ఆంధ్రప్రదేశ్‌

ఖాతాదారులకు నల్లకుబేరుల ఎర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 11: నల్లకుబేరులు తమ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు అన్ని అడ్డదారులను తొక్కుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తిన వారు తమ నగదును డిపాజిట్‌లు చేసేందుకు బ్యాంకు ఖాతాలు ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆశ్రయిస్తూ వారి ఖాతాల్లోకి నగదును డిపాజిట్ చేస్తున్నారు. ఆ విధంగా చేసిన వారికి లక్ష రూపాయలకు పదినుండి 20వేల రూపాయల వరకు ముట్టచెప్పేపనిలో నిమగ్నమయ్యారు. దీంతో బ్యాంకు, పోస్టల్ శాఖలో ఖాతాలున్న వారికి భారీ డిమాండ్ పెరిగింది. ఇలా ప్రకాశం జిల్లాలో ఖాతాలు ఉన్నవారి చుట్టూ బడా బాబులు పరుగులు పెడుతుండటంతో నల్లధనం కుప్పలుతెప్పలుగా బ్యాంకుల్లోకి వచ్చి అధికారికంగా చేరిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఖాతాలోకి రెండున్నర లక్షల రూపాయల వరకు వేసుకోవచ్చునని ఆదేశాలు జారీ చేయటంతో కొంతమంది నల్ల కుబేరులకు వెసులుబాటు వచ్చింది. ఇదిలాఉండగా గ్రానైట్‌క్వారీ యజమానులు, బడా వ్యాపారులు కొంతమంది ఏకంగా కార్మికుల ఖాతాల్లోకి నగదును డిపాజిట్ చేస్తున్నారు. ఆ విధంగా చేసిన కార్మికులకు యజమానులు కొంత నగదును ముట్టచెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. కొంతమంది బడాబాబులు అయితే తక్కువ వడ్డీకి కావాల్సిన వారికి నగదును ఇస్తున్నారు. మొత్తంమీద బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి మంచి ఆఫర్లు వచ్చిపడుతుండటంతో వారు సంతోషిస్తున్నారు. రానున్న రోజుల్లో వీరికి మరింతగా గిరాకీ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదిలాఉండగా కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూములు, గొర్రెలు వంటి వాటిని అమ్మిన వారు వచ్చిన డబ్బును బ్యాంకుల్లో వేసుకోకపోవడంతో ఇప్పుడు అవస్థలు పడుతున్నారు.

