ఆంధ్రప్రదేశ్‌

బిటెక్ ప్రశ్నాపత్రంలో బ్రహ్మణి, లోకేశ్, హెరిటేజ్ పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద సాంకేతిక విశ్వ విద్యాలయంగా పేరొందిన కాకినాడ జెఎన్‌టియు ముద్రించిన ప్రశ్నాపత్రాలు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా ప్రత్యక్షమయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని విద్యార్థులకు బలవంతంగా రుద్దేరీతిలో ఈ ప్రశ్నాపత్రాలు దర్శనం ఇచ్చాయి. ఇది తెలిసిన విద్యార్థిలోకం నివ్వెరపోయింది. టీడీపీ భావజాలాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్ది, ఇప్పటి నుండే వారిని కూడా కార్యకర్తల మాదిరిగా పార్టీవైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఓ విశ్వ విద్యాలయంలోని విద్యావిధానానే్న తనకు అనుకూలంగా మలచుకునేందుకు తెలుగుదేశం విసిరిన పాచికగా ఈ పరిణామాన్ని కొందరు అభివర్ణిస్తుంటే, అధికారులే బాబు కుటుంబంపై స్వామి భక్తిని చాటుకునేందుకు ఈ విధంగా దిగజారినట్టు వర్సిటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లతో జెఎన్‌టియుకె రూపొందించిన ప్రశ్నాపత్రం బుధవారం ఆంధ్రభూమికి అందింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జెఎన్‌టియులో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మేనేజిరియల్ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలసిస్ (ఎంఎఎఫ్‌ఎ) పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం ఇచ్చారు. సాధారణ పద్దును ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా రికార్డ్ చేస్తారు? అన్నదే ఆ ప్రశ్న. ప్రశ్నపత్రంలో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్‌లో బ్రహ్మణి, భువనేశ్వరి, హెరిటేజ్, లోకేశ్ ఇలా అన్నీ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, కుమారుడు, కోడలు, వారి కుటుంబ సంస్థల పేర్లను ప్రస్తావించడం విశేషం.
అలాగే సెట్ 2,3,4 ప్రశ్నపత్రాల్లో కూడా ఇవే పేర్లు పునరావృతమయ్యాయి. దీనిని చూసి ప్రశ్నాపత్రాలు రూపొందించిన వర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు కూడా టిడిపి కార్యకర్తలుగా మారిపోయారా? అన్న సందేహం కలుగుతోందని విద్యార్థులు వాపోయారు. కాగా ఈ ప్రశ్నాపత్రం వ్యవహారం బయటకు పొక్కడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వర్సిటీ వీసీ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను అంతర్జాతీయ స్థాయకి తీసుకువెళ్తామంటున్న సచివుల ప్రకటనల పరమార్ధం ఇదేనేమోనని విద్యాధికులు వ్యాఖ్యానిస్తున్నారు.

నేటి నుంచి హంపి ఉత్సవాలు
బళ్లారి, నవంబర్ 2: కర్నాటకలోని చారిత్రాత్మక హంపిలో గురువారం నుంచి మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగనున్నాయి. ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం హంపి విరూపాక్షాలయం ఎదురుగా ఉన్న బసవన్న మంటపం వద్ద నిర్మించిన ఎంపి.ప్రకాశ్ వేదికపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉత్సవాల కోసం మొత్తం 9 వేదికలు సిద్ధం చేశారు. ఈ వేదికలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అదే విధంగా గజశాల వద్ద ఏర్పాటుచేసిన మ్యూజిక్ అండ్ సౌండ్ సిస్టం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి కళాకారులు, విచ్చేస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కుస్తీ, కబడ్డీ, గ్రామీణ పోటీలు, సాహస క్రీడలు, వస్తుప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో గౌరవ అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్, దేశపాండ్య, మహదేవప్ప, కన్నడ, సాంస్కృతిక మంత్రి ఉమాశ్రీ, రమేశ్ లక్ష్మణరావు, జారకిహొళి, ప్రియాంక ఖర్గే తదితరులు పాల్గొంటారు.

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెలుగు సదస్సుకు చోటు
తిరుపతి, నవంబర్ 2: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 24 గంటల నిర్విరామ జాతీయసదస్సు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ‘శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైతం-తెలుగు సాహిత్యం’ అనే అంశంపై ఒకటోతేది ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ జాతీయ సదస్సు బుధవారం ఉదయం 10 గంటల వరకు నిరాటంకంగా సాగింది. 45 మంది పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమాపనోత్సవానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. మునిరత్నం అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న రెక్టార్ భాస్కర్ మాట్లాడుతూ ఎస్వీయూ అభివృద్ధిలో భాగంగా తెలుగు అధ్యయనశాఖ వివిధ రకాల గొప్ప సదస్సులు నిర్వహించి ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని, ఇందులో భాగంగానే నేడు ఈ రికార్డు స్థానాన్ని దక్కించుకుందన్నారు. రామానుజుల పుట్టుక, ఆయన అందించిన వేదసారం వైష్ణవిజానికే కాకుండా భారతీయుల ఆధ్యాత్మిక జీవానానికి బాటులువేసిందన్నారు. ముఖ్యంగా తిరుమల ఆలయం ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు. రిజిస్ట్రార్ దేవరాజులునాయుడు మాట్లాడుతూ ఎస్వీయూలో ఒకేసారి తెలుగు, ఆంధ్ర శాఖలు ప్రారంభమయ్యాయన్నారు. తెలుగు శాఖ పరిశోధనా పరంగా ముందుకు దూసుకెళుతోందన్నారు.

