రాష్ట్రీయం

దర్జాగా దోచేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లూరి మురళీకృష్ణ
ఖమ్మం, జనవరి 9: నకిలీల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఉన్న లోపాలు ఆసరా చేసుకొని అవినీతిపరులు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ‘దోస్త్’ వెబ్‌సైట్‌లో లోపాలు, ఇ-పోస్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బాధ్యతలు చూసే అధికారుల కనుసన్నల్లోనే జరిగిన నకిలీల ఆగడాల ముందు విద్యాశాఖ పనితీరు వెలవెలబోతోంది. జిల్లా కేంద్రం ఖమ్మంకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారేపల్లిలోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల ఈ అక్రమాలకు వేదికైంది. తాజాగా వెలుగుచూసిన ఈ వ్యవహారం విద్యార్థుల్నే నివ్వెరపర్చింది. ఈ ప్రక్రియలో ఇంటివద్దనే ‘దోస్త్’ ఆన్‌లైన్ చేస్తున్నామంటూ ఇంటర్ లేదా తత్సమాన ఓపెన్ ఇంటర్ విద్యార్థుల వివరాలు సేకరిస్తారు. టెన్త్ మార్కుల లిస్టు జిరాక్స్ కాపీ ఇవ్వమని తీసుకుంటారు. విద్యార్థుల ఇంటి వద్దకు వచ్చిన వ్యక్తి కాలేజీలోని బృందానికి ఫోన్‌లో వివరాలు చెప్పటం, వారు తమ కళాశాలను ఆప్షన్లలో పెట్టి దరఖాస్తులు పూర్తిచేయటం జరుగుతుంది. ఇంటర్ మార్కులు, ఆధార్ నెంబర్ మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉండటంతో దోస్త్ దరఖాస్తు పూర్తిచేసే పని వారికి సులువైంది. అనంతరం పాస్‌వర్డ్ కళాశాలకు చెందిన వారి ఫోన్ నెంబర్‌కు వస్తుంది. దీన్ని వారు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. కారేపల్లిలోని ఓ డిగ్రీ కళాశాల టెన్త్ జిరాక్స్‌ల సాయంతో జరిపిన అడ్మిషన్లను విద్యార్థులకు తెలియకుండానే కన్‌ఫర్మ్ చేసుకున్నారు. విద్యార్థుల ప్రమేయం లేకుండానే కళాశాల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశారు. అనంతరం కళాశాల యాజమాన్యాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఒరిజినల్ సర్ట్ఫికెట్లు పరిశీలించి వాటిని తీసుకుని అడ్మిషన్స్ ఇవ్వాల్సి ఉంది. అడ్మిషన్ పొందిన దోస్త్ వైబ్‌సైట్‌లో మాదిరిగానే విద్యార్థి స్కాలర్‌షిప్ కోసం ఇ-పోస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు తెలియకుండానే కళాశాల యాజమాన్యం వారి పేరిట నకిలీ ఫొటోలతో స్థానిక ఎస్‌బిహెచ్‌లో బ్యాంకు ఖాతాలు తెరిచారు. పరీక్ష రుసుము చెల్లిస్తేనే స్కాలర్‌షిప్ వస్తుందనే నిబంధనను ఆకళింపు చేసుకున్న ఈ కళాశాల, తాము చేర్చుకున్న నకిలీ విద్యార్థుల పేరున బోగస్ పత్రాలు, ఫొటోలతో పరీక్ష రుసుము కూడా చెల్లించింది. కాకతీయ యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు, ఇ-పోస్ వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధాలు ఉండకపోవటంతో తాము ఏర్పాటు చేసుకున్న నకిలీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నకిలీ వ్యక్తుల ఆధార్ కార్డు నెంబర్లు వినియోగించి, తరువాత ‘అసలు’ విద్యార్థులకు తెలియకుండానే వేలిముద్రలు కూడా వేయించి కోట్ల రూపాయలు దోచుకుంటోంది. అధికారులకు ముడుపులు ముడుతుండటంతో వీరి ఆగడాలకు హద్దులేకుండా పోయింది. 300మందికి కూడా సరిపోని ఈ కళాశాల భవనంలో వెయ్యిమంది చదువుతున్నట్టు అడ్మిషన్లు చూపిస్తున్నారంటే అవినీతి ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. డోర్నకల్‌కు చెందిన ఇంద్రకంటి శ్రావణి జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లోని నలంద పారా మెడికల్ కళాశాలలో చదువుకుంటుండగా, ఆమెకు తెలియకుండానే జూలూరుపాడులోని శ్రీవికాస్ కళాశాలలో డిగ్రీ బిఎస్సీలో చేరినట్టు నమోదైంది. ఆమె పేరున స్థానిక బ్యాంకులో వేరేవారి ఫొటోతో బ్యాంకు ఖాతా తెరిచి ఉంది. అంతటితో ఆగకుండా పరీక్ష రుసుము కూడా చెల్లించారు. హాల్ టికెట్ ఇల్లందులోని సాహితి డిగ్రీ కళాశాల సెంటర్‌కు వచ్చింది. ఈమె ఇ-పోస్ దరఖాస్తులో వేరే గ్రామానికి చెందిన ఒక మహిళ ఆధార్ నెంబర్, అడ్రస్ ఇచ్చారు. శ్రావణి చదువుతున్న నలంద పారా మెడికల్ కాలేజీ వాళ్లు ‘నీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు.. వేరే దగ్గర డిగ్రీ కూడా చేస్తున్నావు కదా’ అని చెప్పటంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కారేపల్లికి చెందిన మరో యువతి ఖమ్మంలోని ఒక కళాశాలలో చదువుతుంటే, కారేపల్లిలోని కళాశాలలో అడ్మిషన్ ఉన్నట్టుగా తేలింది. ఆమె పేరిట కూడా ఇ-పోస్ దరఖాస్తు చేసి, పరీక్ష రుసుము చెల్లించి ఉంది. ఇల్లందులోని పరీక్ష సెంటర్‌లో హాల్‌టికెట్ షీట్లు పరిశీలిస్తే సగానికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోవటం, పరీక్ష రాసిన వారి ఫొటోలు సరిపోలక పోవటం కనిపించింది. తెలియకుండానే అడ్మిషన్లు జరిగి, తప్పుడు పత్రాలతో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తాము చదువుకునే కళాశాలల ద్వారా స్కాలర్‌షిప్ తమకు వచ్చేలా సహకరించాలని బాధిత విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.