రాష్ట్రీయం

నగరంలో ‘కొత్త’ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, డిసెంబర్ 30: నగరంలో 2015కు వీడ్కోలు పలికి, న్యూ ఇయర్ 2016కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా నగరం సందడిగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించేందుకు వివిధ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాలకు చెందిన సంస్థలు తగిన ఏర్పాట్లతో సిద్ధమవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు గ్రీటింగ్ కార్డుల కొనుగోలు, కొత్త దుస్తుల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున వచ్చిన జనంతో నగరంలో ఎక్కడ చూసినా సందడిగా కనిపించింది. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున కేక్‌లు, స్వీట్‌లు అమ్మేందుకు బేకరి, స్వీట్ దుకాణదారులు ప్రత్యేక ఆఫర్‌లతో తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. దుస్తులు, చెప్పుల షాపులు, ఇతర గృహోపకరణాలు విక్రయదారులు కూడా నూతన సంవత్సరం పేరుతో ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక వంటకాలతో ప్యామిలీ ప్యాకేజిని ప్రకటించాయి. బొకేల తయారీదారులు బొకేలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నగరంలోని చర్చిల్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి.
అట్టహాసంగా పామిశెట్టి ప్రమాణ స్వీకారం
* హాజరైన బాలయ్య, ఎంపి నిమ్మల
హిందూపురం, డిసెంబర్ 30 : బిసి కార్పొరేషన్ చైర్మన్‌గా పామిశెట్టి రంగనాయకులు బుధవారం ఉదయం 10.54 గంటలకు హైదరాబాద్‌లోని సంబంధిత సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో అట్టహాసంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా రంగనాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరై ఆకర్షించారు. టిడిపి ఆవిర్భావం నుంచి రంగనాయకులు పార్టీ కి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిసి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారంటూ బాలయ్య ప్రశంసించారు. రంగనాయకులు మాట్లాడుతూ 1982లో దివంగత ఎన్టీ రామారావు ఆశీస్సులతో తాను తెలుగుదేశం పార్టీలోకి చేరగా 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆప్కో చైర్మన్ పదవిని కూడా ఎన్టీఆర్ కట్టబెట్టారన్నారు. అందుకే ఆయన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం 2004లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, ప్రస్తుతం బిసి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వగా జీవిత కాలం రుణపడి ఉంటానన్నారు. ఇక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారాన్ని ఎన్నటికీ మరచిపోలేనని హర్షధ్వానాల నడుమ పేర్కొన్నారు. అనంతరం హిందూపురం నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు రంగనాయకులును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి నిమ్మల కిష్టప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, బుడ్డా వెంకన్న, బిసి కార్పొరేషన్ ఎండి హర్షవర్ధన్, బిసి వెల్ఫేర్ కమిషనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ట్యాంకర్ల నిర్వహణపై తర్జనభర్జన!
* యజమానుల్లో అయోమయం
* ‘పురం’లో వేసవి పరిస్థితేంటో...
