ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని ముంచుతున్న ‘త్రిమూర్తులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: అబద్దాల అమిత్‌షా.. మోసకారి మోదీ... మధ్య వారధిలా వెంకయ్య అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ముంచుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. పిసిసి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సభ గురించి ప్రస్తావిస్తూ అబద్ధాలు చెప్పిపోవడానికే అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని అన్నారు. గతంలో కూడా రాజమండ్రికి వచ్చి రాష్ట్రానికి లక్ష 40వేల కోట్ల రూపాయల సాయం చేసామని లిస్టు చదివి వెళ్లారని చెప్పారు. ఆయన లిస్టును ఆయన భాగస్వామి టిడిపి అధినేత చంద్రబాబే తప్పుబట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదువు లేనివారనో, లేక అవగాహన లేనివారనో ఆయన భావిస్తున్నారో ఏమో తెలియదన్నారు. రైతు సదస్సు పేరిట తాజాగా మరికొన్ని కొత్త అబద్దాలను అమిత్‌షా మోసుకువచ్చాడని విమర్శించారు. వీటిలో ప్రధానంగా రైతులకు మోదీ ప్రభుత్వం చాలా న్యాయం చేసిందని, ప్రత్యేక హోదా కన్నా ఎక్కువే సాయం చేస్తున్నామని అన్నారు. వాస్తవానికి నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలోని రైతాంగాన్ని తీవ్ర అన్యాయానికి గురి చేసిందన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు 50 మద్దతు ధర పెంచుతామన్నదానికి ఇంతవరకు సమాధానం లేదని విమర్శించారు. అలాగే డా స్వామినాథన్ కమిషన్ నివేదకను అమలు చేస్తామని చెప్పినదానికీ ఇంతవరకు అతీగతీలేదని తూర్పారబట్టారు. రైతాంగానికి అనుకూలంగా 2013 భూసేకరణ చట్టం చేస్తే దాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ఆర్డినెన్స్ ద్వారా మార్చాలనుకున్నారన్నారు. మోదీ 30 నెలల పాలనలో కార్పొరేట్లకు సుమారు లక్షా 20 వేల కోట్ల అప్పులను మాఫీ చేసిందని, ఒక్క రూపాయి కూడా రైతుల అప్పులను కేంద్రం మాఫీ చేకలేపోయిందన్నారు. హుదుద్ తుఫాను వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్రంగా నష్టం జరిగిందని, తక్షణ సాయంగా ప్రధాని మోదీ వెయ్యి కోట్ల రూపాయల సాయం ప్రకటించి రూ. 450 కోట్లు విదిలించారని వివరించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ బీమా విషయంలోనూ మోదీ ఏమి చేయలేదన్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు వలన దేశంలో అధికంగా నష్టపోతున్నది రైతులేనన్నారు. రైతులకు మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు చేసిందేమీ లేకపోగా రైతులు పండించిన పూలు, పండ్లు, కూరగాయలు, చేపలు, రొయ్యలు ఇవాళ కుళ్లిపోతున్న పరిస్థితి దేశంలో తలెత్తిందని రఘవీరారెడ్డి అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు సంబంధించి రాజ్యసభను కూడా అరుణ్‌జైట్లీ తప్పుదోవ పట్టించారని, దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సభాహక్కుల నోటీసు కూడా ఇచ్చారని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అయ్యన్నకు తప్పిన ప్రమాదం

అనకాపల్లి, నవంబర్ 27: జనచైతన్య యాత్రల్లో భాగంగా ర్యాలీలో పాల్గొన్న విశాఖపట్నం జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఆదివారం జరిగిన జనచైతన్య యాత్రలకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నేతృత్వంలో ఎడ్లబండిపై గుండాల కూడలి నుండి తుమ్మపాల వరకు ర్యాలీగా అయ్యన్న వెళుతున్నారు. ఒకేసారి ఎద్దుల బండి ముందు కొయ్యలు విరిగిపోయాయి. దీంతో బండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే పీలా గోవింద్ ఒకేసారి పడిపోయారు. బండిని లాగుతున్న ఎద్దుల పీకకు తాళ్ళు బిగుసుకోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. మంత్రి భద్రతా సిబ్బంది, అక్కడున్న టిడిపి నాయకులు ఆ తాడును తొలగించడంతో ప్రమాదం తప్పింది.

జనచైతన్య యాత్రలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎక్కిన ఎడ్లబండి కాడి విరగడంతో కుప్పకూలిన దృశ్యం

చెలరేగిన
గజరాజులు!
వృద్ధుడి మృతి
ఆందోళనలో గిరిజనులు

హిరమండలం, నవంబర్ 27: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు చెలరేగిపోయాయి. కొద్ది రోజులనుంచి పంటలను, ఇళ్ళను ధ్వంసం చేస్తున్న గజరాజులు ఓ వృద్ధుడిని పొట్టనపెట్టుకున్నాయి. హిరమండలం మండలంలోని ఎగువరుగడ గిరిజన గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించి, కేసరి తవిటయ్య (70) అనే గిరిజన వృద్ధుడిని వెంబడించి హతమార్చాయి. పాతపట్నం మండలం శోద గ్రామానికి చెందిన కేసరి తవిటయ్య ఎగువరుగడ గిరిజన గ్రామంలో సమీప బంధువుల విందు భోజనానికి శనివారం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వెళుతున్న సమయంలో ఏనుగుల గుంపును చూసి భయపడి పరుగులు తీశాడు. గమనించిన ఏనుగులు వృద్ధుడిని వెంబడించాయి. అప్పటికే అలిసిపోయి నేలపై పడిపోయాడు. తవిటయ్యను కొంతదూరంలో ఉన్న జీడిమామిడితోటల్లోకి తీసుకెళ్లి హతమార్చాయి. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఎగువరుగడ గిరిజనులు చూసి భయభ్రాంతులై గ్రామానికి పరుగులు తీశారు. ఆదివారం ఉదయం గిరిజనులు తవిటయ్య మృతదేహాన్ని గుర్తించారు. హిరమండలం పోలీస్‌స్టేషన్‌కు, పాతపట్నం అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు హిరమండలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.
భారత్ బంద్‌కు
ప్రతిపక్షాలు సన్నద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం నిర్వహించనున్న భారత్ బంద్‌ను అనంతపురం జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. వామపక్ష పార్టీలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైకాపా, కాంగ్రెస్‌పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు జిల్లా స్థాయిలో బంద్‌లో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. బంద్ సందర్భంగా పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ విపక్షాల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉంది. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకులు తెరిచే ఉంచుతామని ఆయా బ్యాంకు శాఖల అధికారులు చెబుతున్నా, ఆందోళనకారులు బ్యాంకులను మూయించేందుకు సిద్ధమయ్యారు.