రాష్ట్రీయం

ఆంధ్ర ఇస్తుందా? ఇవ్వదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాకరంగా నిర్మించనున్న కొత్త సచివాలయం నిర్మాణానికి ఏపి ప్రభుత్వం సహకరిస్తుందా? తెలంగాణ అడిగిన ఏపి సచివాలయం భవనాలను ఇస్తుందా? ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 31వ తేదీన ఆంధ్ర మంత్రివర్గసమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపి ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఏపి సచివాలయం భవనాలను తెలంగాణకు ఇచ్చే విషయమై కీలక నిర్ణయం తీసుకోనుంది. కాగా టిడిపి ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు విజయవాడలో ప్రకటన చేస్తూ హైదరాబాద్‌లో ఏపి సచివాలయం భవనాలను ఇచ్చేస్తారని ఎవరు చెప్పారు? 9,10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల సంగతి కూడా పరిష్కారం కావాలంటూ మడత పేచీ పెట్టే విధంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర సచివాలయ భవనాలు ఖాళీగా ఉన్నందు వల్ల తెలంగాణ సచివాలయంలో కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రతిని ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఇచ్చారు. ఒక వేళ ఏపి ప్రభుత్వం సచివాలయం భవనాలు ఇవ్వని పక్షంలో, లేదా జాప్యమైనా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ చక్కటి ప్రణాళికను ఖరారు చేశారని సమాచారం. కాగా గవర్నర్ కూడా అంతకు ముందు విజయవాడ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అంశాన్ని చంద్రబాబుతో ప్రస్తావించారు. ఈ విషయమై చంద్రబాబు పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించారు. కాని జనం మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆ తర్వాత చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఢిల్లీ తరహాలో ఏపి భవన్ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని, ఏపి సచివాలయంలో ఉన్న అవశేష ఉద్యోగులకు తాత్కాలికంగా ఒక మంచి భవనం కేటాయించాలని కోరినట్లు సమాచారం. మంత్రివర్గం తీర్మానం ద్వారా ఏపి సచివాలయ భవనాలను తెలంగాణకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటారా లేక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి దాని ద్వారా తతంగాన్ని కొనసాగిస్తారా అనే విషయం తేలలేదు. క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి ఈ వ్యవహారం చూడాలనుకుంటే జాప్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్తీక మాసంలోనే నూతన సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన, కూల్చివేత కార్యక్రమాలను మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్టమ్రంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏమిటంటే, పార్లమెంటు చట్టం ద్వారా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయింది. హైదరాబాద్‌లో ఏపికి కేటాయించిన భవనాలను తెలంగాణకు బదలాయించాలంటే గవర్నర్ ద్వారా కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు వెళ్లాలని, కేంద్ర హోంశాఖ వెంటనే ఈ ప్రతిపాదనను ఆమోదిస్తుందా లేక లీగల్ ఒపీనియన్ తీసుకుంటుందా? పార్లమెంటు చట్టం ద్వారా భవనాలు కేటాయింపు జరిగితే, మళ్లీ చట్టానికి సవరణ ద్వారా మాత్రమే భవనాలు బదలాయింపు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆమోదయోగ్యమైన అంగీకారం కుదిరితే, ఏపి సచివాలయం బదలాయింపు కార్యక్రమం వెంటనే పూర్తవుతుంది. కాని ఏపి సచివాలయంను ఒకసారి అప్పగిస్తే, రెండేళ్లలో ఈ భవనాలు మళ్లీ ఖాళీ అవుతాయి. తెలంగాణ సచివాలయం నిర్మాణం పూర్తయిన వెంటనే ఉద్యోగులు ఏపి సచివాలయాన్ని ఖాళీ చేస్తారు. చట్ట ప్రకారం 2024 జూన్ 1వ తేదీ వరకు ఏపికి కేటాయించిన భవనాలపై ఏపికి అధికారాలు ఉంటాయి. రెండేళ్ల తర్వాత తెలంగాణ మళ్లీ ఏపికి సచివాలయ భవనాలను అప్పగిస్తుందా లేక దీనిని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.