తెలంగాణ

పోటెత్తిన భక్త జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 25: శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ భూముల్లో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగంలో మూడవ రోజు రుత్విక్కులు శే్వత వస్త్రాలను ధరించి నిర్ణీత సమయానికి కార్యక్రామాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివవప్రసాద్‌రావు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, త్రిదండి చిన జీయర్‌స్వామి, శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వాములు హాజరయ్యారు.
పౌర్ణమి, దత్త జయంతి, అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం, వరుసగా సెలవులు రావడంతో పిల్లాపాపలను వెంటబెట్టుకుని యావత్ తెలంగాణాతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎర్రవల్లి గ్రామ పరిసరాలు ఎటుచూసినా వాహనాల పార్కింగులే దర్శనమిచ్చాయి. గౌరారం, మర్కుఖ్ మీదుగా, ప్రజ్ఞాపూర్, గణేష్‌పల్లి రెండు మార్గాల్లో వేలాది వాహనాలు రాకపోకలు సాగించడంతో గౌరారం, ప్రజ్ఞాపూర్ వద్ద ట్రాఫిక్ జాం అయింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించినా భక్తులకు అసౌకర్యంగానే మారింది. రాజీవ్ రహదారి మీదుగా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, కరీంనగర్, మంథని, జనగాం, సిరిసిల్ల, వేములవాడ, వరంగల్, గోదావరిఖని, హుజురాబాద్, హుస్నాబాద్ తదితర డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులన్నీ కనీసం వంద మంది ప్రయాణికులు లేకుండా వెళ్లాయంటే ఎర్రవల్లికి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది.
జాతరల్లో కుటుంబ సభ్యులనో, బంధుమిత్రులనో, తల్లిదండ్రులను తప్పిపోయినట్లుగానే ఎర్రవల్లి యాగాన్ని చూడడానికి వచ్చిన అనేకమంది విడిపోయారు. వీరంతా పోలీస్ కంట్రోల్ రూం వద్దకు వెళ్లి మైకుల ద్వారా తమ తమ వారిని చేరుకునేందుకు ప్రయత్నించారు. రెండు రోజులు ప్రశాంతంగా భోజనం చేసిన భక్తులు మూడవ రోజు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం 11 గంటల నుంచే భోజనశాల వద్దకు వేలాది మంది తరలి రావడంతో కిక్కిరిసిపోయింది. భక్తులకు సరిపడ వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయని, తొందర పడకూడదని నిర్వాహకులు ఎన్ని సూచనలు చేసినా పోలీసులు నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తోపులాటలతో మహిళలు, చిన్న పిల్లలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సుమారు రెండున్నర కిలోమీటర్ల మేరకు కాలినడకన యాగశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భక్తులు యాగశాలకు వచ్చేటప్పటి కంటే తిరుగు ప్రయాణంలో మరిన్ని అవస్థలకు గురయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ మహిళ బస్సు ఎక్కే ప్రయత్నంలో కిందపడింది. పరిపూర్ణానంద, చినజీయర్ స్వాములు యాగశాలకు చేరుకున్న అనంతరం మంత్రి కె.తారకరామారావు యాగశాలలోకి వెళుతూ పోటెత్తిన భక్తుల మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి హరీష్‌రావు వెంటనే కెటిఆర్ వద్దకు వచ్చి యాగశాలలోకి తీసుకువెళ్లారు. యాగం పూర్తయిన అనంతరం వసతి కేంద్రానికి వెళ్లిన కెసిఆర్‌కు సైతం భక్తులతో ఇక్కట్లు తప్పలేకపోయాయి.
అయుత చండీ మహాయాగ దర్శన భాగ్యాన్ని రాత్రి పది గంటల వరకు పొడిగించడంతో సాయంత్రం వరకు కూడా భక్తులతో యాగశాల కిటకిటలాడింది. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడలేని వారు, భోజన శాల వద్ద జరుగుతున్న తోపులాటను చూసి అనేక మంది దర్శనం, భోజనం చేయకుండానే వెనుదిరిగిపోయారు. క్యూలైన్‌లో తోపులాట జరుగుతున్న విషయాన్ని గమనించిన సురేష్ అనే కానిస్టేబుల్ తోపులాటలో కిందపడిపోయాడు. తోటి సిబ్బంది గమనించి పైకిలేపారు. తోపులాట, ఉక్కపోతను భరించలేని మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు బారికేడ్లపైకెక్కి కిందకు దిగారు.

ఎర్రవల్లి పార్కింగ్ స్థలంలో వేలాదిగా నిలిపిన వాహనాలు

భక్తుల మధ్యలో ఇరుక్కుపోయిన కెటిఆర్‌ను యాగశాలలోకి తీసుకువెళుతున్న హరీశ్‌రావు

యాగం అనంతరం కాన్వాయ్‌లో వెళుతున్న సిఎం కెసిఆర్‌కూ తప్పని ఇక్కట్లు