ఆంధ్రప్రదేశ్‌

భూసేకరణ ఓ గుదిబండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నది ఎడమ గట్టుపై నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి భూసేకరణ గుదిబండగా మారింది. పరిహారం విషయమై పీటముడి పడటంతో రైతులు భూములివ్వడానికి ససేమిరా అంటున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన సమయంలోగా పథకం పూర్తికావడం సందేహాస్పదంగా మారింది. రైతులంతా భూములివ్వడానికి ముందుకొస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు హడావిడి చేస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగావుంది. పరిహారం తేలకుండా భూములిచ్చేది లేదని రైతులు కరాఖండీగా చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, అధికారులు జరిపిన ప్రయత్నాల ఫలితంగా రెండు మూడు గ్రామాలకు చెందిన రైతులు అరకొరగా భూములివ్వడానికి ముందుకొచ్చి అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. వీటినే అధికార యంత్రాంగం మొత్తం రైతులంతా భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్టుగా హడావిడి చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. విశాఖ పారిశ్రామిక అవసరాలకు, ఏలేరు ఆయకట్టు స్థిరీకరణకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.1638 కోట్ల వ్యయంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 9 నెలల వ్యవధిలోనే ఈ పథకం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం స్ఫూర్తితో ఈ పథకాన్ని పూర్తిచేయాలని సంకల్పించారు. అయితే భూసేకరణ ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదు. సిపిఎం ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ఆందోళనలతో మొత్తానికి ప్రభుత్వం ఎకరాకు రూ.28 లక్షల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించింది.
ఈ ప్రాంతంలో సన్న చిన్న కారు రైతులే భూములు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికే నాలుగు పథకాల్లో భూములు కోల్పోయిన రైతుల వద్ద సేధ్యానికి ఎటూ కాని చిన్న చిన్న కమతాలుగా 50 సెంట్లు, 75 సెంట్ల మేరకువున్న భూములు ముందుగా రైతులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీటిని చూపించి రైతులంతా భూములు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా హడావిడి చేస్తున్నారు. ఎకరానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే ఎంతకైనా తెగిస్తామని రైతులు ఆందోళన బాటపట్టారు. చిన్న చిన్న రైతులను అధికార యంత్రాంగం భయపెట్టి ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారని, తమలో చీలిక తెచ్చి తక్కువ ధరకు భూములు లాక్కోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి చినకొండేపూడి, పురుషోత్తపట్నం, నాగంపల్లి, వంగలపూడి, రామచంద్రాపురం గ్రామాల్లో 254 ఎకరాల భూమి అవసరమని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే ప్రస్తుతం 203.69 ఎకరాల భూమే అవసరమని మాటమార్చినట్టు తెలుస్తోంది. 250 ఎకరాల భూమి పైబడి తీసుకుంటే సామాజిక సర్వే నిర్వహించి పరిహారం చెల్లించాల్సిరావడంతో 250 ఎకరాలకు లోపే భూమిని తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అయితే రైతులకు ఎకరానికి రూ.28 లక్షల మేరకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టుగా ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రకటించారు. అయితే ఎకరానికి రూ.50 లక్షలు ఇస్తే తప్ప భూములు ఇచ్చేదిలేదని చెబుతున్నారు. సీతానగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా కూడా చేశారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పోలవరం, పుష్కర, సత్యసాయి మంచినీటి పథకం, తొర్రిగడ్డ పథకాల్లో భూములు కోల్పోయామని, మిగిలిన కాస్తాకూస్తో భూములు ఆధారంగా బతుకుతుంటే ఇపుడు ఆ భూములు కూడా లాక్కోవడం తగదని, ఒకవేళ తీసుకుంటే మాత్రం ఎకరానికి రూ.50 లక్షలు కచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని, మరో చోట తమకు భూములు ఈ పరిహారంతో కొనుక్కోగలిగే పరిస్థితి కల్పించాలని బాధ్యత అధికారులపై వుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకేసారి పరిహారం చెల్లించాలని, పూర్తిగా పరిహారం చెల్లించిన తర్వాతే భూముల్లో పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టిసీమ పథకం పూర్తయినప్పటికీ ఇంకా పరిహారం అందని రైతులు ఉన్నారని, అటువంటి పరిస్థితి ఈ పథకంలో తలెత్తకూడదని రైతులు గుర్తుచేస్తున్నారు.