రాష్ట్రీయం

పెత్తనమంతా వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 20: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా జిల్లాల్లో పార్టీ పురోగతి సాధించకపోవడానికి, పథకాలు జనం వద్దకు వెళ్లకపోవడానికి కొందరు జిల్లా కలెక్టర్ల నియంతృత్వ వైఖరే కారణమన్న విమర్శలు తెదేపాలో వినిపిస్తున్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల సిఫార్సులు బుట్టదాఖలు చేస్తున్నందున తాము జనాలకు దూరమవడంతోపాటు, పలచన అవుతున్నామన్న ఆవేదన పార్టీలో నెలకొంది. మెజారిటీ కలెక్టర్లు తాము ముఖ్యమంత్రిని మెప్పిస్తే చాలన్న ధోరణితో ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానాలకు గురవుతున్న పరిస్థితిపై ఆవేదన నెలకొంది.
ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రెండురోజులపాటు విజయవాడలో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఏర్పాటుచేసిన వర్క్‌షాపులో ఇలాంటి ఫిర్యాదులు విన్న చంద్రబాబు.. బుధవారం నుంచి జరగనున్న కలెక్టర్ల సదస్సులో వాటిని ప్రస్తావించే అవకాశం ఉండటంతో ఈ సదస్సుపై ఆసక్తి నెలకొంది.
బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్ధులని భావించిన కొందరిని కలెక్టర్లుగా నియమించారు. అందులో కొందరిని పార్టీ నేతలు వద్దని సూచించినా ఆయన ఖాతరు చేయలేదు. అయితే, వారినుంచి ఆశించిన ఫలితాలు రాకపోగా, ఫిర్యాదులు ఎక్కువ కావడం తలనొప్పిగా పరిణమించింది. రోజూ సీఎం వారితో మాట్లాడుతుండటంతో ఇక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను ఖాతరు చేయని వైనం ప్రజాప్రతినిధులకు అవమానంగా మారింది. దీనిపై పార్టీ సమన్వయ కమిటీలో అనేకసార్లు ఫిర్యాదులు కూడా చేసిన విషయం తెలిసిందే. చాలామంది కలెక్టర్లు బాబుతో ఉన్న చనువు చూసుకుని మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం, కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల కలెక్టర్లపై మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. బాబు సొంత జిల్లా చిత్తూరులో కలెక్టర్ సిద్దార్ధ్ జైన్‌పై దాదాపు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి.
పార్టీ నాయకత్వానికి అనుకూలంగా ఉంటారన్న ప్రచారం ఉన్న పరిశ్రమల శాఖ డైరక్టర్ తన పైఅధికారులను మాత్రమే కాకుండా, మంత్రుల సిఫార్సులూ ఖాతరు చేయడం లేదని, పైగా సిఫార్సులు చేసిన కేసులను కావాలనే రిజెక్టు చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ‘ఇలాగైతే పార్టీ ఏం బతుకుంది? సార్ కూడా నేరుగా కలెక్టర్లతో మాట్లాడితే వాళ్లు మమ్మల్ని ఎందుకు లెక్కచేస్తారు? ఈ పద్ధతి మార్చుకోకపోతే పార్టీ చులకన అవుతుంది. ఈ విధానం వల్లే మేం గతంలో ఓడాం. ఎన్నికల్లో అధికారులు ఓట్లు వేయించరు. ఎమ్మెల్యేలు కలెక్టరేట్లకు వెళ్లి విజిటంగ్ కార్డు పంపినా కొన్ని గంటల వరకూ పిలవని దుస్థితి ఉంది. మా వౌనాన్ని అసమర్థతగా తీసుకుంటున్నారు. మాకు గౌరవం ఇవ్వకపోతే మా నుంచి అధినేత కూడా గౌరవాన్ని ఆశించలేర’ని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇలాంటి కొందరు కలెక్టర్లకు సీఎంఓలోని ఒక ఉన్నతాధికారి ప్రోత్సాహం ఉందని మంత్రులు చెబుతున్నారు. గతంలో కలెక్టర్ల బదిలీలు సీఎంలు చేసేవారని, ఇప్పుడు సీఎంఓలోని ఒక అధికారి ప్రమేయంతో నడుస్తున్నాయని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ‘మాకు పెద్దగా సమయం లేదు. ఉన్న రెండున్నరేళ్లు ఎవరికీ ఏమీ చేయకుండానే గడిచిపోయాయి. మరో రెండున్నరేళ్లలో గట్టిగా పనిచేస్తే ఏడాదే సమయం ఉంటుంది. ఈలోగా పార్టీ బతకాలంటే ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచే అధికారులను కలెక్టర్లుగా వేయాలి. ఇప్పుడు మొండితనం, లెక్కలేనితనం ఉన్న కలెక్టర్లను ఇంకో జిల్లాకు మారిస్తే అప్పుడు ఆ సమస్య ఆ జిల్లాకు బదిలీ అయి, ఆ జిల్లానేతలు ఇబ్బందిపడతారే తప్ప ఉపయోగం ఉండద’ని మరో మంత్రి అభిప్రాయపడ్డారు.
అవుట్‌సోర్సింగ్ కంపెనీల కేటాయింపుల అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంతో అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రాజధానిలోని రెండు జిల్లాలకు చెందిన ఒక జిల్లా అధికారి, ఈ విషయంలో తన మనుషుల ద్వారా అవుట్‌సోర్సింగ్ కంపెనీలతో డీల్ కుదుర్చుకుంటున్నారని, ఈ విషయంలో వంద పోస్టులకు ఇంత అని రేటు కడుతున్నారని చెబుతున్నారు.
కలెక్టర్లు, సీఎంఓ ప్రక్షాళన, పరిశ్రమలు, ఐటి వంటి కీలక శాఖల అధికారుల బదిలీలపై బాబు కనబరుస్తున్న సాచివేత ధోరణి మంత్రులు, ఎమ్మెల్యేలలో అసహనం, అసంతృప్తికి కారణమవుతోంది. ‘కాంగ్రెస్ హయాంలో సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు వచ్చేవి. అందుకే వాళ్లు భయపడి పనిచేసేవాళ్లు. మా సార్ మాత్రం నాన్చుతుంటార’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.