రాష్ట్రీయం

పొరుగు రాష్ట్రాల కార్మికులను వెక్కిరిస్తున్న ఎటిఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు సరిపడా నగదు లభించక అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామికవాడలు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి. ఇక్కడ దాదాపు లక్షల సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్‌కు చెందిన వారు అనేక మంది ఉన్నారు. వారం వారం వేతనాలు పొందే వీరికి పరిశ్రమల యాజమాన్యాలు రద్దయిన పెద్ద నోట్లను ఇస్తున్నాయి. వీటిని మార్చుకునేందుకు వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకుల వద్ద నిలబడి రద్దయిన నోట్లను డిపాజిట్ చేయడం, ఆ తర్వాత బ్యాంకులు ఇచ్చే చిన్న నోట్లను తీసుకోవడంతోనే సమయం గడిచిపోతోంది. గత రెండు రోజులుగా బ్యాంకులు చిన్న నోట్లను ఇవ్వకపోవడంతో వీరంతా ఎటిఎంల వద్ద క్యూల్లో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఒరిస్సాకు చెందిన సాంబశివ మహాపాత్రో అనే కార్మికుడు చిన్న స్టీలు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండు వేల రూపాయల నగదును తీసుకునేందుకు నిన్నటి నుంచి ఎటిఎంల చుట్టూ తిరుగుతున్నానని, తన వంతు వచ్చే సరికి ఎటిఎంల్లో సొమ్ము అయిపోతోందని వాపోయాడు. అలాగే మరికొంత మంది కార్మికులు సొంత డబ్బులు వెచ్చించి సిటీ బస్సుల్లో తిరుగుతూ ఏ ఏటిఎంలో నగదు వస్తోందో అనే్వషిస్తున్నారు. దీంతోనే తమ పుణ్యకాలం గడిచిపోతోందని నేపాల్ నుంచి వచ్చిన నాయక్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ కార్మికుడు చెప్పాడు. చివరకు ఎటిఎంలో ఒకరికి రెండు వేల రూపాయల నగదు లభిస్తే దానినే నలుగురం పంచుకుని సంసారాలను నెట్టుకొస్తున్నామని చెప్పాడు.
కాగా, జీడిమెట్ల పారిశ్రామికవాడలో అన్ని బ్యాంకుల ఎటిఎంలు రెండు రోజుల నుంచి మూతపడ్డాయి. ఎక్కడకు వెళ్లినా క్యాష్ లేదు అనే బోర్డులు కార్మికులను వెక్కిరిస్తున్నాయి. జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్ ఏరియాల్లోనే కనీసం ఐదు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు ఎలా జరపాలో తమకు తెలియదని, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని బిహార్ నుంచి వచ్చిన సుమన్ అనే వెల్డింగ్ కార్మికుడు చెప్పాడు.
మొబైల్ క్యాష్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి
కాగా, నగదు కోసం కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే మొబైల్ ఎటిఎంలను ప్రవేశపెట్టాలని తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అధ్యక్షుడు అమ్మనబ్రోలు ప్రకాష్ కోరారు. రిటైల్ బిజినెస్ పూర్తిగా పడిపోయిందన్నారు. వస్తప్రరిశ్రమలో 80 నుంచి 82 శాతం, ఆటోమొబైల్ పరిశ్రమలో 80 శాతం, ఫర్నీచర్ పరిశ్రమలో 90 శాతం, ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ పరిశ్రమలో 58 శాతం, కిరాణ వ్యాపారం 55 శాతం, శానిటరీ, ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ వ్యాపారం 85 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం 90 శాతం నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన తెలిపారు.