రాష్ట్రీయం

2025నాటికి లక్ష శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: రాబోయే తొమ్మిదేళ్ళలో దేశ వ్యాప్తంగా తన శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యంగా పెట్టుకున్నది. నగర శివారులోని ఘట్‌కేసర్ మండలం అన్నోజిగుడాలోని శ్రీ విద్యా విహార్ పాఠశాలలో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో భాగంగా సోమవారం శాఖల విస్తరణ, స్వయం సేవకులపై కమ్యూనిస్టుల దాడులను ఖండిస్తూ తీర్మానం చేయడంతో పాటు, జాతీయవాదాన్ని పెంపొందించడం వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయం సేవకులైన ప్రతినిధుల మధ్య కూర్చున్నారు. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభమై శత వసంతాలు పూర్తి చేసుకోనున్నందున, ఈ తొమ్మిదేళ్ళలో సంఘ్ శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 55 వేల సంఘ్ శాఖలు ఉన్నాయి. జాతీయ రోడ్లకు ఇరువైపుల ఉండే గ్రామాల్లో శాఖలు లేనట్లయితే ప్రారంభించాలని, అదేవిధంగా దేశ సరిహద్దు గ్రామాలకూ విస్తరించాలని భావించారు. శాఖల విస్తరణ ద్వారా జాతీయవాదం పెంపొందుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
హిందూ ధర్మమే దేశానికి శ్రీరామ రక్ష
ఇలాఉండగా ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్ సీనియర్ ప్రచారకులకు పలు సూచనలు చేశారు. జాతీయవాదం, హిందూ జీవన మూలాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఇందుకు ఆయన ఐదు విధుల గురించి వివరించినట్లు సమాచారం. 1) గోసేవ 2) కుటుంబ జీవనం 3) సామాజిక సమరసత 4) గ్రామ వికాస్, 5) ధర్మ జాగరణ. గ్రామ వికాస్ అంటే గోఆధారిత పంటలు వేయాలని, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ధర్మ జాగరణ అంటే హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ. హిందూ ధర్మమే దేశానికి శ్రీరామ రక్ష అని ఆయన తెలిపారు.
పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆందోళన
ఇలాఉండగా ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తూ దేశంలో పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల దేశ ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయాలు నాశనం అవుతున్నాయని అన్నారు. మన దేశ ప్రజల్లో ఆధ్యాత్మిక ఆలోచనలు, క్షమా భావం ఉంటుందని ఆయన తెలిపారు. క్షమా గుణాన్ని చూసిన తర్వాతే ఇతర దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించగలిగారని, లూటీ చేయగలిగారని అన్నారు. ఏకాత్మ మానవతా దర్శన్ గురించి ఆయన వివరించారు. ప్రస్తుత గ్లోబల్ విధానానికి దీన్‌దయాల్ ప్రతిపాదించిన ఏకత్మ మానవతా సిద్ధాంతం మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ప్రకృతి వైపరీత్యాలు సవాల్‌గా మారాయని ఆయన చెప్పారు. దీనిపై తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ సహ ప్రచార ప్రముఖ్ నంద కుమార్‌జీ మాట్లాడుతూ కేరళలో కమ్యూనిస్టుల ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళలోని కన్నూరు జిల్లాలోనే 55 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏమిటో అర్థం అవుతున్నదని అన్నారు. 1969లో మొదటి సారి స్వయం సేవకుడిని హత్య చేశారని, ఇప్పటికీ కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు స్వయం సేవకులుగా మారడాన్ని తట్టుకోలేకే హత్యలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ కేరళ వెళ్ళినప్పుడు విలేఖరులు ఈ విషయం గురించి ప్రశ్నించగా, హింసకు తాము వ్యతిరేకమని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే పరస్పరం చర్చించుకుందామని మోహన్‌జీ చెప్పారని నంద్ కుమార్ తెలిపారు.

చిత్రం.. ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం వివరాలను మీడియా తెలియజేస్తున్న ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య