రాష్ట్రీయం

హైటెక్కు పేకాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 21: పెద్దనోట్ల రద్దు తరువాత ఆన్‌లైన్ సేవలకు సామాన్యులు ఇంకా అలవాటు పడకపోయినా జూదరులు మాత్రం ఈ సేవలను అందిపుచ్చుకుని దర్జాగా పేకాడేస్తున్నారు. పేకాట, మట్కా ఆడేవారు తాము పందెంలో కాయాల్సిన నగదును మొబైల్ అప్లికేషన్ల ద్వారా బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతి పొందిన క్లబ్బుల్లో ఇప్పటికే టోకెన్ పద్ధతి కొనసాగుతుండగా అనధికార జూదంలో మాత్రం ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం నగదు జమ చేసి జూదం ఆడేవారు తాజాగా బ్యాంకులో ఉన్న నగదును జూదం నిర్వాహకుడి ఖాతాకు బదిలీ చేసి పేకాట, మట్కా ఆడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు తరువాత కరెన్సీ, చిల్లర కొరత అందరి మాదిరిగానే జూదరులకు ఎదురైంది. అయితే ఈ సమస్య నుంచి వారు త్వరగా కోలుకున్నారు. తమ స్మార్ట్ఫోన్లలో బ్యాంకులు, మొబైల్ వ్యాలెట్ల అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూదం ఆడే సమయంలో జమ చేయాల్సిన నగదును నిర్వాహకుడి ఖాతాకు నగదు బదిలీ ద్వారా పంపి ఆటకు అర్హత పొందుతున్నట్లు సమాచారం. ఈ పద్దతిని అధికార క్లబ్బులోనే కాకుండా అనధికారికంగా చెట్ల కింద, కొండగుట్టల్లో ఆడే వారు సైతం వినియోగించుకుంటున్నట్లు పోలీసులు ధృవీకరిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో అనధికారికంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించగా పెద్దఎత్తున జూదరులు పట్టుబడ్డారు. అయితే వారి వద్ద లభించింది వందల్లో నగదు, సిగరెట్లు, అగ్గిపెట్టెలే. ఎప్పుడు దాడులు జరిపినా వేలు, లక్షల్లో నగదు పట్టుబడేదని అయితే ఈసారి అలాంటి ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. దీనిపై ఆరా తీయగా పోలీసులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తే అసలు విషయం వెలుగుచూసింది. పట్టుబడిన జూదరులను విచారించగా నగదు బదిలీద్వారా సొమ్మును ఒకరికొకరం బదిలీ చేసుకుంటున్నామని, ఇందుకోసం స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నామని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. జూదరులు చెప్పింది విని ఆశ్చర్యపోయామని ఓ పోలీసు అధికారి చెప్పారు. జూదరుల వద్ద నగదు లభ్యం కాకపోవడంతో వారిని కోర్టులో హాజరుపర్చడానికి ఇబ్బంది ఎదురవుతోందని ఆయన స్పష్టం చేశారు. నగదు బదిలీ ద్వారా వేల రూపాయలు చేతులు మారినా ఈ విషయాన్ని కోర్టులో నిర్ధారించడం కష్టమైన పని అని పోలీసు అధికారి తెలిపారు. కాగా జిల్లాలో మట్కా ఆటగాళ్లు సైతం నంబర్లను ఫోన్‌ద్వారా చెప్పి ఆ మొత్తం నగదు బదిలీ ద్వారా ఏజెంటుకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరిస్తున్నారు. ఇకపై జూదగృహాలపై దాడులు జరిపే సమయంలో సాంకేతిక సాక్ష్యాలు సేకరించి కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

