రాష్ట్రీయం

న్యాయ వర్శిటీలు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: దేశంలో న్యాయ విశ్వవిద్యాలయాలు పెరగాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 18 న్యాయ విశ్వవిద్యాలయాలుండగా, ఇందులో 60వేల మంది విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఇందులో కేవలం రెండువేల మంది మాత్రమే ఇటువంటి యూనివర్శిటీల్లో ఉన్నారన్నారు. అందువల్ల న్యాయ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగాలని, వీటిల్లో వౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. న్యాయ విద్య పట్ల గతంలో చిన్నచూపు ఉండేదని, అయితే ఇది క్రమేపీ తగ్గుతూ వచ్చిందన్నారు. ఒకప్పుడు అన్ని అవకాశాలు చేజారిన తరువాతనే న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి చూపేవారన్నారు. అటువంటిది ఈ వృత్తిపట్ల ప్రత్యేక గౌరవం, ఆసక్తి పెరుగుతున్నాయన్నారు. విద్యార్థులు లా డిగ్రీ పూర్తిచేసిన తరువాత విదేశాల్లో కార్పొరేట్ సంస్థలు చూపే వేతనాలకు ఆకర్షితులు కాకుండా ఉత్తమ న్యాయ నిపుణులుగా ఎదగాలన్నారు. విశ్వవిద్యాలయాలలో లా ప్రొఫెసర్ల వేతనాలు రూ. 50వేల వరకు ఉంటే వీరి వద్ద న్యాయవిద్యను పూర్తిచేసే వారు బయటకొచ్చిన తరువాత నెలకు రూ. లక్ష, రెండు లక్షల వేతనాలిచ్చే సంస్థల పట్ల ఆకర్షితులు అవుతున్నారని ఆయన తెలిపారు. అలా కాకుండా న్యాయ విద్య బోధకులుగాను, ఇక్కడే అన్ని విధాలా పరిశోధనలు చేసే విధంగా ఆసక్తి చూపాల్సి ఉందన్నారు. అప్పుడు న్యాయ విశ్వవిద్యాలయాల్లో కూడా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధంగా న్యాయ నిపుణుల నుంచి తమ మాదిరిగా చీఫ్ జస్టిస్ స్థాయికి ఎగదాలన్నారు. అలాగే సీనియర్ల నుంచి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. ఒక్క విశాఖలోనే కోర్టుల్లో 1500 మంది మహిళా న్యాయవాదులు ఉండటం గర్వించదగినదిగా ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు. అందువల్లనే న్యాయపరమైన వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఆయన లక్ష్యం అభినందనీయమన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేయడం దీనిపట్ల ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోందన్నారు.

చిత్రం.. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ
విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్