రాష్ట్రీయం

అమ్మో ఒకటో తారీఖు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు అన్న తేడాలు లేవు. అన్ని బ్యాంకుల ముందూ ఒకే రకమైన సమాచారం. ‘నో క్యాష్’, ‘నో ఎక్స్ఛేంజి’. పక్కన ఉన్న ఎటిఎంలు పనిచేస్తాయా అంటే అవీ పని చేయవు. హైదరాబాద్ నగరంలో ఏ బ్యాంకులో చూసినా ఇదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఈనెల 8న ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత రెండుమూడు రోజుల్లో పరిస్థితి సాధారణంగా మారుతుందని మొదట్లో భావించారు. వారం రోజుల్లో ఎటిఎంలు అన్నీ కొత్తనోట్లకు అనుగుణంగా మార్చనున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. మూడు వారాలు గడిచినా అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. కొత్త నోట్లకు అనుగుణంగా ఎటిఎంలను వారం రోజుల్లో రీకాలిబరేషన్ చేస్తామని చెప్పినా ఆ పనీ పూర్తి కాలేదు. ఐసిఐసిఐ, ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ ఎటిఎంలు కొన్ని ప్రాంతాల్లో పని చేస్తున్నాయి.
నగదు కొరత కారణంగా దాదాపు బ్యాంకులు అన్నీ పాత నోట్లను డిపాజిట్ చేసుకోవడమే తప్ప అవసరమైనంత మేరలో నగదు చెల్లించడం లేదు. వారానికి 24 వేల రూపాయల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉండగా, బ్యాంకులు ఐదువేలకు మించి ఇవ్వడం లేదు. నగదు నిల్వలు లేవని, అందువల్ల ఇవ్వలేకపోతున్నట్టు మేనేజర్లు చెబుతున్నారు. దీంతో ఖాతాదారులకు, బ్యాంకు సిబ్బందికి మధ్య పలుచోట్ల వాదోపవాదాలు జరుగుతున్నాయి. శని ఆదివారాలు సెలవు కావడంతో బ్యాంకులకు కరెన్సీ అందలేదు. దాంతో జాతీయ బ్యాంకులు సైతం చేతులు ఎత్తేశాయి. సికిందరాబాద్ ఐసిఐసిఐ బ్యాంకు ప్రారంభంలో ఉత్సాహంగా పని చేసింది. కరెన్సీ లేకపోవడంతో కేవలం డిపాజిట్‌లకే పరిమితం అయింది.
మొదటి రెండు వారాలు క్షణం తీరిక లేకుండా పని చేసిన సిబ్బంది ఇప్పుడు క్యాష్ డిపాజిట్ తప్ప మరో పని లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. రోజు రోజుకు పరిస్థితి మెరుగు పడుతుందనుకుంటే, పరిస్థితి ఇంకా క్షీణిస్తోంది. మరో రోజు గడిస్తే ఒకటో తారీఖు. అప్పటికి ఎటిఎంలలో డబ్బు చేర్చే అవకాశాలు కనిపించడం లేదు. కొత్తనోట్లకు అనుగుణంగా ఎటిఎంలను మార్చడమే కాలేదు. ఇవి మార్చిన తరువాత డబ్బులు జమ చేయడం జరుగుతుంది. దాంతో ఒకటో తారీఖున బ్యాంకులు, ఎటిఎంలపై ఒత్తిడి భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో పదివేల రూపాయల వరకు నగదు చెల్లించనున్నారు. మిగిలిన వారికి మాత్రం ఒకటో తారీఖు కష్టాలు తప్పేట్టు కనిపించడం లేదు. తెలంగాణలో మొత్తం 5200 బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరంలోనే ఒకటి అరా ఎటిఎంలు పని చేస్తుంటే ఇక జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. 40శాతం ఎటిఎంలు పని చేస్తున్నాయని ఆర్‌బిఐ ప్రకటించినా, వాస్తవంగా అలా లేదు. కనీసం పది శాతం ఎటిఎంలు పని చేసినా పరిస్థితి ఇలా ఉండేది కాదు.

చిత్రం..డబ్బులులేవు, ఎటిఎంలో క్యాష్ లేదు, మనీ ఎక్చేంజ్ లేదు అని బోర్డు పెట్టిన సికింద్రాబాద్ టీచర్స్ కాలనీలోని ఆంధ్రాబ్యాంక్