ఆంధ్రప్రదేశ్‌

చౌటపల్లిని ముంచెత్తిన కృష్ణా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 21: కడప జిల్లాలోని గండికోట జలాశయంలో నీటిమట్టం మరింత పెరగడంతో చౌటపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వేసిన మట్టికట్టలను తెంచుకుని నీరు ఊళ్లోకి చేరింది. దీంతో చేసేది లేక జనాలు తట్టాబుట్టా సర్దుకుని పిల్లాపాపలతో తరలివెళ్తున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట జలాశయానికి గత కొన్ని రోజులుగా కృష్ణాజలాలు తరలిస్తున్నారు. శనివారం నాటికి గండికోటలో 4.978 టిఎంసిల నీరు చేరింది. పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు ఏర్పాటుచేసిన పైపు పగిలిపోవడంతో గత మూడు రోజులుగా నీటి పంపింగ్ నిలిచిపోయింది. దీంతో గండికోటలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చి శనివారం నాటికి 5 టిఎంసిలకు చేరుకుంది. అవుకు నుంచి 833 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో శనివారం తెల్లవారు జామున గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన మొదటి గ్రామం చౌటిపల్లిలోకి నీళ్లు చేరాయి. గ్రామం చుట్టూ వేసుకున్న మట్టికట్టలు ఒక్కసారిగా తెగిపోవడంతో నీరు గ్రామంలోని ఇళ్లల్లోకి చేరింది. గ్రామంలోకి వెళ్లే రహదారితోపాటు కాశినాయన ఆశ్రమం చుట్టూ నీరు చేరింది. దీంతో 40 కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తట్టాబుట్టా సర్దుకుని పిల్లాపాపలతో గ్రామం వదిలిపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గండికోట జలాశయం కింద ముంపునకు గురైన చౌటపల్లి గ్రామంలో 911 కుటుంబాలు ఉన్నాయి. ఈనెల 9వ తేదీ నుంచి ప్రభుత్వం పునరావాస చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికి గ్రామానికి చెందిన 250 మందికి మాత్రమే పునరావాస చెక్కులు అందాయి. చెక్కులు అందని వారు పరిహారం కోసం గ్రామంలోనే ఉన్నారు. అయితే శనివారం ఒక్కసారిగా నీరు ఇళ్లలోకి చేరడంతో జనం ప్రాణభయంతో ఆందోళనకు గురయ్యారు. పరిహారం చెక్కులు అందకనే ఇండ్లు వదిలిపోతే తమను ఎవరూ పట్టించుకోరని వారు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు వెంటనే పరిహారం చెక్కులు అందజేయాలని కోరుతున్నారు.

ఫొటో రైటప్‌లు

జలదిగ్బంధంలో ఉన్న చౌటపల్లిగ్రామం
సామాగ్రి తెచ్చుకునేందుకు బోటులో వెళ్తున్న నిర్వాసితులు