హిందూపురం టౌన్, డిసెంబర్ 30 : హిందూపురం మున్సిపాలిటీలో ప్రైవేటు నీటి ట్యాంకర్ల నిర్వహణపై అటు అధికారులు... ఇటు ప్రజాప్రతినిధులు తీవ్ర తర్జనభర్జనకు గురవుతున్నారు. ప్రభుత్వం గత ఏడాది పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని కరవు నివారణ పథకం కింద రూ.4.68 కోట్ల నిధులను నీటి సరఫరా కోసం మంజూరు చేసింది. ఈ నిధులను మున్సిపాలిటీలో ఉన్న బోర్లు, మోటార్ల మరమ్మతులతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు వెచ్చించాల్సి ఉంది. దీంతో పలువురు ట్యాంకర్ల యజమానులు నీటి ట్యాంకర్లను మున్సిపాలిటీకి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అన్ని ఖర్చులు కలిపి రూ.300కు ఒక్కో ట్యాంకర్‌ను వార్డుల్లో అందిస్తామని తెలియచేయడంతో ఆ ప్రతిపాదనను కౌన్సిల్‌లో సైతం ఆమోదించి అనుమతి కోసం కలెక్టర్‌కు పంపారు. కలెక్టర్ సైతం ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయడంతో నీటి సమస్య ఉన్న, పిఏబిఆర్ పైపులైన్లు లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల యజమానులతోపాటు కొందరు అధికార పార్టీ మున్సిపల్ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ టిడిపి నాయకుడు భాస్కర్ అన్ని ఖర్చులతో కలిపి రూ.168కే నీటి ట్యాంకర్‌ను అందిస్తానని, మున్సిపాలిటీకి అవసరమైన మేరకు ఎన్ని ట్యాంకర్లు అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని మున్సిపల్ కమిషనర్‌కు ఇటీవల లిఖిత పూర్వకంగా అందించారు. దీన్ని కౌన్సిల్‌లో ఆమోదించి అనుమతి కోసం కలెక్టర్‌కు పంపాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఎవరైతే తక్కువ ధరకు నీటిని అందిస్తారో వారికే ప్రాధాన్యత కల్పించాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు రూ.300లతో నీటి ట్యాంకర్లను నిర్వహిస్తున్న యజమానులు అయోమయానికి గురవుతున్నారు. కాగా గతంలో రూ.300తో కోడ్ చేసిన వ్యక్తి బంధువు ఒకరు రూ.168కే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు అధికార పార్టీ నాయకుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో రూ.168కే నీటి ట్యాంకర్లను అందించినా వేసవి కాలంలో పరిస్థితి ఏంటన్న దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. పిఏబిఆర్ నుంచి అంతంత మాత్రంగా నీరు వస్తుండటం, వేసవిలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రూ.168కే నీటి ట్యాంకర్లను వేసవిలో ఎలా నిర్వహిస్తారు ప్రస్తుతం వారికి నీటి సరఫరాను అప్పగిస్తే సక్రమంగా జరగకపోతే పరిస్థితి ఏంటి అన్న విషయమై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు రూ.300తో నీటిని అందించిన వ్యక్తే రూ.168కే అందిస్తానని ముందుకు రావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కొందరు తెర వెనుక ఉంచి ఇలా తక్కువ ధరలతో ట్యాంకర్లను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం రూ.168కే ట్యాంకర్లను తీసుకోవడం పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
నేడు కౌన్సిల్ సమావేశం
హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం 11.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎవివి భద్రరావు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశానికి కౌన్సిలర్లతోపాటు అన్ని విభాగాల అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.
చల్లా సోదరుల ఔదార్యం...
* ఒక్కటైన 90 జంటలు * వధూవరులను ఆశీర్వదించిన ఆర్‌జె.రత్నాకర్
పుట్టపర్తి, డిసెంబర్ 30: పేదరికంతో పెళ్ళీడు వచ్చిన పిల్లలకు వివాహాన్ని చేయలేని వారి ఇంట చల్లా సోదరుల ఔదార్యంతో పెళ్లి సంబరం ఘనంగా జరిగింది. బుధవారం పుట్టపర్తి పర్తిసాయి ధర్మశాలలో 90 జంటలకు భారీ సామూహిక వివాహాల వేదికయ్యింది. పుట్టపర్తికి చెందిన ప్రముఖులు దివంగత చల్లా రామారావు, సీతమ్మ కుమారులు చల్లా భీమరాజు, చల్లా సాయికృష్ణ(కిట్టు), చల్లా విజయసాయిలు లండన్ దేశానికి చెందిన అ జిత్ పపాట్ దంపతులు, సాయి భ క్తుల సహకారంతో సామూహిక వివాహాలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ఆర్‌డిఓ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న, డిఎస్‌పి ముక్కా శివరామిరెడ్డి, స్నేహలత నర్శింగ్ హోం అధినేత మల్లికార్జునరెడ్డి, పలువురు ప్రముఖులు వివాహ మహోత్సవాలకు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. ఆకాశమంత పందిళ్ళు వేసి, భూలోకమంత తివాచీలు పరిచి సత్యసాయిని ప్రార్థిస్తూ వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ సత్యసాయి సన్నిధి పుట్టపర్తిలో జరిగిన ఈ వివాహ వేడుకల మహోత్సవం అంబరాన్నంటింది. