ఆంధ్రప్రదేశ్‌

కౌంటర్.. ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 4: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒకవైపు మావోయిస్టు కుటుంబాలు, సానుభూతిపరులు, ప్రజా సంఘాలు, మరోవైపు ఎన్‌కౌంటర్‌కు అనుకూలంగా పోలీసు కుటుంబాలకు చెందిన వారు గుంటూరులో శుక్రవారం పోటాపోటీగా ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మున్నా తల్లి, మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, తెలంగాణ యాప్రాల్‌కు చెందిన ప్రసాద్ సహచరితో పాటు టిఎస్ విద్యార్థి సంఘాల నేతలు, పలువురు అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, విరసం నేత కల్యాణరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వామపక్షపార్టీలు కూడా ధర్నాకు మద్దతిచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా నాయకులు పాశం రామారావు మాట్లాడుతూ మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించారు. ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ తన భర్త సజీవంగా ఉన్నట్లు వరవరరావు సమాచారాన్ని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మల్కన్‌గిరిలో ఎదురుకాల్పులు జరగలేదని, పోలీసులచేత ముఖ్యమంత్రి చంద్రబాబు మారణకాండ సృష్టించి గిరిజన, ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల ప్రతినిధి, విరసంనేత కల్యాణరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంతో పాటు ఏపి, ఒడిశా రాష్ట్రాలు అటవీ ప్రాంతంలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తంచేసే క్రమంలో బూటకపు ఎన్‌కౌంటర్‌తో కట్టుకథలు అల్లుతున్నారని విమర్శించారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ప్రభుత్వాలు ప్రజలపై యుద్ధం ప్రకటించాయన్నారు. ప్రభుత్వాలు స్వదేశీ జపంచేస్తూ రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉపాధి వంటి ఆకర్షణీయమైన పథకాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని కాల్చిచంపుతున్నాయని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమనేత వై వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు పోటీ ధర్నాలతో బూటకపు ఎన్‌కౌంటర్‌ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ మండిపడ్డారు. పోలీసులను హతమార్చితే ఏ రకంగా హత్యకేసు నమోదు చేస్తున్నారో బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలపై కూడా అదేరకంగా పోలీసులపై ఐపిసిలోని సెక్షన్ 302 కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మరో మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ భార్య దేవేంద్రి మాట్లాడుతూ తన భర్త ఎన్‌కౌంటర్‌లో చనిపోతే ఒంటిపై కత్తులు, గొడ్డళ్లు, ఇతర మారణాయుధాలతో చేసిన గాయాలెలా అవుతాయని ప్రశ్నించారు. కాళ్లు, చేతులు విరిచి, మొండాన్ని వేరుచేసి కిరాతకంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మృతురాలు మమత కుమారుడు మాట్లాడుతూ మావోయిస్టులు ఉన్నంతకాలం బాక్సైట్ తవ్వకాలు వీలుపడదనే భావనతో ప్రభుత్వం మారణకాండ సృష్టించిందన్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి, పిడిఎస్‌యు అధ్యక్షుడు రామకృష్ణ, నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్, పిఒడబ్ల్యు అధ్యక్షురాలు విష్ణు, విరసం నేత నల్లూరి రుక్మిణి, ప్రజా కళామండలి కార్యదర్శి కోటి, తెలంగాణ రాష్ట్ర ప్రజాఫ్రంట్ కార్యదర్శి మంచు రమేష్, విద్యార్థివేదిక కార్యదర్శి రమేష్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీకి చెందిన రెండు రాష్ట్రాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మావోయిస్టు కుటుంబాల ధర్నా వేదిక ఎదురుగా పోలీసులు ఆందోళనకు దిగారు. మావోయిస్టులు చనిపోతే సానుభూతి చూపుతారా.. మావి ప్రాణాలు కావా.. అంటూ నినాదాలు చేశారు. పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన పోలీసు కుటుంబాల సభ్యులతో ధర్నా నిర్వహించారు. ఏఒబి ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ఏఒబి ఎస్‌జెడ్‌సి అధికార ప్రతినిధి జగబంధు మీడియాకు వివరించిన అంశాలను కరపత్రాలుగా ముద్రించి పంపిణీ చేశారు. అక్టోబర్ 24న ఉదయం 6 గంటలకు తమ మకాం వద్దకు పోలీసులు చేరుకోగానే తమ పిఎల్‌జిఎ కాల్పులు జరిపిందని జగబంధు తెలిపారని, అంటే కాల్పులు ప్రారంభించింది మావోయిస్టులు కాదా అని ప్రశ్నించారు. పోలీసులు నిర్బంధించి కాల్పులు జరపలేదని పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించటం సమంజసం కాదని, మావోయిస్టులు నిరాయుధులుగా లేరని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.