రాష్ట్రీయం

న్యాయం ఇక దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 23: ఒకవైపు గిట్టుబాటు ధర లభించక, మరోవైపు దళారుల మాయాజాలంతో కుదేలవుతున్న రైతుల మెడపై ప్రభుత్వం మరో కత్తి పెట్టింది. ప్రభుత్వ అవసరాలకు సేకరించే భూములకు చెల్లించే నష్టపరిహారం సరిపోదని భావించే రైతులు ఇకపై స్థానిక కోర్టులకు వెళ్లే వీలులేని పరిస్థితి ఎదురుకాబోతోంది. సత్వర న్యాయం, పారదర్శకత పేరుతో భూ నష్టపరిహారానికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రంలో మూడు కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే నష్టపరిహారం కోసం ప్రస్తుతం రైతులు స్థానిక కోర్టులను ఆశ్రయించే అవకాశముండదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ‘అడ్జుడికేటింగ్ అథారిటీ 2013’ పేరుతో మూడు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విధానం అమలులోకి వస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన రైతులు తమ ఫిర్యాదుల కోసం తిరుపతిలో ఏర్పాటు చేయబోయే కోర్టును ఆశ్రయించాల్సిందే. ఇది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమనే చెప్పాలి. ఈ కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే రైతులు నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిందే. సత్వర న్యాయం, పారదర్శకత, కోర్టులకు పని భారం తగ్గించే ప్రయత్నంలో ఇది రైతులను ఇబ్బందులకు గురి చేయబోవడమేనని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అప్పులు ఎక్కువై దివాలా (ఐపి) పిటిషన్ దాఖలుకు రాష్ట్రంలో మూడుచోట్ల ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకానున్నాయి. ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్’ పేరుతో ఏర్పాటయ్యే మూడు కోర్టుల్లో ఒక కోర్టు విశాఖపట్టణంలో నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించాల్సి ఉంది. ఐపి పిటిషన్‌లపై తమ వాదనలు వినిపించాలనుకునే సామాన్యులు వ్యయప్రయాసలు ఎదుర్కొని ఆ ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు స్థానిక కోర్టులో ఐపి పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కొత్త కోర్టులు పని ప్రారంభిస్తే అక్కడే దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా కోర్టుల్లో ఉన్న కేసులను ఈ ప్రత్యేక కోర్టులకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పు ఇచ్చిన సామాన్యులు దూరప్రాంతంలోని కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది.
వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసులు కూడా ప్రత్యేక కోర్టు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి కొత్త కోర్టు రాష్ట్రంలో ఒకటి మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజధానిగా అమరావతిని ఎంపిక చేయగానే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల అద్దెలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం అద్దె నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ కేసులకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ప్రత్యేక అధికారాలు కేటాయించి వారికి విచారణ నిర్వహించే అధికారం కట్టబెట్టనుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు, సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని కర్నూలు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చాంద్‌బాషా అన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లోని రైతులంతా తిరుపతి వెళ్లి కోర్టులో న్యాయం కోసం పోరాడాలంటే అది వ్యయప్రయాలతో కూడుకున్న వ్యవహారమేనన్నారు. సత్వర న్యాయం కోసమంటున్న ప్రభుత్వం నాలుగు జిల్లాల్లోని కేసులు ఒక కోర్టులో విచారిస్తే వారికి మాత్రం పనిభారం కాదా అని ప్రశ్నించారు. స్థానిక కోర్టుల్లో కూడా అధికారులు సత్వరంగా స్పందిస్తే కేసులు త్వరగా తేలిపోతాయని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని యథాతథస్థితిని కొనసాగించాలని, అదే సమయంలో భూ సేకరణ కేసులకు సంబంధించి అధికారులు తక్షణమే స్పందించి కోర్టులకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా శనివారం కర్నూలులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, తిరుపతి బార్ అసోసియేషన్లప్రతినిధులు సమావేశం కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించుకోకపోతే పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.