రాష్ట్రీయం

పేదలకు దివ్యదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: నమ్మకం అనేది మనుషులను ఉన్నత స్థానానికి తీసుకెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఇక్కడి దుర్గాఘాట్ వద్ద జరిగిన దివ్యదర్శనం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని మతాల వారు తమ మతవిశ్వాసాల ప్రకారం ఆయా ఆలయాలకు, ప్రార్థనామందిరాలకు వెళ్లి పూజలు చేస్తారన్నారు. వారి మతవిశ్వాసాల ప్రకారం పూజలు చేయడం వల్ల ప్రజలకు ఉల్లాసంతో పాటు ఉత్సాహం కూడా వస్తుందన్నారు. అందుకే మన పూర్వీకులు భజనలు చేస్తూ తీర్థయాత్రలు చేసేవారని ఆయన గుర్తుచేశారు. అందులో భాగంగానే రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పేదల కోసం దివ్యదర్శనం కార్యక్రమం చేపట్టామన్నారు. దీనిద్వారా దేశంలోని ప్రముఖ హిందూ దేవాలయాలకు ప్రతి మండలం నుంచి 200 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి పంపనున్నట్లు తెలిపారు. 4 నుంచి 5 రోజులపాటు దివ్యదర్శనం తీర్థయాత్ర కొనసాగుతుందని, భక్తులకు ఉచితంగా అన్ని వసతులు కల్పించి ఆలయాల దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఐదుగురికి తీర్థయాత్రలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఏ మతానికి ఆ మతం సామరస్యం కోసం పాటుపడాలని అప్పుడే లౌకికవాదానికి అర్థం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో పండుగలు ఎక్కువగా జరుపుకుంటే ప్రజలు అంతా సంతోషంగా ఉంటారని, నమ్ముకున్న దేవుడికి పూజలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. దివ్యదర్శనం కార్యక్రమానికి ఆర్టీసీ నుంచి అద్దె ప్రాతిపదిన 52 బస్సులు తీసుకుని రాష్టవ్య్రాప్తంగా లక్షా 30వేల మందికి తీర్థయాత్రల అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 70 సంవత్సరాల్లోపు ఉన్నవారు తీర్థయాత్రలకు వెళ్లవచ్చని చంద్రబాబు ప్రకటించారు. దివ్యదర్శనం యాత్రకు తీసుకెళ్లే వారిలో 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన నిరుపేద హిందూ భక్తులు ఉంటారని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని, వారి అనుభవాల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికార్లకు ముఖ్యమంత్రి సూచించారు. మన ఇంటికి బంధువులొస్తే ఎలా చూస్తామో వారిని అలాగే ఆదరించి చూడాలని ముఖ్యమంత్రి నిర్వాహకులను కోరారు. నాలుగో జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు దివ్యదర్శనం కార్యక్రమానికి రావడం, తొలిరోజు తొలి భక్తుల బృందంతో మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. తీర్థయాత్ర అనుభవాలను మీ ఊరిలో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. తీర్థయాత్రకు సిద్ధమై వచ్చిన నిరుపేద భక్తుల చేత తొలుత చంద్రబాబు దీక్షాప్రమాణం చేయించారు. అనంతరం దివ్యదర్శనం యాత్రికులు వెళ్లే నాలుగు బస్సులకు లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి జెవిఎస్ ప్రసాద్, కమిషనర్ అనూరాధ, దుర్గగుడి ఇవో సూర్యకుమారి, ఆర్టీసీ ఎండి మాలకొండయ్య, సింఎవో అధికారి ప్రద్యుమ్న, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తీర్థయాత్ర బస్సుకు జెండా ఊపి దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు