రాష్ట్రీయం

దేదీప్యమానం..కోటి దీపోత్సవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ మషీరాబాద్, నవంబర్ 5: హరహర మహాదేవ.. ఓం నమఃశివాయ.. సాయిసదాశివ.. శివన్నామ స్మరణలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగాయి. కార్తీకమాసం సందర్భంగా భక్తి టీవి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ మహోత్సవం శనివారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తిప్రపత్తుల మధ్య ప్రారంభమయింది. ఈ నెల 21 వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం కొనసాగనుంది. తొలిరోజు శనివారం అభిషేకం, కోటిపుష్పార్చనతో కార్యక్రమం ప్రారంభమయింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటయిన అలంపురం క్షేత్ర అధిష్ఠాన దేవత జోగులాంబ అమ్మవారికి లోక కకల్యాణార్థం కళ్యాణాన్ని నిర్వహించారు. అలంపురం అర్చకుల బృందం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించింది. సమస్త నదీజలాలతో సహస్ర కలషాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం యజ్ఞోపవీత ఘట్టం మంత్రోచ్ఛారణలు, వేద మంత్రాల మధ్య జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, జ్ఞానయోగి రవిశంకర్ గురూజీ విశిష్ఠ అతిథిగా హాజరై తొలుత భక్తకోటికి ధ్యానం నిర్వహించారు. అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి పునీతులయ్యారు. రవిశంకర్ గురూజీ అనుగ్రహణభాషణం చేస్తూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ జ్ఞానజ్యోతి, ఆధ్యాత్మికత పెంపొందించుకోవాలన్నారు. వ్యక్తిలో చైతన్య శక్తి ఎదగాలనీ, మన శరీరం భక్తిమయమని, పంచ భూతాలు ఇనుమడించుకున్న వాడు శివుడు కాబట్టే ఓం నమఃశివాయ అని స్తుతిస్తామని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తిలో చింతలు తొలిగి చింత పెరగాలంటే ధ్యానం అవసరమని సూచించారు. ‘చింతించకపోవటమే భక్తుడి లక్ష్యమని, సదా నావెంటే దేవుడు ఉన్నాడు.. నేను ఒంటరి వాణ్ని కాదు.. ఎటువంటి సమయంలోనైనా నన్ను ఆదుకుంటాడు అన్న చింతన ఉండాలి. కానీ చింత ఉండరాదు’ అని ఉద్బోధించారు. ప్రతి వ్యక్తి జ్యోతి స్వరూపం అనే సత్యం తెలుసుకోవటానికి ధ్యానం చేయాలని అన్నారు. భక్తి టీవి చైర్మన్ నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

శనివారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో అఖండ జ్యోతి వెలిగించి కోటి దీపోత్సవాన్ని ప్రారంభిస్తున్న
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