షార్‌లోని ఎస్‌ఆర్‌పిలో షార్ట్ సర్క్యూట్
ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలు
సూళ్లూరుపేట, నవంబర్ 2: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్‌లో (ఎస్‌ఆర్‌పి) బుధవారం జరిగిన షార్టు సర్క్యూట్ ప్రమాదంలో షార్ రెగ్యులర్ ఉద్యోగితో పాటు మరో కాంట్రాక్కు ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు సాయంత్రం ఎస్‌ఆర్‌పిలో ఉన్న ప్యానల్ విభాగాలకు విద్యుత్తు సరఫరా చేసే విభాగాన్ని సరిచేస్తుండగా అకస్మాత్తుగా షార్టు సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగడంతో ఉద్యోగి కెవి.కృష్ణయ్యకి ముఖంతో పాటు చేతులు రెండు కాలి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి మునిరాజాకు చెయ్యి కాలి గాయాలు పాలయ్యాడు. వెంటనే ఇరువురిని షార్‌లో ఉన్న వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. వీరిలో కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే చెన్నైకి తరలించారు.
తెలుగు రాష్ట్రాలకు మరో వాయు‘గండం’
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 2: తెలుగు రాష్ట్రాల వైపు మరో వాయు4గండం2 పొంచి చూస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నారు. ఇది ఉత్తర కోస్తాను ఆనుకుని తీరం దగ్గరకు చేరుకుని బంగ్లాదేశ్ వైపు గమనాన్ని మార్చుకుంటుందని అంచనావేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా చెదురు,మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో కూడా ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.

కర్నూలు జిల్లాలో గొర్రెలకు ఆంత్రాక్స్
చాగలమర్రి, నవంబర్ 2: కర్నూలు జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతోంది. జిల్లాలోని చాగలమర్రి మండలం కదిరిపురం తండాలో అంత్రాక్స్ వ్యాధి సోకి గొర్రెలు మృతి చెందాయి. వారం రోజులుగా తండాలో 50 గొర్రెలు, మేకలు వ్యాధిసోకి మృతి చెందినట్లు గొర్రెలకాపర్లు తెలిపారు. గొర్రెలు ఉన్నపళంగా మృత్యువాత పడుతుండడంతో కాపర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పశువైద్యుడు పుల్లయ్య మాట్లాడుతూ తండాలో గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకిన విషయం వాస్తవమేనన్నారు. మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పశువైద్యాధికారులు శాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం పంపారన్నారు. ఆ పరీక్షల్లో గొర్రెలకు ఆంత్రాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఆంత్రాక్స్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

నిఘా నీడన పల్నాడు
మావోల బంద్ పిలుపుతో అప్రమత్తం
సానుభూతిపరుల బైండోవర్.. ఆంక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 2: ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతం (ఏఒబి)లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గురువారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వటంతో పల్నాడు ప్రాంతంలో నిఘాను తీవ్రతరం చేశారు. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్‌కె స్వగ్రామం తుమృకోట, పరిసర గ్రామాలపై దృష్టి సారించారు. ఎన్‌కౌంటర్‌లో ఆర్‌కె హతమయ్యాడా, లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే విషయమై గ్రామంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నల్లమల అటవీ సరిహద్దు గ్రామాల్లో పోలీసులు అణువణువునా గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులోని నడికుడి, దాచేపల్లి, విజయపురిసౌత్, మాచర్ల, పిడుగురాళ్ల, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీదళాలు రంగంలో దిగాయి. నల్లమల అడవులు కేంద్రంగా గత కొనే్నళ్ల క్రితం మావోయిస్టులు తమ కార్యకలాపాలు నిర్వహించారు. అప్పట్లో పోలీసులకు సవాళ్లు విసిరిన సందర్భాలనేకం ఉన్నాయి. 2005లో ప్రభుత్వంతో చర్చలు విఫలమైన అనంతరం నల్లమల అటవీ ప్రాంతం మొత్తం పోలీసుల అధీనంలోకి వచ్చింది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉనికిని కోల్పోయారు. సానుభూతిపరులు, మాజీ నక్సల్స్ అనేకమంది పల్నాడు ప్రాంతంలో ఉన్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు వారిని స్టేషన్లకు పిలిపించి ముందుజాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేయటంతో పాటు హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.