దొంగ బంగారంతో ఉడాయిస్తూ దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే... కృష్ణా పుష్కరాల్లో నేరగాళ్ళు హల్ చెల్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీనిలో భాగంగా ఘాట్ల వద్ద జల్లెడ పడుతున్న క్రమంలో దొంగ పూజారి బండారం బయట పడింది. విశాఖకు చెందిన దినేష్‌కుమార్ అనే వ్యక్తి పుష్కర స్నానాలకు విజయవాడ వచ్చాడు. బాగా రద్దీగా ఉన్న కృష్ణవేణి ఘాట్‌లో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఘాట్ 12వ నెంబర్ వద్ద స్నానం చేశాడు. అనంతరం పిండప్రదానం చేసేందుకు పూజారి కోసం అనే్వషిస్తున్న క్రమంలో వంగు ఆదినారాయణ తారస పడ్డాడు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదినారాయణ అచ్చం పూజారి వేషంలో ఉన్నాడు. ఈ పూజారితో పిండప్రదాన కార్యక్రమానికి దినేష్‌కుమార్ సిద్ధమయ్యాడు. పూజలు చేసిన ఆదినారాయణ నీటిలో పిండాలు కలిపి రమ్మనమని చెప్పాడు. పిండాలు తీసుకువెళుతున్న దినేష్‌ను పిలిచి చేతికున్న బంగారు ఉంగరం, గొలుసు చెంబులో వేసి, పిండాలను నీటిలో కలపాలని ఆదేశించాడు. నిజమేనని నమ్మిన భక్తుడు వేలికున్న ఉంగరం, మెడలోని గొలుసు తీసి చెంబులో వేసి వెనుతిరగ్గానే చెంబుతో పూజారీ పలాయనం చిత్తగిస్తూ దొరికిపోయాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగ పూజారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సొత్తు రికవరీ చేశారు.