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్టు సభ్యుడు ఆర్‌జె.రత్నాకర్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా స్ఫూర్తితో సాయి భక్తులు నిర్వహించిన ఈ వివాహ వేడుకలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. వధూ వరులకు చల్లా సోదరులు, సాయి భక్తులు పట్టు వస్త్రాలు, మంగళసూత్రం, సత్యసాయి చిత్రపటం, కలశం, గృహోపకరణలు, సామాగ్రిని వారు వధూ వరులకు అందజేశారు. ఆర్‌జె.రత్నాకర్, ఆర్‌డిఓ రాజశేఖర్, డిఎస్‌పి శివరామిరెడ్డి, అజిత్ పపాట్ దంపతులు, కిట్టు, భీమరాజు, విదేశీయుల చేతుల మీదుగా వధూవరులకు గృహోపకరణలు, సామాగ్రిని అందజేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వేలాదిగా వధూ వరుల కుటుంబ సభ్యులు, బంధువులు, సాయిభక్తులు పాల్గొని విందు భోజనాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో చల్లా కుటుంబ సభ్యులు భోపాల్, లక్ష్మి, రామ్, లక్ష్మణ్, పుడా విసి రామాంజనేయులు, డాక్టర్ గోపాల్‌రెడ్డి, బెంగళూరుకు చెందిన శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, ఆర్‌ఐ కళ్యాణ్, మంగళకర ట్రస్టీ కేరళ ప్రకాష్, దేశం నాయకులు శ్రీరామిరెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం రేంజ్ పోలీసుల పనితీరు భేష్
* ఎర్రచందనం, నకిలీ పాసు పుస్తకాలకు కళ్లెం
* ఫ్యాక్షన్‌పై ప్రత్యేక నిఘా
* రేంజ్ డిఐజి సత్యనారాయణ
అనంతపురం సిటీ, డిసెంబర్ 30: అనంతపురం రేంజ్ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు 2015 సంవత్సరంలో ప్రశాంతంగా జీవించేలా రేంజ్ పోలీసు యంత్రాంగం గట్టి కృషి చేశారని అనంతపురం రేంజ్ డిఐజి కె.సత్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో అనంతపురం రేంజ్ డిఐజి, ఎఎస్పీ కె.మాల్యాద్రితో కలసి విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేంజ్ పరిధిలో టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటుచేసి అందుకనుగుణంగా స్పెషల్ పార్టీలు, ఎపిఎస్‌పి బలగాలు సహకారంతో ఎర్రచందనం దొంగలు, వారి అక్రమ రవాణాలపై నిఘూ వేశారన్నారు. ఎర్రచందనం దొంగలను పట్టడంలో రేంజ్ పోలీసులు ఈ సంవత్సరం మెరుగైన పనితీరు కనబరచారన్నారు. అక్రమ రవాణాలో 213 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు 1199 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. నమోదు చేసిన 247 కేసుల్లో 9.85 కోట్లు విలువ చేసే 3878 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రేంజ్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఫ్యాక్షన్‌పై ప్రత్యేక నిఘూ పెట్టడడంతో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించారన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంలో జిల్లా పోలీసులు చాకచక్యాన్ని ప్రదర్శించి వాటిపై ప్రత్యేక నిఘూతో నిందితులను అరెస్టు చేశారన్నారు. రేంజ్ పరిధిలో సామాన్య, మధ్యతరగతి ప్రజల నుండి అధిక వడ్డీదారులపై 23 కేసులను నమోదు చేసిన 25 మందిని అరెస్టు చేశామని తెలిపారు. తిరుపతిలోని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేంజ్ పరిధిలో షీ టీమ్స్ పోలీసులు పనిచేస్తున్నారని, వాటితో సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 174ఎ కేసు నమోదు చేశామన్నారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు పోలీసులు ఈ కేసు నమోదు చేయడం విప్లవాత్మకమైన మార్పు అన్నారు. ఈ కేసులో నేరస్తుడు ఏదైనా కేసులో బెయిల్‌పై విడుదలయ్యి తదుపరి వాయిదాలకు రాకుండా తప్పించుకు తిరగడం, అతనికి సంబందించి ఎలాంటి ఆచూకీ వివిరాలు తెలియనపుడు ఆ నేరుస్తుడి యొక్క ఆస్తులను జప్తు చేయడం జరిగిందన్నారు. పోలీసు స్టేషన్లలో ఏళ్లతరబడి నిలిచిపోయిన వాహనాలను వేలం వేసి చట్టబద్దతను కల్పించారు. దోపిడీ, దొంగతనాల్లో 16.89 కోట్లు విలువ చేసే ఆభరణాలు, నగదు చోరీ అయ్యిందని, రేంజ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇందులో 9.76 కోట్లు విలువ చేసే ఆభరణాలను, నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా స్వాధీనం చేసుకుని, కేసులను నమోదు చేశామన్నారు. రేంజ్ పరిధిలో ఇసుక అక్రమంగా రవాణా జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రేంజ్ పరిధిలోని అన్ని ముఖ్య నగరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటుచేసి నిఘూ ఉంచామన్నారు. 2015లో రేంజ్ పరిధిలో మొత్తం 13,666 కేసులు నమోదు చేశామని తెలిపారు. 2016 సంవత్సరంలో రేంజ్ పోలీసుల లక్ష్యం ఒన్ ఆఫీసర్..ఒన్ కన్విక్షన్ అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు.
