రాష్ట్రీయం

ఏఓబిలో మరో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సీలేరు, అక్టోబర్ 25: విశాఖ మన్యంలో తుపాకుల మోత కొనసాగుతోంది. సోమవారం బూసిపుట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తుండగా మంగళవారం బెజ్జంగి దగ్గర మావోయిస్ట్‌లు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్‌లు మరణించారు. సంఘటనాస్థలంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ స్థాయిలో ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం సోమవారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడానికి డిజిపి సాంబశివరావు బయల్దేరారు. ఆయనకు భద్రత కల్పించేందుకు పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే అక్కడ ఉన్న మావోయిస్టులు పోలీసులపై మెరపుదాడికి దిగారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్ట్‌లు మరణించారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నట్టు సమాచారం. దీంతో గత రెండు రోజులుగా ఏఓబిలో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో 28 మంది మరణించినట్టయింది.
భిన్న కథనాలు
మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారు మరణించి ఉంటారని, ఆ మృతదేహాలను చూపించి, రెండో ఎన్‌కౌంటర్‌గా పోలీసులు పేర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో స్వల్పంగా గాయపడిన కొద్ది మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని మంగళవారం ఎన్‌కౌంటర్ చేశారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే, సోమవారం కేవలం ఒకే ఒక్క మావోయిస్ట్‌ను సజీవంగా పట్టుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆ మావోయిస్ట్ ఆచూకీ ఏమైందీ ఇంకా తెలియాల్సి ఉంది.
మంగళవారం మరణించిన మావోయిస్టుల మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లాకు తరలించాలా? విశాఖకు తరలించాలా అనే సంసిద్ధంలో పోలీసులు ఉన్నారు.
పోస్ట్‌మార్టం పూర్తి
సోమవారం ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు మంగళవారం మల్కన్‌గిరి జిల్లాలో పోస్టుమార్టం నిర్వహించారు. మృత దేహాలను తీసుకువెళ్ళేందుకు మంగళవారం రాత్రి వరకు మావోయిస్టుల కుటుంబ సభ్యులెవ్వరూ రాలేదు. మరణించిన వారిలో ఆర్‌కే కుమారుడు మున్నా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు మున్న తల్లి, ఆర్కే భార్య పద్మక్క మలక్కన్‌గిరికి చేరుకున్నట్టు సమాచారం. 24 మృతదేహాల్లో ఇంకా కొన్నింటిని గుర్తించాల్సి ఉంది.