రాష్ట్రీయం

వడ్డించేది మనవాళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
అమరావతి, నవంబర్ 5: అసలే అది మంత్రి గారి కంపెనీ. వారేమో ఆయన శాఖలో పనిచేసే అధికారులు. పైగా నిజాలు నిగ్గుతేల్చమంటూ సర్కారు వేసిన కమిటీలో సభ్యులు కూడా. మరి తీర్పు ఎటువైపు ఇవ్వాలి? ఎవరివైపు మొగ్గాలి? మంత్రిగారి కంపెనీకి పరిహారం ఎక్కువ ఇవ్వాలని సిఫార్సు చేస్తే విపక్షాలు, ప్రజాసంఘాలు దుమ్మెత్తిపోస్తాయి. పోనీ తక్కువ పరిహారంతో సరిపెడితే మంత్రిగారితో మొహమాటమాయె. ఏం చేయాలి?.. ఇదీ విద్యా, గ్రంధాలయ శాఖ అధికారుల ఇరకాటం. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌కు సంబంధించిన కంపెనీకి పరిహారం ఇప్పించే విషయంలో ఏర్పాటయిన కమిటీలో డైరెక్టర్ లైబ్రరీస్ ఫైనాన్స్ ఆఫీసర్, ఎస్‌ఎస్‌ఎ చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్, డిఎస్‌ఇ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి డెప్యూటీ సెక్రటరీ స్కూల్స్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆయన శాఖ అధికారులే. తన పాత కేసులు ఏళ్ల తరబడి నడిచి, ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించిన శాఖకు తానే మంత్రి అయితే ఎలా ఉంటుంది? పాత కేసులు పరిష్కరించుకునే శాఖను దక్కించుకున్న అవకాశం, అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. మంత్రి పదవి వచ్చే వరకూ ప్రత్యూష అసోసియేట్స్
షిప్పింగ్ కంపెనీలో గంటా భాగస్వామి. పదవి వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. అప్పట్లో అంటే 2010లో విశాఖ జగదాంబ సెంటర్‌లోని జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన ఒకటిన్నర ఎకరాల స్థలంలో 100 కోట్ల విలువైన సంస్థను, డెవలప్ చేసే పనిని ప్రత్యూష కంపెనీ చేజిక్కించుకుంది. నిబంధనల ప్రకారం బీఓటీ పద్ధతిలో కమర్షియల్ కాంప్లెక్స్, గ్రంథాలయ సంస్థ కార్యాలయాన్ని 36 నెలల్లో నిర్మించి తీరాలి. ఆ నిబంధనను అందులోనే స్పష్టంగా పేర్కొన్నారు. కంపెనీ నిర్మించే కమర్షియల్ కాంప్లెక్స్‌లో మొదటి ఫ్లోర్ లైబ్రరీకయితే, మిగిలిన అన్ని ఫోర్లనుంచి వచ్చే ఆదాయం అంతా మంత్రిగారి కంపెనీకే చెందుతుంది. బీఓటీలో ఆ నిబంధన పెట్టారు.
నిజానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు బిఒటి పద్దతి పాటిస్తుంటుంది. కానీ విశాఖ జిల్లా గ్రంధాలయ సంస్థకు పుష్కలంగా నిధులు ఉండటంతోపాటు, తానే సొంతంగా భవనం నిర్మించుకునే ఆర్ధిక స్థోమత కూడా ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ఆ విధానంలో గంటా కంపెనీకి కేటాయించారు. గంటా గారి నాటి కంపెనీ గడువులోగా పూర్తి చేయలేదు. దానితో నిబంధనలో పేర్కొన్న ప్రకారంగా, సర్కారు ఆ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసింది. అంతకుముందు దీనిపై లోక్‌సత్తా ఏపి రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ నేతృత్వంలో నాడు భారీ ఉద్యమం నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యానే ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిజానికి అప్పటికి జిల్లా గ్రంథాలయ సంస్థకు 22 కోట్ల నగదుతోపాటు, విశాఖ కార్పొరేషన్ నుంచి సెస్ కింద మరో 10 కోట్లు రావలసి ఉంది. అందువల్ల స్థలాన్ని బీఓటీ కింద ఇవ్వాల్సిన పని లేదని, బీఓటీ ఒప్పందాన్ని రద్దు చేయాలని నాటి లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ అసెంబ్లీలో పట్టుబట్టారు. దానికి స్పందించిన నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుత మంత్రి, గంటాతో వైరం ఉన్న అయ్యన్నపాత్రుడు కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ భూమిని బీఓటీకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటని మీడియా సమక్షంలోనే ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ స్థలంలో ప్రభుత్వం ఫెన్సింగ్ వేసి, మిలటరీ రెజిమెంట్ వాహనాలకు కేటాయించింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల తనకు 3 కోట్లు నష్టం వాటిల్లినందున, గ్రంథాలయ సంస్థ నుంచి దానిని తనకు ఇప్పించాలని మంత్రి గారి కంపెనీ కోర్టుకు వెళ్లింది. ఆ కేసు ఇంకా నడుస్తోంది. అయితే, గంటా ఇప్పుడు ఆ శాఖకే మంత్రి అయినందున మళ్లీ లీజు పరిహారం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని తేల్చి వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందుకోసం వేసిన కమిటీలో ఐదుగురు అధికారుల్లో ముగ్గురు గంటా శాఖకు సంబంధించిన వారే కావడం విమర్శలకు తావిస్తోంది. వడ్డీతో కలిపి 8 కోట్ల నష్టపరిహారం కావాలంటున్న మంత్రిగారి కంపెనీపై ప్రజాసంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏం పని చేశారని అన్ని కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి.
అప్పుడు గంటా
ఎమ్మెల్యేనే: బాబ్జీ
గ్రంథాలయ సంస్థను బీఓటీ కింద తీసుకునే సమయంలో జరిగిన ఒప్పందాలపై నాటి ఎమ్మెల్యే గంటా సంతకం కూడా ఉందని, ఆ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని భీశెట్టి బాబ్జీ ఆంధ్రభూమికి చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారన్నారు. తాము దీనిపై లోకాయుక్త వరకూ వెళ్లామని, తాము ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్టు స్వయంగా ప్రభుత్వమే లోకాయుక్తకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు వేసిన కమిటీలోని సభ్యులకు గంటా కంపెనీకి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చే ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజాసంఘాలు కోర్టుకు వెళతాయనే భయంతోనే వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలంటున్నారని విమర్శించారు. తాము దీనిపై సీఎంకు లేఖ రాస్తామని, అక్కడి నుంచి ప్రతిస్పందన బట్టి తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

చిత్రం.. మంత్రి గంటా శ్రీనివాస్‌