ఆంధ్రప్రదేశ్‌

ఏపి సర్కారుకు ‘స్విస్’ సంకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ విధానంపై ఒక భవన నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేయటం సర్కారుకు ఆందోళనగా మారింది.
6.84 చదరపుకిలోమీటర్లలో (1,691 ఎకరాలు) అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ గత నెల 18న సిఆర్‌డిఏ కమిషనర్ పేరుతో టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. దీన్ని సవాల్ చేస్తూ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జునరావు పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ కంపెనీ ఎంత కోట్ చేసిందన్న విషయాన్ని బహిరంగపరచకుండా, మిగిలిన కంపెనీలు ఏ విధంగా టెండరు వేస్తాయని, ఇది విదేశీ కంపెనీకి కట్టబెట్టే కుట్రేనని వైసిపి, కాంగ్రెస్, వామపక్షాలు చాలాకాలం నుంచి విమర్శలు చేస్తున్నాయి. తెదేపా మిత్రపక్షమైన బిజెపి కూడా హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి ప్రభుత్వం విధానాలు సరిగాలేవని, కోర్టు తీర్పులకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వ విధానం అనాలోచితంగా ఉంది. కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. స్విస్‌చాలెంజ్‌పై ప్రతిపక్షంలో ఉన్నప్పడు టిడిపి కూడా మాట్లాడింది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం మంచిదికాదు. గతంలోనే ఈ విధానంపై హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అగ్రిగోల్డ్ విషయంలో సిఐడి ఇలాగే తొందరపాటుతో వ్యవహరించింది. దానిపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు 40 లక్షల మంది డిపాజిటర్లు మునిగిపోయారు. ఇప్పుడు స్విస్ చాలెంజ్ కూడా అదే దారి పట్టకుండా చూడాలి’ అని సురేష్‌రెడ్డి అన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో అన్ని వర్గాలు శుక్రవారం నాటి తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ అయిన నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు ఇవ్వాలన్న పిటిషన్‌పై నిర్ణయాన్ని ఈనెల 26న వెలువరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించడమే దానికి కారణం. ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ప్రభుత్వం స్విస్ చాలెంజ్‌పై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోవడమే కాకుండా, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంది. పైగా బిడ్ల దాఖలుకు సెప్టెంబర్ 1 చివరితేదీ కావడంతో, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, స్విస్ చాలెంజ్ విధానం కోర్టులో చెల్లుబాటు కాదని కొందరు ఉన్నతాధికారులు మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్విస్ చాలెంజ్ విధానంపై 2009 మే 11న ఇచ్చిన తీర్పును ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదని అధికారులు వాపోతున్నారు. ఇలాంటి పద్ధతులు పాటించేముందు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని, అనుమతులు, కాలపరిమితులు వంటి వాటిని విధిగా ప్రకటించాలని, పాల్గొనాలనుకొనే అన్ని ప్రైవేటు కంపెనీలకు సమాన అవకాశాలివ్వకపోతే ఏకపక్ష, అన్యాయ ధోరణులు చొరబడతాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేల్కర్ కమిటీ కూడా 2015లో స్విస్ చాలెంజ్ విధానానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. పోటీదారులకు సమాచార కొరత ఉంటున్నందున ఈ పద్ధతిని ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది.