రాష్ట్రీయం

వెలగపూడికి వెలుగొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 3: గుంటూరు జిల్లా వెలగపూడిలోని కొత్త సచివాలయంలో యంత్రాంగం కొలువుతీరింది. మొత్తం 32 ప్రభుత్వ శాఖలకు గాను 28 విభాగాలకు చెందిన 15 వందల మంది రెగ్యులర్, మరో 500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం విధులకు హాజరయ్యారు. మొదటి బ్లాక్ మినహా మిగిలిన నాలుగు బ్లాకులలో 3వేల మంది వరకు ఉద్యోగులకు సీటింగ్ సదుపాయం కల్పించారు. అన్ని శాఖలకు కార్యాలయాలను బ్లాకుల వారీగా ఇప్పటికే నిర్దేశించారు. విజయవాడ, గుంటూరు నుంచి సుమారు 60కి పైగా ఆర్టీసీ మెట్రో, సాధారణ సర్వీసులను ప్రారంభించారు. ఉద్యోగులు లోపలకు ప్రవేశించేముందు భద్రతా సిబ్బంది నిశితంగా తనిఖీలు జరిపారు. ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను సెక్రటేరియట్ భవనాల వరకు అనుమతించారు.
హోం, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖల ఉద్యోగులు ఇంకా విధుల్లో చేరలేదు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్లు, హెచ్‌ఒడిలు ఇప్పటికే గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. టిఎస్ రిజిస్ట్రేషన్లతో ఉన్న ద్విచక్ర వాహనాల్లో చాలామంది ఉద్యోగులు తరలివచ్చారు. సాధారణ పరిపాలన, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు, పౌర సరఫరాలు, హౌసింగ్, వ్యవసాయ, జలవనరుల శాఖ ఉద్యోగులు తమ సీట్లలో ఆశీనులై విధులకు ఉపక్రమించారు.
మూడవ బ్లాక్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి వి ఉషారాణి ప్రారంభించారు. సచివాలయంలో సౌకర్యాలు భేషుగ్గానే ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చిన ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బరాజు నాగేశ్వరరావు, గజిటెడ్ అధికార్ల సంఘం నేత సుబ్బరామయ్య, తదితరులు ఎదురేగి అభినందనలు తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా తమను కుటుంబ సభ్యుల్లానే భావించారని, సొంత రాజధానిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఇదో అవకాశంగా తాము భావిస్తున్నామని మురళీకృష్ణ చెప్పారు. కాగా సచివాలయం ఆవరణలో పార్కింగ్, ప్రహరీ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాల్సిందిగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్మాణ సంస్థలను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్ డాటాలను సాధారణ పరిపాలన ఉద్యోగులు సరిచూసుకుని విధులను ప్రారంభించారు.

చిత్రం.. సికింద్రాబాద్ నుంచి గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఏపి సెక్రటేరియట్ ఉద్యోగినులు