రాష్ట్రీయం

తెలుగుకు శాపం.. పరభాషా వ్యామోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ ఎస్.రాయవరం, జనవరి 8:తెలుగుజాతి ప్రస్తుత పరిస్థితి అంతులేని ఆవేదన కలిగిస్తోందని, జాత్యభిమానం లేని వారుగా తెలుగువారు మారుతుండటం ఆందోళనకరమైన విషయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష, జాతికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని, సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం జరిగిన అప్పాజోస్యుల విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్ వార్షిక సదస్సుల్లో భాగంగా ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీకి జీవితకాల సాధన పురస్కారాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండలి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తూ పాత్రికేయ వృత్తిలో విలువలను కాపాడుతున్న వారు ఎంవిఆర్ శాస్ర్తీ అని ప్రశంసించారు. ‘పరభాషా వ్యామోహంతో మన భాషను మనమే నాశనం చేసుకుంటున్నాం. భాష నశిస్తే జాతి నశించిపోతుంది. మన జాతీయ పతాక రూపశిల్పి ఒక తెలుగు వాడన్న విషయాన్ని మనం ఎందుకు సగర్వంగా చెప్పుకోలేకపోతున్నాం? ఇప్పుడు జాత్యభిమానాన్ని తెలుగువారికి నూరిపోయాల్సిన అవసరం వచ్చింది. అందుకు ఎంవిఆర్ శాస్ర్తీ లాంటి పత్రికా సంపాదకులు పూనుకోవాలి’ అని మండలి అన్నారు. సమాజంలో విలువలు నానాటికీ దిగజారుతున్నాయని, ముఖ్యంగా పత్రికారంగంలో ఇది వాంఛనీయం కాదన్నారు. ఈ దశలో పాత్రికేయులు తమ వ్యక్తిత్వానికి అనుగుణంగా పనిచేస్తూ వ్యవస్థను పురోగమనం వైపు నడిపించాలని కోరారు. తెలుగుభాష, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తున్న వారిని గౌరవించటం అజోవిభొ చేస్తున్న గొప్పపని అని ఆయన కొనియాడారు. తెలుగు జ్ఞానపీఠ్ అవార్డుగా భావించే ఈ పురస్కారాన్ని ఎంవిఆర్ శాస్ర్తీకి ఇవ్వడం సముచితమన్నారు. కలాన్ని కరవాలంగా మలచి తన భావాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిత్వం శాస్ర్తీ సొంతమన్నారు. అజోవిభొ సంస్థ 24 ఏళ్లుగా ఇస్తున్న పురస్కారాలను పరిశీలిస్తే ఆయా రంగాల్లో పురస్కార గ్రహీతలు చేసిన కృషి ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత ప్రధాని పివి నర్సింహారావు స్వీయ రచనలు, జీవిత చరిత్రను పుస్తకరూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అజోవిభొ సేవను మెచ్చుకున్నారు. జీవితకాల సాధన పురస్కారాన్ని అందుకున్న ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ వ్యవస్థ గాడిన పడాలంటే జీవితకాలం పనిచేయాలని, మనకు మనమే పనికిమాలినదిగా మార్చుకున్న వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలంటే ఏ రంగంలోనైనా ఒక జీవితకాలం పనిచేస్తే గాని జాతి ఔన్న త్యం వెలుగుచూడదని అభిప్రాయపడ్డారు. మనిషి ఆలోచనా విధానం, సంస్కారం, విలువలు అధోగతికి దిగజారాయని, తరాలకు తరాలు నిద్రపోతూ తాము అన్నింటా ముందుకు సాగుతున్నట్టు కలలు కంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ నిష్ణాతులున్నారని, వీరంతా ఒక్కటై తమతమ పరిధిలో జాతిని సంస్కరించేందుకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ధర్మరక్షణ, సత్యపాలనతో దేశం ముందుకు నడవాలనే తపనతో నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నానన్నారు. ‘ఒకప్పుడు వ్యవస్థను భ్రష్టుపట్టించేది రాజకీయ రంగమని భావించేవాళ్లం. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో విపరీత ధోరణులు చోటుచేసుకున్నాయి. పత్రికలే ప్రభుత్వాలను పెడదోవ పట్టిస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి వారు తాము రాసిందే వేదం, చూపిందే సత్యం అన్న ధోరణితో సాగుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో పత్రికల విశ్వసనీయతను చేజేతులా పోగొట్టుకుంటున్నామని అన్నారు. పదిమందినీ ఆలోచింపజేసే శక్తి పత్రికలకు ఉందని ఈ విషయంలో నేను ఏం చేయగలను అని ప్రశ్నించుకునే వ్యక్తి అద్భుతాలను సాధించగలడన్నారు. తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అజోవిభొ సంస్థ రెండున్నర దశాబ్దాలుగా చేస్తున్న కృషిని కొనియాడారు. జమీందార్లు కూడా చేయలేని సాంస్కృతిక సేవ అజోవిభొ చేస్తోందన్నారు. ఈసారి జీవితకాల సాధన పురస్కారం తనకు దక్కడం సంతోషంగా ఉందని, ఏం సాధించానని ఈ సత్కారం చేస్తున్నారని ప్రశ్నించుకుంటే తాను తీసుకుంటున్న పురస్కారం తన బాధ్యతను మరింత పెంచుతోందని పేర్కొన్నారు.
సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ పాఠకుడి నాడి ఒడిసి పట్టుకున్న సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అని అన్నారు. వార్తలు చదివి మూలపడేసే న్యూస్‌పేపర్‌ను పదిలంగా పదికాలాలు దాచుకునే విధంగా శీర్షికలు నిర్వహిస్తున్న సంపాదకులు శాస్ర్తీ అని అన్నారు. రాజకీయ పార్టీలు చేయాల్సిన పనిని పాత్రికేయులు, కాలమిస్టులు చేస్తున్నారని, దీనిని చూసి ప్రభుత్వాలు తమ తీరును మార్చుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఎంవిఆర్ శాస్ర్తీ రాసిన వీక్‌పాయింట్, ఉన్నమాట తదితర శీర్షికలు పాఠకులను ఆలోచింపజేసేవిగాను, ప్రభుత్వాలు, వ్యవస్థలు తమ తీరును మార్చుకునే విధంగాను ఉంటాయని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలతోనే సంపాదకీయం నెరపిన ఎంవిఆర్ శాస్ర్తీ జీవితం భవిష్యత్ పాత్రికేయ లోకానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. అనంతరం అజోవిబొ వ్యవస్థాపక చైర్మన్ అప్పాజోస్యుల సత్యనారాయణ అజోవిభొ జీవితకాల సాధన పురస్కారాన్ని ఎంవిఆర్ శాస్ర్తీకి ప్రదానం చేశారు. పురస్కారంతోపాటు రూ. లక్ష నగదు చెక్కును, ప్రశంసా పత్రా న్ని బహూకరించారు. అనంతరం ఎంవిఆర్ శాస్ర్తీ దంపతులను అతిథులు, ఆహూతులు సత్కరించారు.

చిత్రాలు..అప్పాజోస్యుల విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్ వార్షిక సదస్సులో ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్