రాష్ట్రీయం

ట్రిబ్యునల్ తీర్పుపైనే సుప్రీంకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ట్రిబ్యుల్ తేల్చి చెప్పగా, నాలుగు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ జరగాలని తెలంగాణ కోరుకుంటోంది. దీనిపై న్యాయపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు ప్రయోజనం కలుగుతుందో చర్చించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం సమావేశమైంది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మంత్రులు హరీశ్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, సలహాదారు విద్యాసాగర్‌రావులతో కూడిన సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. సుప్రీంకోర్టులో ఈ కేసును వాదిస్తున్న న్యాయవాదులు సైతం సమావేశానికి హాజరయ్యారు.
విభజన చట్టంలో సెక్షన్ 89 కృష్ణా జలాల పంపిణీని ప్రస్తావించింది. సెక్షన్ 89 ఇరు రాష్ట్రాలకే వర్తిస్తుందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. మరోవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. సెక్షన్ 89పై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పై తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లడం మంచిదా? లేక ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున ఆ కేసులోనే తెలంగాణ వాదనలు వినిపించడం ప్రయోజన కరమా? అనే కోణంలో శనివారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. న్యాయనిపుణులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించిన తరువాత సబ్ కమిటీలోని మంత్రులు విడిగా మళ్లీ సమావేశం అయ్యారు. శనివారం నాటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వారం తరువాత తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
సెక్షన్ 89 ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశమే అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆంధ్రకు ఎలాంటి నష్టం కలిగించడం లేదని, అందువల్ల ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆంధ్ర నిర్ణయించుకున్నట్టు తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. శనివారం నాటి సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్ 89 రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని తీర్పు ఇచ్చినందున ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం కన్నా మొత్తం కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అంగీకరించకుండా ఆ అంశంపైనే సుప్రీంకోర్టులో వాదిస్తే తెలంగాణకు మేలు అని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించినప్పటికీ వివరాలు మీడియాకు వివరించవద్దని అధికారులకు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సున్నితమైన అంశాలను బహిరంగ పరచవద్దని కోరారు. సెక్షన్ 89పై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అధికారులు, న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో వ్యక్తం అయిన అభిప్రాయాలను మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. వారం రోజుల తరువాత మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