జాతీయ అథ్లెటిక్ పోటీలకు గుడిబండ విద్యార్థిని
గుడిబండ, డిసెంబర్ 30 : ఇటీవల గుంటూరులో జరిగిన ఎపి రాష్ట్ర స్థాయి పైకా అథ్లెటిక్ పోటీల్లో గుడిబండ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి చదువుతున్న గీత హైజంప్‌లో సిల్వర్ మెడల్ సాధించినట్లు హెచ్‌ఎం చాంద్‌బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యార్థిని జనవరి 10వ తేదీన గుడివాడలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
అనంతపురం సిటీ, డిసెంబర్ 30: జిల్లాలో అక్రమంగా తరలింపు, నిత్యావసర వస్తువులు, పన్నుల ఎగవేతలాంటి వాటిపై ప్రత్యేక నిఘూ ఉంచి మంచి ఫలితాలు సాధించామని ప్రాంతీయ నిఘూ మరియు అమలు అధికారి అనిల్‌బాబు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా విజిలెన్స్ కార్యాలయంలో 2015 సంవత్సరంలో జరిగిన అమలుతీరుపై విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ రకాల ఎగవేతకు గురైన పన్నులను వాణిజ్య పన్నుల విభాగంలో 8456.73 లక్షలు, డెవలప్‌మెంట్ విభాగంలో 6065.26 లక్షలు, సహజ వనరుల విభాగంలో 611.31 రికవరీ చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 501 వాహనాలను తనిఖీ చేశామని, వాటి ద్వారా గ్రానైట్ వాహనాలు 142 లక్షలు, పరిశ్రమల తనిఖీ ద్వారా 225 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిత్యావసర వస్తువుల తనిఖీలో మొత్తం 111 చేయగా 529.92 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తనిఖీలు చేయవలసిన సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులను మరింత పటిష్టమైన చర్యలు తీసుకొనేందుకు, తనిఖీలు చేపట్టేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిఫారస్సు చేయడం జరిగిందన్నారు. రాయలచెరువు ప్రాంతంలో ఖనిజ అక్రమ రవాణా అరికట్టుటకు చెక్‌పోస్టు ఏర్పాటు చేయుటకు ప్రయత్నాలు జరుగుచున్నవన్నారు. అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాలో రోడ్ల మీద ఎంక్వయిరీ తుది దశలో ఉందని, ఇంజినీరింగ్ విభాగంలో హెచ్‌ఎల్‌ఎంసి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువల మీద ఎంక్వయిరీ చేసి నాణ్యతా లోపాల మీద, అనవసర ఖర్చుల మీద ప్రభుత్వానికి నివేదికలను పంపడమైందన్నారు.
భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం?
