రాష్ట్రీయం

ప్రపంచంలో శాంతి నెలకొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 3: ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని, దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్ని ప్రార్థించానని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం రాత్రి 7.30గంటలకు సిఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడానికి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆయనకు పరివేష్టం చుట్టి ఆయన తెచ్చిన పట్టువస్త్రాలు వెండిపళ్లెంలో పెట్టి ఆయన తలపై ఉంచారు. అక్కడనుంచి మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య గజరాజులు ముందు నడుస్తుండగా ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఆలయ మహద్వారం గుండా ఆలయంలోకి చేరుకున్నారు. 10నిమిషాల పాటు స్వామివారిని దర్శించుకొని ప్రార్థించారు. ఈసందర్భంగా టిటిడి తరపున ఆలయ ప్రధానార్చకులు ముఖ్యమంత్రికి శేషవస్త్రాన్ని బహూకరించారు.
అక్కడి నుంచి స్వామివారి తల్లి అయిన వకుళమాతను దర్శించుకొని సంపంగి ప్రాకారం చుట్టి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సబేరా రూములో స్వామివారి వస్త్రాన్ని కళ్లకద్దుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. టిటిడి చైర్మన్, ఇఓలు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం టిటిడి ముద్రించిన 2017 నూతన క్యాలెండర్‌ను, డైరీని సిఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతోనూ, ఇఓతోనూ పలు అంశాలపై చర్చించారు. అనంతరం టిటిడి ఎస్వీ భక్తిచానల్‌తో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇది పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికి రాష్ట్ర చరిత్రలో ఎక్కువ సార్లు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వస్త్రాలిచ్చే ఒక మహద్భాగ్యం స్వామివారు తనకు కల్పించారన్నారు. వెంకటేశుడు తనకు కులదైవమని, ఆయనకు సేవచేయడం తన అదృష్టమన్నారు. భక్తితో కొలిచే భక్తుల కోరికలను, సమస్యలను ఈడేర్చే స్వామి వెంకటేశ్వరుడన్నారు. అందుకే తాను ఏ పని చేపట్టినా ముందుగా స్వామివారిని మనస్సులో పెట్టుకొని ప్రార్థించి ప్రారంభిస్తానన్నారు. అందుకే తాను చేపట్టే పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతమవుతాయన్నారు. అందుకే ప్రపంచానికి శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించి ప్రజలంతా ఆనందంగా జీవించేలా ఆశీర్వదించమని తాను స్వామిని కోరారన్నారు. భారతదేశంలో గానీ, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని, ప్రజలను అన్నివిధాలా ఆదుకోవడం ఎవరికి ఏ కష్టం లేకుండా, పేదరికం లేకుండా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించమని ప్రార్థించానన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకే కాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా వసతి, దర్శనం, ప్రసాదాలు వారికి ఇబ్బంది లేకుండా సేవలందించాలని టిటిడిని కోరారు.

చిత్రం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం రాత్రి తిరుమలకు వచ్చిన ఏపి సిఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలుకుతున్న టిటిడి చైర్మన్ చదలవాడ, ఇఓ సాంబశివరావు