రాష్ట్రీయం

పద్దుకు పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ బడ్జెట్ అంచనాలు తల్లకిందులు
అర్ధవార్షికానికే రూ.12 వేల కోట్ల నష్టం
వచ్చే బడ్జెట్ 1.15 లక్షల కోట్లు దాటడం కష్టమే
అభివృద్ధి, సంక్షేమానికి గడ్డు పరిస్థితి
పెద్ద నోట్ల రద్దుతో ఖజానాకు దెబ్బ

హైదరాబాద్, నవంబర్ 11: దేశంలోనే ధనిక రాష్ట్రంగా ప్రగతి సాధించేందుకు తెలంగాణ వేసుకున్న అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. 2024 నాటికి ఐదు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించాలన్న ముందస్తు వ్యూహాలు ఒక్కదెబ్బకు ఆవిరైపోయాయన్న ఆందోళన కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐఏఎస్‌ల కాన్ఫరెన్స్‌లో సిఎం కెసిఆర్ ప్రతిపాదించిన ప్రణాళికకు, ప్రస్తుత పరిస్థితికీ పొంతన కుదిరే పరిస్థితి కనిపించటం లేదు. ‘రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులు 2018నాటికి పూర్తవుతాయి. వీటికోసం ఏటా బడ్జెట్‌లో కేటాయించే రూ.25 వేల కోట్లు ఆదా అయితే, ఆ తర్వాత ఈ నిధులను అభివృద్ధి, సంక్షేమానికి మళ్లించవచ్చు. రాష్ట్ర ఆదాయ పురోగతి ఇలాగే కొనసాగితే 2018 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు, 2024 నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అప్పుడు దేశంలోనే తెలంగాణ అత్యధిక ధనిక రాష్ట్రంగా మారుతుంది. అప్పడు ఇక భారీ పెట్టుబడులంటూ ఉండవు కనుక, పేదరికంపై యుద్ధం చేయవచ్చు’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు సీనియర్ ఐఏఎస్‌లతో సమావేశమైనప్పుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ఆదాయంపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపబోతుంది. రాష్ట్ర సొంత ఆదాయంపై నెలకు రూ.1000 కోట్లు, కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే వాటాపై దాదాపు రూ.1000 కోట్లు తగ్గితే నెలకు రూ.2000 కోట్ల చొప్పున ఏడాదికి రూ.24 వేల కోట్లు తగ్గుతుందని గవర్నర్‌తో భేటీ సందర్భంగా సిఎం వెల్లడించారు. ఈ లెక్కన సెప్టెంబర్ మాసాంతానికి ముగిసిన అర్థవార్షికంలో కనిపించిన ఆదాయ పురోగతి, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఐదు నెలలపై చూపితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే రూ.10 వేల నుంచి 12 వేల కోట్లకు తగ్గుతుంది. దీనివల్ల 2016-17 బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించిన ఆదాయ రాబడి రూ.1,04,849లో రూ.12 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో వచ్చే బడ్జెట్‌నాటికి ఆదాయ రాబడి వాస్తవిక అంచనాకంటే రూ.12 వేల కోట్లు తగ్గితే 2016-17లోని బడ్జెట్ అంచనా రూ.1,30,416 కోట్ల నుంచి రూ.1,13,000 కోట్లకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు లెక్కలేస్తున్నారు. దీంతో వచ్చే బడ్జెట్ రూ.లక్ష 15 వేల కోట్లకు మించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన బడ్జెట్ కాగా అప్పుడు వాస్తవిక బడ్జెట్ రూ.1,00,062 కోట్లకు చేరుకున్న ఫలితం వచ్చే బడ్జెట్ 2017-18 ప్రతిపాదనల నాటికి పునరావృతమయ్యే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇలాఉండగా సెప్టెంబర్ అర్ధవార్షికానికి బడ్జెట్‌లో వేసిన అంచనాల కంటే ఆదాయం గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో 28శాతం, ఎక్సైజు శాఖలో 16శాతం, వాణిజ్య పన్నుల శాఖలో 21శాతం ఆదాయ వృద్ధి కనిపించింది. దీంతో మిగిలిన అర్ధవార్షికం వరకు ఇలాగే ఆదాయ వృద్ధి కనిపిస్తే వచ్చే బడ్జెట్ రూ. లక్ష 30 వేల కోట్ల నుంచి రూ.లక్ష 60 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంబంధిత మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రధానమైన ఆదాయ వనరులుగా ఉన్న రియల్ ఏస్టేట్ రంగం, వాణిజ్య పన్నులు, ఎక్సైజు శాఖల నుంచి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. దీంతో వచ్చే ఏడాది నుంచి పెద్దఎత్తున ప్రారంభం కావాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంపైనా, ఏటా బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులపైనా, పంట రుణ మాఫీకి వచ్చే బడ్జెట్‌లో కేటాయించాల్సిన నాల్గవ విడత వాయిదా రూ.4000 కోట్ల పైనా, అలాగే సంక్షేమ పథకాలపై ఏటా ఖర్చు చేస్తున్న రూ.28,000 కోట్లపైనా, విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్‌కు చెల్లించాల్సిన దాదాపు రూ.3000 కోట్లపైనా, వివిధ పెన్షన్ల కోసం చెల్లిస్తున్న రూ.3500 కోట్లపైనా ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు విశే్లషిస్తున్నారు.