రాష్ట్రీయం

గోదావరి ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఎగువన శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలం వద్ద నీటిమట్టం సోమవారం రాత్రి 27.2 అడుగులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. 08743- 232444 నెంబర్‌కు గోదావరి తీరప్రాంత ప్రజలు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. భద్రాచలంలో లాంచీలు, నాటుపడవలను సిద్ధం చేశారు. అశోక్‌నగర్ కొత్తకాలనీ, విస్తా కాంప్లెక్స్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు.
పట్టణంలోని బ్యాక్ వాటర్ ఉండకుండా గోదావరిలోకి స్లూయిజ్‌లు మూసివేసి పంప్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు గోదావరికి వరద ఉద్ధృతి ఉంటుందనే అంచనాతో తీరప్రాంతంలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో సెక్టోరియల్ అధికారులను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద
నీటి మట్టం 43 అడుగులు నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే డేంజర్ లెవెల్‌గా గుర్తిస్తారు.
భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. కాటన్ బ్యారేజి నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సుమారు 5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజికివున్న 175 గేట్లను ఎత్తివేసి వరద జలాలను దిగువకు వదిలిపెడుతున్నారు. భద్రాచలం నుండి వరద నీరు ధవళేశ్వరం చేరాలంటే ఇరవై నాలుగు గంటల వ్యవధి పడుతుంది. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు. సోమవారం బ్యారేజి వద్ద గేట్లను 0.7 మీటర్ల మేర ఎత్తి, 2,13,327 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద 6 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు.
కాగా స్థానికంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి డెల్టా కాలువలకు కూడా నీటి సరఫరా తగ్గించారు. తూర్పు డెల్టాకు బ్యారేజి నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. మధ్య డెల్టాకు 500 క్యూసెక్కులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పశ్చిమ డెల్టాకు 1500 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజి వద్ద అయితే 11.75 అడుగులకు నీటిమట్టం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 13.75 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులకు చేరుకుంటే డేంజర్ లెవెల్‌గా గుర్తిస్తారు. ఈ సీజన్‌లో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరగా వచ్చి అక్కడ నుంచి ప్రవాహ ఉద్ధృతి తగ్గింది. ప్రస్తుతం మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు.

చిత్రం.. భద్రాచలం స్నానఘట్టాల వద్ద గోదావరి వరద