ఆంధ్రప్రదేశ్‌

ఏపీ తరఫున వాదించనున్న అటార్నీ జనరల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: స్విస్‌చాలెంజ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తారని ఏపి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి రమేష్ హైకోర్టుకు తెలిపారు. మంగళవారం హైకోర్టు ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, స్విస్‌చాలెంజ్‌పై సవరణలతో కూడిన నోటిఫికేషన్‌ను సిఆర్‌డిఏ జారీ చేసినట్లు చెప్పారు. బిడ్స్‌ను సమర్పించేందుకు గడువును సెప్టెంబర్ 13 వరకు పొడిగించామన్నారు. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్‌ను సైతం దాఖలు చేసినట్లు చెప్పారు. పిటిషనర్ తరఫున న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రెవెన్యూ వాటాలపై సిఆర్‌డిఏ వివరాలు వెల్లడించలేదన్నారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. అయితే పిటిషనర్ హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించలేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఈ కేసులో అటార్నీ జనరల్ కోర్టుకు హాజరై ప్రభుత్వ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అనంతరం ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. సవరణలతో కూడిన నోటిఫికేషన్‌ను సవాలు చేసే అధికారం పిటిషనర్‌కు ఉందని హైకోర్టు పేర్కొంది.
కాగా స్విస్‌చాలెంజ్ విధానం కింద రెవెన్యూ వాటాలు వెల్లడించకపోవడమనే చర్యను సమర్థించుకుంటూ సిఆర్‌డిఏ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇతర వాణిజ్య కాంట్రాక్టుల మాదిరిగా రాజధాని నిర్మాణాన్ని పోల్చడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు కాంట్రాక్టు సంస్థల ఎంపిక జరుగుతుందన్నారు. భారతదేశం వెలుపల సంస్థలను వౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆహ్వానించడంలో తప్పేమీ లేదన్నారు. విదేశీ ఇనె్వస్టర్లను ఆకర్షించేందుకు, నిర్మాణంలో అత్యంత ఆధునిక టెక్నాలజీని అమలు చేసేందుకు విదేశీ సంస్ధలతో జాయింట్ వెంచర్ చేయడం సరైన విధానమేనన్నారు. కాగా ఈ కౌంటర్ అఫిడవిట్‌పై తమ అభ్యంతరాలు తెలియచేయాలని హైకోర్టు పిటిషనర్‌ను కోరింది.