హిందూపురం, డిసెంబర్ 30 : చిలమత్తూరు మండల పరిధిలోని లాలేపల్లి క్రాస్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆంధ్రా, కర్నాటక పోలీసులు సంయుక్తంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బెంగళూరు నుండి వెళ్తున్న ఓ వాహనాన్ని లాలేపల్లి క్రాస్ వద్ద పోలీసులు వెంబడించి తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు ఒకటిన్నర కిలో పరిమాణం కలిగిన మత్తు పదార్థాలను గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ సమాచారంపై పెనుకొండ డిఎస్పీ సుబ్బారావును అడగ్గా ఇప్పటి వరకు తనకు సమాచారం లేదని, అలా ఉంటే తప్పకుండా తన దృష్టికి వచ్చేదని చెప్పారు. కాగా స్థానికులు కొందరు పోలీసుల తనిఖీని చూసి బయటకు సమాచారం అందించారు. కర్నాటక చిక్కబళ్లాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు సమాచారం.

బలవంతపు భూసేకరణ ఆపాలి
* వామపక్ష పార్టీల నాయకులు
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 30: రాష్ట్రంలో ప్రభుత్వం బలవంతంగా చేపట్టిన భూ సేకరణను ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని వికె భవన్‌లో బుధవారం భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇందులో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఇతర వామపక్షాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని, విద్యుత్ ప్లాంట్‌లు, పారిశ్రామిక కారిడార్‌లు, పోర్టులు, విమానాశ్రయాలు, టూరిజం పేరుతో 13 లక్షల ఎకరాల భూమిని బలవంతంగా సేకరించి భూ బ్యాంక్ ఏర్పాటుకు పూనుకున్నదన్నారు. భూ బ్యాంక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూ సేకరణకు గ్రామసభ ఆమోదం పొందాలని, సేకరించిన భూములకు పట్టా భూములతో సమానంగా బంజరు, అసైన్డ్ భూముల సాగుదారులకు పరిహారం చెల్లించాలన్నారు. నష్టపరిహారం చెల్లించకుండా నిర్మాణాలు చేపట్టరాదన్నారు. పరిశ్రమలకు ఎంత భూమి అవసరమో ప్రకటించి, సేకరించాలన్నారు. భూ సేకరణ చట్టం 2013ను అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ అధ్యక్ష వర్గం శివన్న, వెంకటరెడ్డి, రంగయ్య, పెద్దన్న, నాయకులు కేశవరెడ్డి, కాటమయ్య, పెద్దిరెడ్డి, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.
సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
* ప్రిన్సిపాల్ వేధింపులే కారణమంటూ విద్యార్థి సంఘాల ఆరోపణ
కదిరి, డిసెంబర్ 30: పట్టణ ంలోని నారాయణ విద్యాసంస్థలో సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి కారణం కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందే అంటూ బుధవారం విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థ ముందు ధర్నా నిర్వహించారు. వీరికి సిపిఎం, సిపిఐ నేతలు మద్దతు తెలిపారు. పట్టణానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు కుమార్తె నారాయణ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. పదవ తరగతి వరకు తెలుగు మీడియం నందు చదివిన సదరు విద్యార్థిని ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం కావడంతో తోటి విద్యార్థులకన్నా తక్కువ మార్కులు వస్తున్నాయని వాపోయేది. ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పగా మార్కులతో పని లేదు చదువుకుంటే చాలంటూ సర్ది చెప్పి కళాశాలకు పంపారు. అయితే ప్రిన్సిపాల్ సైతం మార్కుల విషయంలో విద్యార్థినిని తరగతిలో అందరి ముందు హేలనగా మాట్లాడి, దండించడం జరుగుతూ వచ్చింది. దీంతో విరక్తి చెందిన విద్యార్థిని ఇంటి వద్దే ఉండి చదువుకొని పరీక్షలు రాస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి దగ్గరే ఉంటోంది. కాని ఇంతలో కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు విద్యార్థిని ఇంటి వద్దకు వచ్చి కళాశాలకు ఎందుకు రాలేదంటూ అడగడం జరిగిందని తెలిపారు. అందుకు