రాష్ట్రీయం

చట్టాలను కాలరాస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన చట్టాలనే తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ దుయ్యబట్టారు. మద్యం, మత్తు పదార్థాలపై నిషేధం కోసం దశలవారీగా ఉద్యమాన్ని నిర్వహించబోతున్నామని ఆమె చెప్పారు. మద్యపానానికి వ్యతిరేకంగా గాంధీ జయంతి రోజున కన్యాకుమారి నుండి బయల్దేరిన మేధాపాట్కర్ బృందం గురువారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, బెజవాడ అడ్వకేట్స్ ఫర్ రైట్స్, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టిఐ క్యాంపియన్ తదితర సంస్థలు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మేధాపాట్కర్ మాట్లాడుతూ 2013 నుంచి అమల్లోకి వచ్చిన భూసేకరణ చట్టాన్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి కొత్తగా భూసమీకరణ పేరుతో దోపిడీ విధానానికి తెర లేపిందన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏటా మూడు పంటలు పండే భూములను, దళితులకు చెందిన అసైన్డ్ భూములను సేకరించే అవకాశమే లేదన్నారు. దశాబ్దాల తరబడి దళితులు సాగుచేసుకుంటున్న భూములను తీసుకోవటం అంటే దోపిడీయే అని అన్నారు. ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములను బీడుగా మార్చటంతో పాటు వృక్ష సంపదను సైతం నాశనం చేసి పర్యావరణానికి చేటు తెస్తున్నారని అన్నారు.
గతంలో రాజులు రాత్రుళ్లు మారువేషాల్లో పర్యటిస్తూ ప్రజల మనోభావాలను తెలుసుకునేవారని అయితే నేటి పాలకులు అన్నీ తెలిసినా కూడా స్వప్రయోజనాల కోసం ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం దశాబ్దాలుగా ప్రవహిస్తున్న కొండవీటి వాగును మళ్లించే పని చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యామంటూ హీనంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. శివరామకృష్ణ నివేదికను బుట్టదాఖలు చేసారంటూ ఎలాంటి పరిస్థితుల్లోను కేంద్రీకరణ వద్దని అసలు అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని కూడా చెప్పటం జరిగిందన్నారు.ఇక స్విస్ విధానం ఒక దోపిడీ వంటిదని అక్రమంగా స్విస్ బ్యాంకులో తమ సొమ్మును జమచేసుకోటానికి ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా అమరావతి వంటి నగరాలు నిర్మించుకుంటూ పోతే దేశం సర్వనాశనం కాగలదంటూ మేధాపాట్కర్ హెచ్చరించారు. పాలకులు ప్రజలను మద్యం బానిసలుగా మారుస్తూ ఆదాయ వనరులుగా మలచుకుంటున్నారంటూ విమర్శించారు. మద్యం, మత్తు పదార్థాలు లేని భారతదేశ నిర్మాణం కోసం దశలవారీ ఉద్యమాన్ని చేపడతామని అన్నారు.
పంజాబ్‌లో యువత వీటికి బానిసలై నిర్వీర్యమైందన్నారు. ఈ యాత్రలో ఆమె వెంట వివిధ రాష్ట్రాలకు చెందిన 15మంది ప్రముఖులు పాల్గొన్నారు. గురువారం రాత్రి వీరంతా కలిసి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ నుంచి నాగపూర్ మీదుగా తమ యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.