రాష్ట్రీయం

300 కోట్లతో సెట్‌టాప్ బాక్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 15: ఫైబర్‌నెట్‌కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో పది లక్షల కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్ (సెట్ టాప్) బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు చైనా కంపెనీలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో స్టేట్ ఫైబర్‌నెట్ వడ్డీతోపాటు, రుణ వాయిదాలను చెల్లించేలా ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమృత యూనివర్శిటీ ఏర్పాటు, రిజర్వు బ్యాంకు కార్యాలయం నిర్మాణానికి సిఆర్‌డిఏ పరిధిలోని రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపునకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే పూర్తి చేసేందుకు ఈ నెలాఖరు డెడ్‌లైన్ విధించింది. విశాఖపట్నం అర్బన్ డవలప్‌మెంట్ అథారిటి ల్యాండ్ పూలింగ్ స్కీం-2016 కింద వ్యక్తిగత భూ సమీకరణ ప్రతిపాదనలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశ్వ విద్యాలయాల చట్టం- 2007 సవరణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా రాష్టస్థ్రాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ అమలు చేయాలని, ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మంత్రులు వైస్ చైర్మన్లుగా వ్యవహరించేలా క్యాబినెట్ నిర్ణయం ప్రకటించింది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం విలేఖరులకు మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్ర జిల్లా, డివిజనల్, యుఎల్‌బి, మండల్, పంచాయితీ స్థాయిల్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయం మేరకు మిషన్‌కు చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్లుగా పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల మంత్రులు వ్యవహరిస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధంగా ప్రైవేటు కళాశాలలను గుర్తించేందుకు విశ్వవిద్యాలయాల చట్టం- 2007కు సవరణ ప్రతిపాదించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం జిల్లాలో అనావృష్టి నివారించి రైతుల ఆర్ధిక ఇబ్బందులను తొలగించేందుకు అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. లక్షా 65వేల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వారి ఆదాయాన్ని పెంచుతూ అనావృష్టి పరిస్ధితులను తట్టుకోగల శక్తిని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇక కృష్ణాజిల్లాలోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానానికి చెందిన భూమిలో 14.20 ఎకరాలను సిద్ధార్ధ అకాడమీకి లీజు ధర స్థిరీకరిస్తూ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎకరాకు లక్షన్నర చొప్పున ఏడాదికి లీజు పొడిగిస్తూ మూడేళ్ళకు ఒకసారి 5శాతం పెంపుదల నిర్ణయించారు. భారత ప్రభుత్వం లక్షా 93వేల 147 ఇళ్ళు రాష్ట్రానికి మంజూరు చేయగా వాటిలో లక్షా 20వేలకు పైగా ఇళ్ళు ఏపి హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టనుంది. సిఆర్‌డిఏ నుంచి అమృత యూనివర్శిటీకి 200 ఎకరాలు, ఆర్‌బిఐకి 11 ఎకరాలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు 28 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాలో వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలకు, భీమవరం ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు, తిరుపతి వెటర్నరీ కాలేజ్‌కి బోధన సిబ్బందిని మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 210 మంది జూనియర్ అసిస్టెంట్లను అప్‌గ్రేడ్ చేయాలని, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయానికి కేటాయించిన ఏసిటిఓలు-16, డిసిటిఓ-6 పోస్టులు, సూపరింటెండెంట్ గ్రేడ్ -1, 16 పోస్టులను సూపరింటెండెంట్ పోస్టులుగా మార్చాలని నిర్ణయించింది. కోస్తాంధ్ర ప్రాంత జైళ్ళశాఖ డిఐజి పోస్టును ఐజిగా అప్‌గ్రేడ్ చేసింది. జిల్లా అచ్యుతాపురంలోని ఏపిసెజ్‌లోని భూమిని ఎల్‌పిజి బాటిలింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు కేటాయించేలా, ఎకరాకు 40 లక్షల చొప్పున ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు మంత్రులు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా పల్స్ సర్వే పూర్తి చేయాలని, లేకుండా అధికారులపై చర్యలు తప్పవని కఠిన నిర్ణయం తీసుకుందని, అగ్రిగోల్డ్ వ్యవహారంపై సమీక్షించిన క్యాబినెట్ ఇక నుంచి ప్రతి సమావేశంలోనూ ఈ కేసుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రులు చెప్పారు.

చిత్రం.. మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుతున్న చంథ్రబాబు