మద్యంపై మహోద్యమం

బిజెపి ఆధ్వర్యంలో కమిటీ గ్రామగ్రామాన నిరసనలు
దీక్ష ప్రారంభించిన ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్న మద్యంపై భారతీయ జనతా పార్టీ మహోద్యమాన్ని చేపట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిరసిస్తూ పార్టీ జాతీయ నాయకుడు ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు శుక్రవారం నాడు పార్టీ కార్యాలయం వద్ద 24 గంటల నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులు , శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మద్యం అమ్మకాలను పెంచిన ఎక్సైజ్ కమిషనర్‌ను ప్రభుత్వం అభినందించడం దారుణమని, సంక్షేమ కార్యక్రమాలో మరొకటో బాగా చేశారని అభినందించాల్సిన ముఖ్యమంత్రి అమ్మకాలు పెంచినందుకు అభినందించడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఎంత ఆసక్తి ఉందో అర్ధం అవుతోందని అన్నారు. ఉరకలెత్తే ఉత్సాహంతో అబ్కారీ శాఖ తెలంగాణ అంతటా బార్లు రాత్రి 12 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతులు మంజూరు చేసిందని, ఫుల్లుగా తాగి కార్లు తిప్పుతూ ప్రమాదాలు చేస్తున్నారని, మద్యం అమ్మకాలతోనూ, మరో పక్క మద్యం తాగారనే పేరుతోనూ ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోందని పేర్కొన్నారు. విశ్వనగరంలో 30వేల మంది 17-23 ఏళ్ల వయస్కులు కాలేజీలు, స్కూళ్లు ఎగ్గొట్టి బార్లలో గడుపుతున్నారని సర్వేలు చెబుతున్నాయని, ప్రతి పండగకు బార్ల అమ్మకాలు రెట్టింపు అవుతున్నాయని ఇది ముఖ్యమంత్రిని సంతోషపరుస్తోందని పేర్కొన్నారు. బడుగువర్గాల ఆదాయం అంతా బార్లకే పోతోందని, తాగుడును నియంత్రించకపోతే భారత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఒక సంస్థ పేర్కొందని అన్నారు.
మితిమీరిపోతున్న తాగుడు, పనిగంటలు, పనిదినాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి అన్నారు. మద్యం పూర్తిగా నిషేధించలేకున్నా, నియంత్రణ చేయాలని సూచించారు. కేవలం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు మాత్రమే బార్లకు అనుమతి ఇవ్వాలని సూచించారు. రోజంతా బార్లు, బెల్టుషాపులు తెరచి ఉంచడంతో గ్రామాల్లో పనులు పోకుండా ఇంట్లోనే ఉండిపోయే వారి సంఖ్య పెరుగుతోందని ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. తాగుబోతులకు భయంకర వ్యాధులు, అకాల మరణాలు సంభవిస్తున్నాయని, మహిళల రోధన, ఆర్తనాదాలు ప్రభుత్వానికి పట్టడంలేదని ఆరోపించారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావుమాట్లాడుతూ మద్య నియంత్రణను ప్రభుత్వం వెంటనే చేపట్టి పేద ప్రజలను కాపాడాలని కోరారు. ఎక్సైజ్ ఆదాయం ఆర్ధిక వనరనే దుర్మార్గపు ఆలోచన నుండి ప్రభుత్వం బయటకు రావాలని, మహిళల జీవితాలు చిద్రం కావడం వల్ల వచ్చే ఆదాయం మీద ఆధారపడటాన్ని మించిన నీఛత్వం మరొకటి లేదని, ఏ సమాజంలో తల్లులు, ఆడపడుచులు కన్నీరు పెడతారో ఆ సమాజానికి ప్రగతి ఉండదని ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు వ్యాఖ్యానించారు. ఈ భయంకర సమస్యపై సమాజాన్ని తట్టిలేపడానికి, విచ్చలవిడిగా పెరిగిపోతున్న మద్యపానాన్ని నియంత్రించడానికే తాను నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ప్రొఫెసర్ లక్ష్మి భర్త
వివరాలు తెలపండి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 11: పరారీలో ఉన్న గుంటూరు వైద్యకళాశాల ప్రొఫెసర్ లక్ష్మి భర్త డాక్టర్ విజయసారథికి సంబంధించిన వివరాలు తెలపాలని గుంటూరు వైద్య కళాశాల అధికారులకు వైద్య విద్య సంచాలకుడు (డిఎంఇ) లేఖ రాశారు. పోస్టు గ్రాడ్యుయేట్ మెడికో సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడం తెలిసిందే. ఆమె కోసం ఏడు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఆమె తన సెలవును పొడిగిస్తూ లేఖ రాయడంపై డిఎంఇ స్పందిస్తూ ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేశామని, అందువల్ల సెలవు పొడిగింపు అన్న ప్రశ్న ఉత్పన్నమవదని తెలిపారు. ఆమె భర్త డాక్టర్ విజయసారథికి సంబంధించి సెలవు తదితర వివరాలు కూడా పంపాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాసినట్లు డిఎంఇ డాక్టర్ ఎన్.సుబ్బారావు తెలిపారు. ఈ విషయమై గుంటూరు వైద్య కళాశాల అధికారులు మాట్లాడుతూ అక్టోబర్ 4 నుంచి విజయసారథి సెలవులో ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేనికి విజయసారథి స్నేహితుడు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన స్నేహితుడు కాదని మంత్రి స్పష్టం చేస్తున్నారు.

తుని కాపుల ఉద్యమం
విధ్వంసంపై హైకోర్టులో పిల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 11 గత ఏడాది తునిలో కాపునాడు ఉద్యమం సందర్భంగా తునిలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కేసుపై విచారణ జరిపించి నష్టాన్ని వసూలు చేయాలని కోరుతూ హైకోర్టులో శుక్రవారం పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను రాజమండ్రికి చెందిన మేడా శ్రీనివాస్ దాఖలు చేశారు. ఈ కేసులో కాపునాడు నేత ముద్రగడ పద్మనాభంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారని, వీరిపై హింస, లూటీలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ విధ్వంసానికి కారణమైన ముద్రగడ పద్మనాభంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. హింస జరుగుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభం అక్కడే ఉన్నారన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి సత్యాగ్రహం కార్యక్రమం చేపడుతున్నాన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమం వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. ప్రజా ఆస్తుల విధ్వంసం కేసులో బాధ్యులైన వ్యక్తుల నుంచి నష్టపరిహారం వసూలు చేయాలని సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనపడడంలేదని పిటిషనర్ పేర్కొన్నారు.