రాష్ట్రీయం

అనుక్షణం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఘాకు మరింత పదునుపెట్టండి దేశం అంచుల్లో ఉగ్రవాద ముప్పు
వామపక్షవాదంతో ప్రగతికి ప్రమాదం సమూల నిర్మూలనకు ప్రణాళిక రచించాలి
బలగాలకు సాంకేతిక సామర్థ్యం పెంచాలి పోలీస్ శిక్షణలో మరింత ఒడుపు కావాలి
అప్పుడే శాంతి భద్రతలు పరిరక్షించగలం డిజిపిల సదస్సులో నరేంద్ర మోదీ పిలుపు
రోజంతా అకాడమీలో గడిపిన ప్రధాని సంస్కరణలు, సవాళ్లపై విస్తృత సమీక్ష

హైదరాబాద్, నవంబర్ 26: భారతదేశం అభివృద్ధికి ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, వ్యవస్ధీకృత నేరాలు, నల్లధనం శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వీటిని సమూలంగా నిర్మూలించే విషయంలో రాజీలేని సమర్ధ పోరాటాలకు అన్ని రాష్ట్రాల పోలీసులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముంబయిపై ఉగ్రవాదులు దాడిచేసి నేటికి తొమ్మిదేళ్లు గడిచిందని, ఉగ్రవాదుల దాడిని సమర్ధంగా తిప్పికొట్టడంలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను దేశంలోని యావత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ప్రశంసించారు. దేశంలో అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు 33 వేలమంది పోలీసులు ప్రాణాలు అర్పించారని నివాళి ప్రకటించారు. శనివారం ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమిలో 51వ జాతీయ డిజిపి, ఐజిపిల సదస్సు రెండోరోజు కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, పెద్ద నోట్ల రద్దు, నకిలీ కరెన్సీ, నల్లధనం, వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు ఉగ్రవాదం తదితర అంశాలపై మాట్లాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రాష్ట్రాల డిజిపిలు సమర్పించిన ప్రెజంటేషన్, ఐటి టెక్నాలజీ అమలు, పోలీసు సంస్కరణల్లో రావాల్సిన మార్పులుపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ల వరకు శిక్షణలో సమగ్రమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయస్థాయి నుంచి దేశీయ, ప్రాంతీయ నేరగాళ్ల కదలికలను పసిగట్టేందుకు టెక్నాలజీని పూర్తిగా వాడుకోవాలన్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దేశంలో విచ్ఛిన్నం సృష్టించేందుకు ఉగ్రవాదులు, నక్సలైట్ల పన్నుతోన్న కుయుక్తులను శైశవ దశలోనే నిరోధించాలని సూచించారు. జాతీయస్థాయిలో పోలీసు శాఖలు సమాచార మార్పిడికి కేంద్ర హోంశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పోలీసులకు శిక్షణనిచ్చే సమయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నేర నియంత్రణలో తమ అనుభవాలను పంచుకోవాలన్నారు. నేరాలపై దర్యాప్తు మొదలుకుని, నిందితులకు శిక్ష పడేవరకు పోలీసులు ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండాలన్నారు. పోలీసులు సమష్టి ప్రణాళికతో ముందుకు కదిలితే తప్ప ఆధునిక పోకడలు, కొత్త ఎత్తుగడలతో అల్లకల్లోలం సృష్టిస్తున్న నేరగాళ్లను నియంత్రించలేమని హెచ్చరించారు. పోలీసులకు శిక్షణలోనే మానవ మనస్తత్వం, ప్రవర్తన, నేరగాళ్ల ఆలోచనలు, విపరీత వైఖరి తదితర అంశాలను బోధించాలన్నారు. పోలీసులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. ‘కిందిస్థాయి పోలీసులకు నిఘాపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలి. నడిచి వెళ్తూ కూడా గస్తీ బాధ్యతలు నిర్వహించే సంస్కృతి రావాలి. దీనివల్ల నేరస్తుల ఆచూకీ సులువుగా లభిస్తుంది’ అని మోదీ సూచించారు. దేశంలో నకిలీ కరెన్సీ చలామణిని నిరోధించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశానికి మంచి జరుగుతుందని, లెక్కాపత్రంలేని సొమ్ము, నల్లధనం బహిర్గతం అవుతుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇండియన్ పోలీసు అట్ యువర్ కాల్’ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. పోలీసు శాఖకు విశిష్టసేవలు అందించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు కిరేణ్ రిజుజు, హన్సరాజ్ గంగారాం ఆహిర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహిశ్రీ, పోలీసు అకాడమి డైరెక్టర్ అరుణ బహుగుణ పాల్గొన్నారు.

చిత్రం... సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమిలో శనివారం డిజిపి, ఐజిపిల సదస్సుకు హాజరైన సందర్భంలో అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