సదరు ప్రిన్సిపాల్ విద్యార్థిని తండ్రితో ఒక లేఖ రాయించుకొని అంటే విద్యార్థిని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తమకు సంబంధం లేదని, అందుకు తల్లిదండ్రులదే బాధ్యత అంటూ లెటర్ తీసుకొని మరల కళాశాలకు పంపండి అంటూ పలుమార్లు ఇంటి వద్దకు వచ్చేవాడు. ఈ విషయంలో మరోసారి ఆలోచించి అమ్మాయిని కళాశాలకు పంపడం జరిగింది. కాని ప్రిన్సిపాల్ తన పద్ధతి మార్చుకోక తిరిగి అదేవిధంగా అవమానకరంగా మాట్లాడి, తోటి విద్యార్థుల ముందు దండించడం జీర్ణించుకోలేని అమ్మా యి తల్లిదండ్రులకు తెలియచేయక వారి పెదనాన్న ఇంటికి వెళ్లింది. అక్కడ వేరుశెనగ విత్తనాలు శుద్ధి చేసే లిక్విడ్ మందును తీసుకొని వచ్చి తాగి అపస్మారక స్థితిలో వుండగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఎస్‌ఎఫ్‌ఐ నుంచి కుమార్ నాయుడు, వైకాపా విద్యార్థి సంఘం నుంచి రాఘవేంద్రల ఆధ్వర్యంలో నారాయణ కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వీరికి సిపిఎం నాయకులు జిఎల్ నరశింహులు, సిపిఐ నాయకులు ఇసాక్, నాగన్న తదితరులు మద్దతు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన ప్రిన్సిపాల్, సిబ్బందిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్ సిబ్బందితో సహా వచ్చి బాధితురాలు తల్లిదండ్రులు ఏదైనా ఫిర్యాదు చేస్తే నారాయణ విద్యాసంస్థ వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
అనుమానాస్పదంగా మహిళ మృతి
రొళ్ల, డిసెంబర్ 30 : మండల పరిధిలోని కాకి గ్రామ సమీపంలో కాలువ రంగనాథస్వామి దేవాలయం వెనుక ఉన్న పొలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు సుమారు 25 సంవత్సరాలు ఉన్న మహిళ ఎక్కడో చంపి ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని ఇక్కడ దహనం చేశారని తెలిపారు. బుధవారం రాత్రి అటుగా వెళ్లిన స్థానికులు సమాచారం అందించండంతో వెళ్లి చూడగా మహిళ శవం పూర్తిగా కాలిపోయి ఉందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మడకశిర వాసి కర్నాటకలో అనుమానాస్పద మృతి
మడకశిర, డిసెంబర్ 30 : కర్నాటక రాంనగర్ రైల్వేస్టేషన్ పరిధిలో మడకశిర పట్టణంలో నివాసం ఉంటున్న విశ్వనాథ్‌గుప్త (55) అనుమానాస్పదంగా మృతి చెందాడు. విశ్వనాథ్ నాలుగు రోజుల క్రితం పని నిమిత్తం కర్నాటకకు వెళ్లాడు. అయితే బుధవారం ఉదయం రాంనగర్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి అతని వద్ద ఉన్న గుర్తింపుకార్డు ఆధారంగా మడకశిర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా డబ్బు కోసం ఎవరైనా విశ్వనాథ్‌ను హత్య చేసి రైలు పట్టాలపై పడవేశారా లేక ప్రమాదవ శాత్తు రైలు కింద పడి మృతి చెందాడా అన్న విషయాలు తెలియరావడం లేదు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 30: మండల పరిధిలోని ఎన్ ఎస్.గేటుకు చెందిన చండ్రాయుడు కుమారుడు గౌతమ్ బుధవారం మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని వెంటనే ఆంబులెన్స్‌లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుత్తి ఎంపిపి స్కార్పియో దగ్ధం
గుత్తి, డిసెంబర్ 30 : మండల అధ్యక్షులు వీరభద్రయ్య స్కార్పియో మంగళవారం అర్ధరాత్రి దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వాహనానికి దుండుగులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టించారా, ప్రమాదవశాత్తు దగ్ధమైందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రం నుంచి ఇంటి చేరుకున్న ఎంపిపి వీరభద్రయ్య వాహనాన్ని ఇంటి ఆవరణలో నిలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వాహనం తగలబడి పోతున్నట్లు పక్కింటివాళ్లు సమాచారం అందించడంతో లేచి చూచాడు. అప్పటికే జీపు పూర్తి స్థాయిలో దగ్ధమైంది. వాహనం దగ్ధం చేసేంత శతృత్వం తనకు ఎవరితో లేదని ఎంపిపి తెలిపారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.