పోలవరం పవర్‌హౌస్ టెండర్లకు రంగం సిద్ధం

అంగులూరులో ప్లాంటు శరవేగంగా మట్టి పనులు నిధుల బాధ్యతతో రాష్ట్రం మల్లగుల్లాలు

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 21: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టులో భాగంగా పవర్ హౌస్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. మట్టి పనులు ఊపందుకోవడంతో టెండర్లు పిలిచేందుకు కసరత్తు జరుగుతోంది. మార్చిలో టెండర్లు పిలవడానికి కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. పోవరం రిజర్వాయర్ ఎడమ గట్టు దేవీపట్నం మండలం అంగులూరు గ్రామం వద్ద నిర్మించనున్న పోలవరం పవర్ హౌస్‌కు సంబంధించి నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రధాన ప్రాజెక్టుకే నిధుల విషయంలో ఇపుడిపుడే స్పష్టత లభిస్తోన్న తరుణంలో రాష్టమ్రే నిర్మించుకోవాల్సిన ఈ పవర్ హౌస్‌కు సంబంధించిన నిధులు ఏ విధంగా సమకూరుతాయో అర్ధం కాని గందరగోళ స్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటుకు రూపకల్పనచేశారు. దీనికి సుమారు రూ.1980 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనావేశారు. మార్చి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని సంకల్పించారు. మొత్తం 18 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేయాల్సివుంది. ఇప్పటి వరకు 81.97 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. మట్టిపని ట్రాన్స్‌ట్రాయ్ చేపట్టింది. ప్లాంట్‌ను జెన్కో ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. అయితే ఈ ప్లాంటుకు నిధులు ఏ విధంగా సమకూర్చుతారో అనేది తేలలేదు. ఎందుకంటే తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.36వేల కోట్లకు చేరుకుంది. జాతీయ హోదా దక్కక ముందు కేంద్రం నుంచి రూ.273 కోట్లు వచ్చాయి. జాతీయ హోదా దక్కిన తర్వాత 2016 మార్చి 31 వరకు పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు సుమారు 2341.50 కోట్లు. ఇప్పటికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ.845 కోట్లు. 2008 నుంచి 2014 మార్చి 31 వరకు పోలవరంపై రాష్ట్రం రూ.3344 కోట్లు భరించింది. 25 శాతం వాటా కింద కేంద్రం నుంచి రూ.836 కోట్లు వచ్చాయి. ఇపుడు తాజాగా ఈ నెలాఖరున ఢిల్లీలో ఇందుకు సంబంధించి నిధులను సిఎం సమక్షంలో ఇవ్వనున్నారు. అయితే పవర్‌హౌస్‌కు సంబంధించి మట్టిపని వరకే పోలవరం ప్రాజెక్టు నిధులు వస్తాయని, ప్లాంటును రాష్టమ్రే నిర్మించాల్సి వుందని తెలుస్తోంది. జల రవాణా ప్రాజెక్టు పూర్తి కావాలంటే ముందుగా పవర్ హౌస్ నిర్మాణం పూర్తి చేయాల్సి వుంది. ఈ నేపధ్యంలోనే సత్వరం పవర్ హౌస్ నిర్మాణం పూర్తయితే పెట్టుబడి పెట్టిన వేల కోట్ల నిధులను మూడేళ్ళలోనే రాబట్టవచ్చని అంచనాతో నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికీ ఈ హైడల్ పవర్ హౌస్‌కు పునాదులను సిడబ్ల్యుసి ఆమోదించింది. పునాది పనుల పరీక్షలకు కూడా సిడబ్ల్యుసి ఆమోదం తెలిపింది. ఏదేమైనప్పటికీ మార్చిలో టెండర్ల ప్రక్రియ పూర్తయి ఆ వెనువెంటనే పనులు ప్రారంభించి 2018 నాటికి ప్లాంట్ పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

అసెంబ్లీ లాబీల్లో జెసి
ఈటల, జానారెడ్డితో పిచ్చాపాటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా కలిసిపోయే ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో హల్‌చల్ సృష్టించారు. ఆయన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కొంతసేపు ముచ్చటించారు.
‘రాష్ట్ర విభజన వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. విభజన సమయంలో మా రెండు జిల్లాలను కలుపుకోవాలని కోరాం. ఈ రెండు జిల్లాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావాలి. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో విలీనం చేసి ఉంటే, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిసి మాకు నీరు విడుదల చేయాలని కోరే వారమన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఈ రెండు జిల్లాల వ్యవసాయ మనుగడ ఆధారపడి ఉందన్నారు. విభజనవల్ల ఈ రెండు జిల్లాల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు.
ఆ తర్వాత ప్రతిపక్ష నేత కె జానారెడ్డిని కూడా జెసి దివాకర్ రెడ్డి కలుసుకున్నారు. కాంగ్రెస్ నేతలతో సరదాగా మాట్లాడారు. జానారెడ్డిని ఉద్దేశించి జెసి మాట్లాడుతూ మీరు ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయాల్సి ఉంది, మీరు గట్టిగా నిలబడాలని కోరారు. ఆ తర్వాత మళ్లీ కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో విలీనం చేసి ఉంటే బాగుండేదన్నారు. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో విలీనం చేసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. అనంతరం జెసి దివాకర్ రెడ్డి టిడిఎల్‌పి కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

అవినీతిపరులను
వదలొద్దు
ఐటి దాడి తలవంపు: స్టాలిన్
చెన్నై, డిసెంబర్ 21: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావు ఇంటిపై ఆదాయపన్ను అధికారులు బుధవారం జరిపిన దాడిని అసాధారణ పరిణామంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎం.కె.స్టాలిన్ పేర్కొన్నారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని వ్యాఖ్యానించిన ఆయన అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపై ఐటి దాడి జరగడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. కాగా, సిఎస్ ఇంటిపై జరిగిన ఐటి దాడి సివిల్ సర్వీస్ స్థాయినే దిగజార్చేదిగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇంటిపై ఇంటలిజెన్స్ అధికారులు ఎందుకు దాడి చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపై ఐటి దాడులు జరగడం ఇదే మొదటిసారి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.